1932* వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!   

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం1932* వ నాటి శ్రమదాన వార్తలు.

 

యథా ప్రకారం ఈ నాటి శుభోదయాన కూడ వేకువ 3.58-6.14 నిముషాల నడుమ సంభవించిన స్వచ్చంద శ్రమదానం శ్రద్ధగా- సందడిగా-బాధ్యతగా-క్రమ పద్ధతిగా సాగింది. గ్రామాభ్యుదయ నిబద్ధులైన 28 మంది స్వచ్చ కార్యకర్తల దైనందిన బాధ్యతల నిర్వహణ కు నేడు నోచుకొన్న ప్రాంతం-బందరు మార్గంలోని 6 వ నంబరు పంట కాలువ వంతెన నుండి భారత లక్ష్మి వడ్ల మర వీధి వరకు.

 

సవివరంగా వ్రాయాలంటే- నేటి కార్యకర్తల కృషి వివరణ సుదీర్ఘమైపోతుంది. స్థూలంగా చెప్పాలంటే-

 

- ముందుగా పేర్కొన వలసింది గ్రామ రక్షక దళ విభాగం వారు గంగులవారిపాలెం దారిలో నిన్న ట్రస్టు కార్మికులు అందం కోసం కత్తిరించిన-గుట్టలుగా పడి ఉన్న వెదురు కొమ్మలు-రెమ్మలన్నిటిని ట్రక్కులో నింపుకొని, వచ్చారు. వీరు తదుపరి మరి కొందరితో గలిసి, ప్రక్కనే ఉన్న జాతీయ రహదారి కార్యకర్తలు ఊడ్చి, పోగులు చేసిన దుమ్మును, మట్టిని, ఇసుకను, నిన్నటి తిను బండరాల బళ్ల వ్యర్ధాలను డిప్పలతో సేకరించి, గురవారెడ్డి బహూకృత ఏస్ వాహనంలో కి ఎక్కించారు.

 

- ఇక సుందరీకరణ ముఠా వారి కృషి-ఊరిలో ఎక్కడెక్కడి మారు మూల కల్మషాలు వీళ్ల కంట బడక దాక్కోలేవు. మనకు అందంగానే ఉందనిపించేది వీళ్లకు సంతృప్తి కలిగించదు.  దారి ప్రక్క టైల్స్ ను, కళాశాల ముఖద్వారం ముంగిట రంగు రాళ్లను ఒకటికి మూడు మార్లు ఊడ్చి, తెల్లారి ఆ ప్రాంతం తమకు నచ్చినపుడు గాని వదల్లేదు!

 

- 15 మంది కి పైగా చీపుళ్ల వీరులు సుమారు ½ కిలో మీటరు దాక ఈ జాతీయ రహదారి మీది దుమ్ము, ఇసుక, ఇతర వ్యర్ధాలనూ ఊడ్చి పోగులు పెట్టుకుంటూ పోయారు. (సాధారణంగా వీరిలో నలుగురు 6.15 సమయం దాటుతున్నా స్వచ్చ కృషి ఏ రోజూ ఇష్ట పూర్వకంగా విరమించారు!)

 

6.40 కు జరిగిన స్వచ్చ-సుందర శ్రమ విన్యాస సమీక్షా సమావేశంలో:

- చిరు తిళ్ల, చిరు దాన వ్యసన పరుడు-75 ఏళ్ల ఉడత్తు రామారావు గారు బిస్కెట్ పొట్లాల పంపిణీ చేసి, ఈ మధ్యాహ్నం 12.00 కు తాము జరుపుతున్న “ అవతార్ మెహెర్ బాబా” జన్మదినోత్సవ విందు భోజనాలకు ఆహ్వానించారు.

 

- ఆసక్తి గల కార్యకర్తలకు “ వామపక్ష ప్రణాళికా పుస్తకాల పంపకం నేడు జరిగింది. కొర్రపాటి వీరసింహుని స్వచ్చ-శుభ్ర-సుందర సంకల్ప నినాదాలతో నేటి శ్రమదాన పండుగ ముగియగా-

 

రేపటి మన శ్రమ వేడుకను పెదకళ్లేపల్లి దారిలోని గ్యాస్ కంపెనీ ప్రాంతంలో నిర్వహిద్దాం!

       

       స్వచ్చ- సుందర- శుభ్ర శోభలు

కులమతమ్ముల- ప్రాంత పరిధులు కొంచెమైనా తాకి తలవక

స్వచ్చ-సుందర-శుభ్ర దీక్షా శోభతో మునుముందు కేగుచు

మాతృగ్రామం మెరుగుదలకై  మహా దీక్షా దక్షతలతో

స్వచ్చ సైన్యం నిజంగానే చల్లపల్లిని సంస్కరిస్తుందా!

         

నల్లూరి రామారావు

స్వచ్చ చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

మంగళవారం – 25/02/2020

చల్లపల్లి.