స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1836* వ నాటి ప్రత్యేకతలు.

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1836* వ నాటి ప్రత్యేకతలు.

ఈ నాటి బ్రహ్మ ముహూర్తాన – 3.59-6.05 సమయాల నడుమ- నడకుదురు దారిలోని శ్రీనగర్ పరిసరాలలో జరిగిన స్వచ్చంద శ్రమదాన స్పర్దలో 30 మంది కార్యకర్తలు పాల్గొని, క్రింది విభాగాలలో కృషి చేశారు.

1) మేకవారిపాలెం వైపుగా గతంలో తామే నాటి పెంచిన చెట్లను, పూల మొక్కల్ని పాదులు చేసి, గడ్డిని-పిచ్చి మొక్కల్ని తొలగించి, పెద్ద చెట్ల కొమ్మల్ని ట్రిమ్ చేయడం-

2) సుందరీకరణం ముఠా అక్కడి మూడు రోడ్ల కూడలిలో గతంలో తాము నెలకొల్పిన రహదారి మినీ వనాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో గడ్డిని పిచ్చి మొక్కల్ని తొలగించి, నేలను నారుమడిలా తయారుచేయడం-

3) మరికొందరు కత్తి వీరులు లయన్స్ క్లబ్ ఆఫీసు భవనం రోడ్డు లో కొంత భాగాన్ని నిరర్ధక పిచ్చి కంపలను తొలగించి, దారికడ్డం వచ్చే చెట్ల కొమ్మల్ని అదుపు చేస్తూ-ఆ వ్యర్ధాలన్నిటినీ ట్రాక్టర్ లోకి ఎక్కిస్తూ లీనమైపోవడం-

4) ఈ నడకుదురు మార్గంలో 28, పాగోలు దారి కిరుప్రక్కల 22- మొత్తం 50 అడవి తంగేడు పూల మొక్కల్ని పాదులు త్రవ్వి డ్రైన్ల లోని నీటిని బక్కెట్ల తో తెచ్చి పోసి, నాటడం-

ఈ ఋతువులో ఇప్పటికి కార్యకర్తలు నాటిన బంతి, బిళ్ల గన్నేరు, గద్ద గోరు వంటి పూల మొక్కలు సుమారుగా (1800+1500+2000+1000) ఆరు వేలు ఉండవచ్చు.(అవన్నీ వాళ్ల సొంత ఇళ్ల అందాలు పెంచుకొనేందుకు కాక, సమస్త గ్రామస్తుల ఆహ్లాదం కోసమనేది ఇక్కడ విశేషం!)

కాఫీ అనంతర సరదా సమావేశంలో చల్లపల్లి గ్రామ స్వచ్చ-శుభ్ర-సౌందర్య సంకల్ప నినాదాలను ఉద్ఘాటించే అవకాశం నిన్న దేసు మాధురి గారి దైతే-నేడు గోళ్ల విజయ కృష్ణ గారిది. ఈయన తాను గత రెండు రోజులు గ్రామ స్వచ్చ కృషికి రానందున విచారం వెలిబుచ్చారు.
మానవ వైద్యులు-పశు వైద్యుల్లాగే రాజమండ్రికి చెందిన- హైద్రాబాదులో నివశిస్తున్న ఒక రోడ్ల డాక్టరు గారి దశాబ్దాల ఆదర్శ కృషి గురించి, డాక్టర్ దాసరి రామ కృష్ణ ప్రసాదు గారు ప్రస్తావించారు. ఎందరెందరో సేవా మూర్తులు, ఆసక్తులు గతంలో సందర్శించినట్లే- ఈ ‘రోడ్ల వైద్యుడు’ కూడ మరో మూడు రోజుల్లో- శనివారం నాడు మన స్వచ్చ సుందర చల్లపల్లిని, కార్యకర్తల సుదీర్ఘ శ్రమదానాన్ని పరిశీలించి, ఆశీర్వదించబోతున్నారు.

రేపటి మన దైనందిన శ్రమదానం మెహెర్ వడ్ల మర (నడకుదురు దారి) సమీపంలోనే.

గొప్పదనీ-తప్పదనీ…
ఎవరికొరకు స్వచ్చోద్యమ-మెందులకీ నిత్య సేవ-
పరిశుభ్రత-పచ్చదనం-స్వచ్చతలను చేరు త్రోవ?
ఏ ప్రగతి కొ-ఏ వెలుగు కొ- ఏ నిమిత్తమీ పయన మొ
గ్రహించిన గ్రామస్తులంత కలసి కదం త్రొక్కు రోజు…

నల్లూరి రామారావు,
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,
సభ్యులు – మనకోసం మనం ట్రస్టు,
గురువారం – 21/11/2019,
చల్లపల్లి.

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *