స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1817* వ నాటి తీరు తెన్నులు (02.11.2019)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1817* వ నాటి తీరు తెన్నులు.

వానలు తగ్గి, చలికాలం తొందరపడిన నేటి వేకువలో 4.07-6.05 నిముషాల మధ్య అవనిగడ్డ మార్గంలో జరిగిన గ్రామ స్వచ్చంద సేవలో మునిగిన కార్యకర్తలు 34 మంది.

    5.00 కు నేను గమనించే సమయానికి వీళ్లు 3 ముఠాలుగా పని చేస్తున్నారు. మొదటి గుంపు 7 వ నంబరు పంట కాల్వ సమీపంలో దారి ప్రక్కన, మిల్లు ద్వారం దగ్గర దట్టంగా పెరిగిన గడ్డి, పిచ్చి-ముళ్ల కంపల మీద కుస్తీలు పట్టి గెలవగా-

     రెండవ ముఠా అమర స్తూపం, కాసా నగర్ ల మధ్య గడ్డిని తొలగిస్తూ, పాత మొక్కల పాదుల్ని సవరిస్తూ, కొత్త పాదులు తీసి, అడవి తంగేడు అనబడే 150 గద్ద గోరు పూల మొక్కల్ని నాటారు.

స్వచ్ఛ కార్యకర్తల 3 వ సమూహం (వీళ్లకే “సుందరీకరణ బృందం” అనే పేరు చలామణిలో  ఉంది). అమరస్థూపం-తారు మార్గం ల మధ్య గల- తామే గతం లో నాటిన బిళ్ల గన్నేరు మొక్కల మధ్య కలుపు తీసి, గడ్డి చెక్కి, చదును చేస్తున్నారు.

మిగిలిన వారిలో రోడ్డు మీద చీపుళ్లకు పని చెప్పేవారు, మంచి నీళ్లు అందించే వారు,పూల మొక్కలు సరఫరా చేసే వాళ్లు, ఈ అందరి స్వచ్చంద శ్రమదాన నేపధ్యంలో వినిపిస్తున్న ఆలోచనకు పదును పెట్టే- స్వచ్చతా స్ఫూర్తిని రగిలించే ప్రయోజనకరమైన పాటలు-ఇదీ ఆలస్యంగా వెళ్లిన నాకు నేడు కనిపించిన ఆదర్శవంతమైన శ్రమ  జీవన సౌందర్యం!

ప్రత్యక్షంగానో – పరోక్షంగానో 30-40 గ్రామాల వేలాది బుద్ధి జీవులకు నిరంతర ప్రేరణనిస్తున్న చల్లపల్లి స్వచ్చోద్యమం చిర కాలం వర్ధిల్లుగాక!

నేను వ్రాస్తున్న ఈ దైనందిన “వాట్సాప్” సందేశాలను మన వేముల శ్రీను వంటి కార్యకర్తలు, విజయవాడ తదితర ప్రాంతాల మరి కొందరు పాఠకులు చాలా బాగుంటున్నాయని చెప్పటం హర్షణీయమే గాని-అలా వ్రాయటానికి 1817 రోజులుగా నాకు స్ఫూర్తినిస్తున్న స్వచ్ఛ కార్యకర్తల దీక్ష, నిబద్దత, నిస్వార్థతలు సామాన్యమైనవామరి?

నేటి కాఫీ అనంతరం సమావేశంలో బుద్ద ప్రసాద్ గారికి నిన్నటి సన్మానం, యార్లగడ్డ, యల్లాయ పాలెం వంటి కొంగ్రొత్త స్వచ్చోద్యమాలను దాసరి రామ కృష్ణ ప్రసాదు గారు ప్రస్తావించారు.

ఇప్పుడిప్పుడే గత నెల రోజుల జ్వరం నుండి కోలుకొంటున్న యోగా వేంకటేశ్వర్రావు గారు ధ్వనించిన స్వచ్ఛ సంకల్ప నినాదాలతో 6.35 కు నేటి బాధ్యతలకు స్వస్తి. శాస్త్రి గారి, యోగా వారి 5000/-, 1500/- విరాళాలకు కృతజ్ఞత.

         రేపటి స్వచ్ఛ శ్రమదానం కూడ అవనిగడ్డ దారిలోనే.

 

           అలా జరిగే ఉంటే?

గ్రామాభ్యుదయం కోసం కష్టించక-తపన పడక

వందలాది ఈ చేతుల పారిశుద్ధ్య  పనులు లేక

“మనకోసం మనం” ఊరు నంతను పట్టించుకోక-

చల్లపల్లి గతైదేళ్ల స్వచ్ఛత ఎట్లుండేదట?

 

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

శనివారం – 2/11/2019

చల్లపల్లి.

14.07 కు నాగాయలంక రోడ్డులో 3 4 7 9 10 11 13 15 16 18 24 26 28 29 30 31 35 36 38 40 41 42 44 45 47 48 50 51 53 55 59 60 62 64 69

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *