2784* వ రోజు....... ....           31-May-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా?

2784* వ వీధి శుభ్ర - సుందరీకరణ ప్రయత్నం!

          ఈ బుధవారం వేకువ (31.05.2023) 24 మంది శ్రమదాతలది తనివితీరా వ్రాయాలంటే - ఒక్కొక్కరిదీ ఒక్కొక చరిత్ర! చల్లపల్లి స్వచ్ఛ - సుందరోద్యమ మనేది ఒకానొక సామూహిక - సంఘటిత కృషి కనుక వ్యక్తిపరంగా వ్రాయడం కుదరటం లేదు!

          నేటి శ్రమదాన ప్రారంభోత్సవం మరీ 4.17 కే - బైపాస్ వీధిలో వడ్లమిల్లు వీధి కలిసే చోటు నుండి నవగ్రహ కార్యకర్తలతో జరిగి - రెండు డజన్ల మందితో 6.08 నిముషాలకు ముగిసింది. అది సుమారు 100 - 120 గజాల - రెండు వీధులకు విస్తరించింది.

          తక్కిన దేశాల మాటేమో గాని – మన దేశ - రాష్ట్ర ప్రగతేమంటే - వీధులున్నది అందినకాడికి ఆక్రమణల కోసమూ, ఇళ్ల వ్యర్థాల్ని గుమ్మరించడానికీ, ఏళ్ల తరబడీ ఇళ్ల ఎదుట పనికిమాలిన వ్యర్ధాల్నీ, పిచ్చి - ముళ్ల మొక్కల్ని చూస్తూ - భరిస్తూ ఉండడానికి!

          ఐతే - ఒక దశాబ్దంగా ఈ చల్లపల్లి కథ వేఱు - ఒక 100 - 150 మంది స్వచ్చోద్యమకారుల గుంపుతో ఇక్కడొక గ్రామ సామాజిక శ్రమదాన చరిత్ర కాస్తంత వ్రాయబడుతూ ఉన్నది! కేవలం ఊరి వీధులే కాదు - మురుగు, పంట కాల్వలూ, ఊరి చుట్టూ 1-2-3 కిలోమీటర్ల దాక 7 రహదారులూ, పబ్లిక్ స్థలాలూ, శ్మశానాలూ, బస్ ప్రాంగణాలూ, కొన్ని బడులూ - గుడులూ స్వచ్చ – శుభ్ర - సౌందర్యాలను సంతరించుకొంటున్నవి!

          ఏరోజుకారోజు – ఏదో ఒక వీధిలో - పాతిక నుండి 40 మంది కఠిన శ్రమ ఫలితమది! ఒకటీ - రెండూ కాదు – 35 - 40 ఊళ్ల ఆలోచనాపరులకు ప్రేరణ అది! మరి - ఇంత పెద్ద పంచాయతీ పచ్చదనాన్ని - సౌకర్యాల్ని – అడుగడుగునా స్వచ్ఛ - సౌందర్యాల్ని నిలబెడుతున్న 2784* నాళ్ల -  నాల్గు లక్షలకు పైగా పని గంటల శ్రమ వీరమంటే మాటలా?

          ఎందుకోగాని - గత ఆదివారం సుందరీకరించిన అపార్ట్మెంట్ల దగ్గర్నుండే నలుగురు సుందరీకర్తల పని ప్రారంభమయింది, బైపాస్ వీధి ఉత్తర దిశ చెట్ల – పిచ్చి తీగల – అభ్యంతరకర  కొమ్మల తొలగింపు గంటన్నర పాటు సాగుతూనే ఉంది!

          ఇక - 100 గజాల దక్షిణపు మురుగు కాల్వగట్టు మీద 15 మంది పనులు శ్రమదానానికి పరాకాష్టలే! వాళ్లు పీల్చిన మురుక్కంపులూ, ఒంటి చెమటల కంటుకుపోయిన బట్టలూ మేం నిత్యమూ చూస్తుండేవే!

          జమ్మిలంకమ్మ గుడి వీధిలోకి ప్రవేశించిన వీళ్లలో కొందరు - అప్పటికే చెమట ధారల్తో – 20 గజాల మేర ఎలా శ్రమించారో ఊళ్లో ప్రతి ఒక్కరూ చూడదగిన సన్నివేశం!

          ఎప్పటిలాగే - 5:30 సమయం తర్వాత పనులు – ముఖ్యంగా చెత్త లోడింగు ఊపందుకొన్నది. గడ్డి చెక్కుడు గాళ్లూ - ప్లాస్టిక్ వ్యర్థాల సమీకరణగాళ్లూ తమ ముందరి పనులు రేపటికి మిగిలిపోరాదని చురుకు పెంచేశారు!

          ఏమైతేనేం - గంటన్నర కృషి అనంతరం అందమైన 100 గజాల బైపాస్ వీధి భాగాన్ని సంతృప్తిగా చూసుకొని,

          6.15 కు కాఫీలు ముగించుకొని,

          కోడూరు వేంకటేశ్వరుని గర్జా సదృశ నినాదాలకు బదులిచ్చి,

          ఏప్రిల్ మాసపు స్వచ్ఛోద్యమ ఆదాయ - వ్యయాల పట్టికను నేను వివరించగా విని,

          గృహోన్ముఖులయ్యారు!

          రేపటి వేకువ శ్రమదానం కోసం అందరం 1 వ వార్డులోని బాలికల వసతి గృహం దగ్గర కలుసుకోవలెనని నిర్ణయించారు!

         నేటి చల్లపల్లి ఉద్యమం.

స్వచ్చోద్యమ సజాతీయ పక్షులకది మందిరం

సామాజిక సత్కర్మల సాధికార కేంద్రకం

న్యాయ బద్ధ – తర్కబద్ధ - ఉద్యమాల సంగమం

విజ్ఞానుల - జిజ్ఞాసుల విస్తృత పర్యాటకం!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   31.05.2023.