6 సంక్రాంతులు, 5 రంజాన్లు, 6 క్రిస్టమస్ లకు సాక్షీ భూతమైన స్వచ్చ్యోద్యమం :....           15-Jan-2020

 6 సంక్రాంతులు, 5 రంజాన్లు, 6 క్రిస్టమస్ లకు సాక్షీ భూతమైన స్వచ్చ్యోద్యమం :

 
పండుగలేవైనా ప్రజలకు ఉత్సాహాసమయాలే. కొన్ని సంప్రదాయాలను పాటిస్తూ కుటుంబం తోనో, సమాజంతోనో ఉల్లాసంగా గడిపే క్షణాలివి.

దక్షిణ భారతీయులకు ముఖ్యంగా తెలుగు వారికి అతి పెద్దదైన సంక్రాంతి కేవలం మతపరమైన పండుగ కాదు. ఆరుగాలం ఎండ, వాన, మంచుల్లో శ్రమించే కర్షకులకూ, వ్యవసాయాధార కూలీలకూ పంటల పండగగా - ఒక సామాజిక వేడుక గా భావించవచ్చు!
 
సామాజిక విశిష్ట ఉద్యమాల్లో విభిన్నమైన- ప్రత్యేకమైన ఈ 1891 రోజుల -2 లక్షల పని గంటల స్వచ్చ చల్లపల్లి ఉద్యమం ఇప్పటికి 6 సంక్రాంతి పండుగలను చూసింది. చల్లపల్లి స్వచ్చ- సుందరతలకూ, తద్వారా 25 వేల మంది ఆనంద- ఆరోగ్యాలకూ నిస్వార్ధంగా- నిర్విరామంగా పాటుబడుతున్న స్వచ్చ సైనికులకు కూడ ఈ సంక్రాంతి సందర్భం ఒక ఆట విడుపు!
 
బహిరంగ మల విసర్జనా నిలయమై- పొదలతో మూసుకుపోయి, గజంన్నర దారి మాత్రం కనిపించే ప్రభుత్వ బాలికల వసతి గృహ పరిసరాలను నెల రోజులపాటు శుభ్ర-సుందరీకరించి, 2015 సంక్రాంతి 3 రోజులూ స్వచ్చ కార్యకర్తలు అక్కడే సగం పండుగను జరుపుకొన్నారు. పైడిపాముల కృష్ణ కుమారి దంపతుల, కొడాలి మురళి పట్టుదలతోడై తామక్కడ సాధించిన స్వచ్చ-శుభ్రతలకు ఉద్వేగంతో జరుపుకొన్న సంక్రాంతి అది!
 
2016 లో డాక్టర్ డి. ఆర్. కె. ప్రసాదు, డాక్టర్ పద్మావతి గారలు, ఆస్ట్రేలియా,న్యూజిలాండ్ ల పర్యటన ముగించుకొని వచ్చిన సందర్భంలో ఆ హాస్టల్ దగ్గరే బహిరంగ సభ జరుపుకొని, అల్పాహార విందు చేసుకున్నాం.
 
2017 లో బైపాస్ మార్గంలోని కస్తూర్బాయి పాత ప్రభుత్వాసుపత్రి ఎదుట బోగి మంటలు వేశాము.
 
2018, 2019, 2020 ల మూడు సంక్రాంతులూ వందలాది కార్యకర్తల- గ్రామస్తుల సమక్షంలో బోగి మంటలతో- క్షీర పొంగళ్లతో- కోలాట ప్రదర్శనలతో- హరిదాసుల వేషధారణతో- చిన్నారుల బోగి పండ్లతో ATM కేంద్రం వద్దనే పండుగ జరుగుతున్నది.
 
ఐతే క్రిస్టమస్ కు కేకులు-మిఠాయిలు పంచినా, సంక్రాంతికి సాంప్రదాయ వంటకాల పంపిణీ చేసినా కార్యకర్తలు తమ స్వచ్చోద్యమ సందేశాన్ని అన్ని సందర్భాలలోనూ అంతర్లీనంగా ఆచరణ పూర్వకంగా ప్రసరించడం మానకపోవడం అభినందనీయం!
 
నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,
సభ్యులు- మనకోసం మనం ట్రస్టు,
బుధవారం – 15/01/2020
చల్లపల్లి.