ది. 04.06.2019 న కలెక్టర్ గారు చల్లపల్లి ని సందర్శించినప్పుడు అందించిన వినతిపత్రం

గౌరవనీయులైన కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి,

నమస్కారములు,

తమరు దయతో స్వచ్చ సుందర చల్లపల్లి ని సందర్శించడానికి అంగీకరించినందుకు ధన్యవాదములు.

గత నాలుగున్నర సంవత్సరాల నుండీ(12.11.2014 నుండీ) ప్రతి రోజూ 40 నుండి 50 మంది కార్యకర్తలు ఉదయం 4.30 నుండీ 6.00 గంటల వరకు స్వచ్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి మీకు తెలిసినదే!

ఆ సమయంలో మేము

  • రోడ్లు, రోడ్ల మార్జిన్లు శుభ్రం చేయడం,
  • Jungle clearance చేయడం,
  • డ్రైన్లు శుభ్రం చేయడం,
  • మొక్కలు నాటి వాటికి రక్షణగా కంప కట్టటం,
  • మొక్కలకు నీళ్లు పోయటం,
  • శ్మశానం, డంపింగ్ యార్డ్ శుభ్రం చేయడం,
  • గోడలకు రంగులు వేసి అందంగా చేయడ,
  • పరిసరాల పరిశుభ్రతపై, బహిరంగ మల విసర్జనపై ప్రజలకు అవగాహన కల్పించడం చేస్తున్నాము.

మా లక్ష్యాలు:

  1. పరిశుభ్రత
  2. పచ్చదనం
  3. సుందరీకరణ

సాధించినవి:

  1. పరిశుభ్రతపై ప్రజలలో అవగాహన కల్పించగలిగాము. రోడ్ల మీద, డ్రైన్లలోనూ చెత్తను పారవేసే అలవాటు తప్పు అని 90% ప్రజలు భావిస్తున్నారు. ప్రతి రోజూ లేదా కనీసం రెండు రోజుల కొకసారి చెత్త బండి వస్తే, చెత్తను అందించటానికి సిద్ధంగా ఉన్నారు.
  2. గ్రామమంతటా ఐదు వేలకు పైగా మొక్కలను నాటి, సంరక్షించినాము. అవకాశమున్న అన్ని చోట్ల లోనూ రహదారి వనములను తయారు చేసినాము.
  3. గ్రామాభివృద్ధి కోసం ”మనకోసం మనం” ట్రస్టును స్థాపించినాము.
  4. R.T.C.అధికారుల అనుమతితో చల్లపల్లి Bus stand ను శుభ్రపరచి, రంగులు వేయించి, తోటలను అభివృద్ధి చేసి సుందరీకరించినాము.
  5. 70 వ్యక్తిగత టాయిలెట్లను కట్టించినాము. 198 టాయిలెట్లకు ధన సహాయం చేసి 29.04.2017వ తేదీన గ్రామం  ODF గా ప్రకటింపబడటానికి మా వంతు కృషి చేసినాము.
  6. NTR పార్క్ లోనూ, నాగాయలంక రోడ్డు లోనూ పబ్లిక్ టాయిలెట్లను నిర్మించి, నిర్వహించుచున్నాము.
  7. గంగులవారిపాలెం రోడ్డు లో 400మీటర్ల వరకు Under Ground Drainage ని నిర్మించి, Land Scaping చేయించి, తోటను తయారు చేసి నిర్వహిస్తున్నాము.
  8. తయారు చేసిన ప్రతి తోటకు తోటమాలిని నియమించి నిర్వహిస్తున్నాము.
  9. శ్మశానాన్ని సుందరంగా తయారు చేసి నిర్వహిస్తున్నాము.
  10. చెత్త నుండి సంపద కేంద్రాన్ని తయారు చేసి పంచాయితీ కి అప్పగించినాము. ఆ ప్రాంతాన్ని అత్యంత సుందరంగా తయారు చేసినాము.
  11. ప్లాస్టిక్ రహిత హరిత వేడుకలను (Green Functions) ప్రోత్సహిస్తున్నాము. చల్లపల్లి లో ఇప్పటికి అనేక హరిత వేడుకలు జరిగినవి.  
  12. క్యారి బాగులు వాడవద్దని ప్రజలకు కౌన్సిలింగ్ చేసి ‘కొద్ది మార్పును’ తీసుకురాగలిగాము.

అయ్యా,

చల్లపల్లి ఇంకా మా కష్టానికి తగినంత శుభ్రం గా లేదని భావిస్తున్నాము. చల్లపల్లి ”స్వచ్చ సుందర చల్లపల్లి” గా మారడానికి మీ సహకారం కావాలి.

గ్రామాభ్యుదయం కోసం ఈ క్రింది కోరికలను తమరికి విన్నవించుకుంటున్నాము.

  1. Main Road లో ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం చెత్తను సేకరించాలి. ప్రతి ఇంటి నుండి రెండు రోజులకు ఒకసారి తడి చెత్త, పొడి చెత్త విడివిడిగా సేకరించాలి.

          ఈ విధంగా చెత్త సేకరణ జరిగేటట్లు పంచాయితీ శానిటరీ సిబ్బందిని ఆదేశించగలరు. ఈ విధానాన్ని నెలకొల్పిన తరువాత కూడా ఎవరన్నా రోడ్డు మీద చెత్త వేస్తే జరిమానా విధించాలి.

          ఈ ఒక్క పని పంచాయితీ వారు చేయగలిగితే మా కార్యకర్తల కష్టానికి ఫలితం వచ్చినట్లే!

  1. చెత్త నుండి సంపద కేంద్రాన్ని శాస్త్రీయంగా నిర్వహించవలసినదిగా పంచాయితీని ఆదేశించగలరు.
  2. ఫ్లెక్సీ లను అనుమతి లేకుండా పెడితే జరిమానా విధించవలెను. ఫ్లెక్సీ లు పెట్టే వారు ఎన్ని రోజులకు అనుమతి తీసుకుంటారో అన్ని రోజుల తరువాత వెంటనే వారే ఫ్లెక్సీలు తీయవలెనని నియమం విధించగలరు. అలా తీయకుంటే జరిమానా విధించమని పంచాయితీని ఆదేశించవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అలానే రహదారి వనములకు అడ్డు వచ్చేటట్లుగా ఫ్లెక్సీలను పెట్టకుండా చూడగలరు.  
  3. 50 మైక్రాన్ల లోపు క్యారీ బాగులను ప్రభుత్వం నిషేధించినప్పటికీ క్యారీ బాగుల వాడకం విచ్చలవిడిగా జరుగుతోంది.ఎంత పలచటి క్యారి బాగ్ అయినా ప్రింట్ మాత్రము 50 మైక్రాన్ల కంటే దళసరిదే అని ఉంటోంది.

          మన జిల్లాలో 100 మైక్రాన్ల లోపు క్యారీ బాగులను నిషేధించడానికి అవకాశం ఉంటే పరిశీలించగలరు.

  1. Single use plastic ను నిషేధిస్తే 50% ప్లాస్టిక్ వినియోగం తగ్గి పర్యావరణానికి ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. గ్రామం ఎంతో సుందరంగా ఉంటుంది.

(ప్రపంచంలో ప్లాస్టిక్ ఉత్పత్తిలో 50% single use plastic వస్తువులదే!)

గ్రామంలో నిషేధించవలసిన వస్తువులు:

  1. ప్లాస్టిక్ గ్లాసు
  2. ప్లాస్టిక్ విస్తరాకు
  3. తగరం విస్తరాకు(ఇది ప్లాస్టిక్ కానప్పటికీ భూమిలో కరగదు కనుక)
  4. క్యారీ బాగులు(100 మైక్రాన్ల లోపు)
  5. ప్లాస్టిక్ స్ట్రాలు ( ఇప్పుడు వచ్చే straws అన్నీ ప్లాస్టిక్ వే)
  6. ప్లాస్టిక్ స్పూన్లు, ఫోర్క్ లు
  7. ప్లాస్టిక్ పన్ను పుల్లలు
  8. ప్రభుత్వ కార్యక్రమాలలో ఫ్లెక్సీ లు వాడటం మానివేస్తే మిగిలిన ప్రజా సముదాయాలను inspire చేయవచ్చు.
  9. ప్రభుత్వ కార్యక్రమాలలో water bottles ను వాడకం మానివేసి గాజు గ్లాసులు, స్టీల్ గ్లాసులు వాడితే ఆదర్శం గా ఉంటుంది.
  10. ఖాళీ స్థలాలు చెత్త కేంద్రాలుగానూ, మురికి కూపాలు గాను ఉంటున్నాయి. వీటిని మెరక చేసి శుభ్రంగా ఉంచుకోవడం యాజమానుల విధి అని ఆదేశించగలరు.
  11. చల్లపల్లి ప్రధాన రహదారుల ప్రక్కన ఉన్న డ్రైనులన్నీ పూడికతో నిండిపోయి ఉన్నవి. వర్షాలు వచ్చే లోపునే వీటి పూడికలు తీయించవలసినదిగా శానిటరీ అధికారులను ఆదేశించగలరు.

          మూతలు లేని డ్రైన్లలో చెత్త వేయటం ప్రజలకు అలవాటు. కనుక డ్రైన్లు అన్నిటికి మూతలు వేయించవలసినదిగా శానిటరీ సిబ్బందిని ఆదేశించగలరు.

  1. రోడ్డు మార్జిన్ నుండి డ్రైన్ వరకు చాలా మంది మెరక వేసుకోవడం వలన రోడ్డు మీద నీళ్ళు నిలిచిపోయి రోడ్లు పాడైపోతున్నాయి. కనుక రోడ్డు మార్జిన్ నుండి డ్రైన్ వరకు ఉన్న మెరకలన్నీ తీయించవలసిందిగా పంచాయితీ వారిని ఆదేశించగలరు.
  2. డ్రైన్ల మీద ఉన్న ఆక్రమణలను తొలగించవలెను. లేకుంటే డ్రైన్లు శుభ్రం చేయడం సాధ్యం కాదు.
  3. చల్లపల్లిలోని కోమలా నగర్ కు డ్రైనేజి సౌకర్యం లేదు. అక్కడ అపార్ట్మెంట్ల వారు ఒక నుయ్యి తొవ్వి అందులోకి మురుగు నీటిని పంపుతున్నారు. నుయ్యి నిండి రోడ్ల మీదకు మురుగు ప్రవహించడమే కాకుండా ground water కూడా pollute అవుతోంది. ఈ విధంగా చేయడం ప్రజారోగ్యానికి అత్యంత ప్రమాదకరమని ”విజయ సారథి” గారి వంటి విశ్రాంత అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

          మురుగు నీటిని సక్రమంగా డ్రైనేజి కాలువ లోనికి కలుపని అపార్ట్మెంట్లకు అనుమతిని ఇవ్వరాదు. భూగర్భంలోనికి మురుగును పంపించే వారికి జరిమానాను విధించగలరు.

  1. 11. పోస్టర్లను ఎక్కడ పడితే అక్కడ అతికించడం పరిపాటి. ఒంగోలు వలే చల్లపల్లి కూడా poster free village గా అవ్వాలని స్వచ్చ కార్యకర్తల కోరిక. ప్రత్యేక ప్రదేశాలను కేటాయించి ఆ ప్రాంతంలోనే పోస్టర్లు పెట్టాలని ఆదేశిస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది.
  2. 12. బహిరంగంగా మధ్యపానం సేవించడం నేరమైనప్పటికీ చల్లపల్లిలో అనేక చోట్ల యధేచ్చగా సాగుతోంది. దీనిని నివారించడానికి సంబంధిత అధికారులకు ఆదేశాలను జారీ చేయగలరు.

          బెల్టు షాపులు కూడా విచ్చలవిడిగా ఉన్నాయి. 

  1. 13. శ్మశానంలో Infrastructure అభివృద్ధి చేయడానికి, మరింత సుందరంగా తయారు చేయడానికి పంచాయితీ వారు అనుమతించారు. ముఖ ద్వారమును వెడల్పు చేయుటకు డ్రైనేజ్ డిపార్ట్మెంట్ నుండీ కూడా అనుమతి ఇప్పించగలరు.
  2. 14. ప్రహరీ గోడలకు తలుపులను బయటకు కాకుండా లోనికి మాత్రమే తెరుచుకునేట్లుగా ఏర్పాటు చేసుకోవాలనే నిబంధన ఉన్నది. పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యాను, ఆక్సిడెంట్లు అవ్వకుండా ఉండడానికి ఈ నిబంధనను ఖచ్చితంగా అమలుచెయ్యాలని ఆదేశాలను జారీ చేయగలరు.

ఇట్లు

డా.డి.ఆర్.కె. ప్రసాదు

డా. టి.పద్మావతి

(స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్తల తరపున)

03.06.2019

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *