20.02.2021....           20-Feb-2021

          స్వచ్చ సైనిక అంతరంగం

 

నేను సైతం చల్లపల్లి కి చెమట చుక్కలు ధార పోశాను

నేను సైతం వీధి వీధిన పారిశుద్ధ్యం నిర్వహించాను

నేను సైతం దారి ప్రక్కన మురుగు కాల్వకు నడక నేర్పాను

                                       నేను సైతం చల్లపల్లికి

 

దారులన్నీ పొదలు మూసి – మల విసర్జన బాహ్యమైతే

చెత్త రోడ్లను క్రమ్ముకొచ్చీ-ప్రజారోగ్యం పడక వేస్తే

దోమలీగలు ముసిరి జబ్బులు దుందుభులు మ్రోగించినప్పుడు

జనంలో చైతన్య ముండక- దిక్కు తోచక - దారి కానక

కలత చెందీ-కలవరించీ-కాగి పోయనే

                        నేను సైతం చల్లపల్లి కి

 

ప్లాస్టిక్ ఊరిని ముంచివేసీ-పర్యావరణం భగ్నమైతే

కొరడు గట్టిన చెట్లె తప్ప- హరిత వృక్షపు సంఖ్య చాలక

ప్రాణ వాయువు లుప్తమై – నా గ్రామమే నిస్తేజమైతే

దారి కానక- దిక్కు తోచక- దైన్య స్థితిలో ఉండిపోలేదా....

                      నేను సైతం చల్లపల్లికి


నా గృహాన్ని నేను కాక- వార్డు మెంబరు ఊడ్చి పోవాలా?

బజారెక్కిన మురుగు కాల్వలు మంత్రి వచ్చీ బాగు చెయ్యాలా?

మనకు మనమే ఊరి మేలుకు మహా కృషి సాగించనేలేమా?

అందరొకటిగ ఉన్న ఊరిని నందనంగా మార్చుకోలేమా?

 

 నేను సైతం స్వచ్చ సంస్కృతి నీడలో ఇక సాగి పోతాను

నేను సైతం కన్న ఊరికి స్వచ్చ సేవల నందజేస్తాను

నేను సైతం స్వచ్చ సైన్యం నీడలోనె పురోగమిస్తానూ

                        నేను సైతం చల్లపల్లికి

 

నేను సైతం స్వచ్చ సైన్యం నీడలోనె పురోగమిస్తాను

నేను సైతం స్వచ్చ సంస్కృతి నిండు మనసుతొ స్వీకరిస్తాను

స్వచ్చ సైన్యం నీడలోనె పురోగమిస్తానూ...

ఆ నీడలోనె పురోగమిస్తానూ....