2720* వ రోజు....... ... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవద్దు.

2720* వ వేకువలోనూ 8+1 మంది!

            ఇంకా 4.30 కూడ కాకముందే గంగులవారిపాలెం వీధిలోకి వాళ్ళ చేరిక! వీధి చివర బండ్రేవు కోడు కాలువ గట్టు మీదికి పోక! 115 నిముషాల పాటు సమన్యయ పూర్వకంగా రహదారి సుందరీకరణానికి పూనిక! గ్రామ స్వఛ్ఛ సౌందర్య పరిరక్షణ కోసం, తన్మూలంగా అందరు గ్రామస్తుల ఆహ్లాదార్ధంగా, స్వచ్ఛ కార్యకర్తలనబడే కొందరి అన్వేషణ!

            ఎవ్వరు అపోహలకు గురైనా, అంతులేని ఓర్పుతో, అత్యధికుల సమ్మతితో చల్లపల్లి గ్రామాన్ని తమ శ్రమదానంతో సమర్చిస్తూ దేశ మందలి లక్షల ఊళ్లలో ప్రత్యేకంగా నిలపాలనే ఒక తపన!

             పాతిక వేల మంది ప్రజల సౌకర్యం కోసం రోజూ పాతిక మందికి పైగా పాతిక వేలకు పైగా మొక్కలు నాటి పెంచితే - కొద్ది మందికా పూల వాసన, పుప్పొడి సుగంధం వెగటనిపించినా అనిపించవచ్చు!  చిన్నా - పెద్దా రహదారి వనాల పెంపకాన్ని వేరే  కోణంలో చూసినా చూడవచ్చు! 

             అత్యధికుల్ని సమాధాన పరుస్తూ - భాగస్వాముల్ని చేస్తూ - గ్రామ స్వచ్చ సుందరోద్యమం అడుగులు ముందుకు పడక తప్పదు! ఆ బాటలోనే నేటి 8 మంది రెస్క్యూ దళ సభ్యుల కదలికలు!

            ఈ వేకువ కూడ మురుగు కాల్వ ఉత్తరపు గట్టు మీద భారీగా పెరిగి, తప్పించక తప్పని నాలుగైదు చెట్ల కొమ్మల్ని వాళ్లు తొలగించారు!

            ఒక మంచి ప్రయోజనం కోసం మరొకటి కోల్పోక తప్పదని కొందరు ఏవో నిష్పత్తులు చెపుతుంటారు. అలాంటిదే నేటి కార్యకర్తల వృక్ష సుందరీకరణ! బాట ప్రక్క చెట్ల పొందిక కోసం, కరంటు తీగల దగ్గరికవి పోకుండ చూడడం కోసం వాళ్లు చేస్తున్న వృక్ష శాఖా ఖండనంతో పచ్చదనం అనివార్యంగా తాత్కాలికంగా తగ్గుతున్నది!

 

            6.20 దాకా శ్రమించి, చెట్ల పైకెక్కి, తామనుకొన్నది సాధించి, ఆస్పత్రి దగ్గరకు చేరుకొన్న కార్యకర్తలు కస్తూరి శ్రీనివాసుని గ్రామ స్వచ్ఛ - శుభ్ర - సౌందర్య సాధనా సంకల్ప నినాదాలతో నేటి శ్రమదాన కథను ముగించారు.

28.03.2023 నాటి పెద్ద విశేషం:

            గతంలో వరుసగా ఇస్తున్నట్లే మనకోసం మనంట్రస్టుకు పెద్దలు రావూరి సూర్య ప్రకాశ మహోదయులూ, వారి శ్రీమతి కొండపల్లి లక్ష్మీకుమారి గారలు 25 వేల భూరి విరాళం మేనేజింగ్ ట్రస్టీ గారికి D.D రూపంలో ఇచ్చినందుకు మన ధన్యవాదములు.

            రేపటి రహదారి మెరుగుదల శ్రమదానం కోసం మనం కలిసి సాగదగినది బెజవాడ దారిలో బాలాజీ అపార్ట్మెంట్ల వద్ద!

            దానానికి కృతజ్ఞతలు!

ఉంటే ప్రతి ఊరు చల్లపల్లి లాగె ఉండాలని -

ప్రతి వీధీ గంగులపాలెం బాటగ మారాలని -

హరిత వనం - సుమ గుచ్ఛం అడుగడుగున నిలవాలని

పించేట్లుగ తీర్చిన శ్రమ దానానికి కృతజ్ఞతలు!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   28.03.2023.