ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం!
ఉద్యమాల చల్లపల్లికి ఉచిత శ్రమ సంకేతాల @2214* రోజులు.
28 వ తేదీ (ఆగస్టు మాసం – శనివారం) వేకువ వేళ - పదిమందికైతే మరీ 4.20 కే స్వచ్ఛ సుందర శుభోదయమైపోయింది – ఐదారు వారాల క్రితం గంగులవారిపాలెం బాటలో ఎక్కడ తమ స్వచ్ఛ దీక్షను ప్రారంభించారో అక్కడే – సన్ ఫ్లవర్ కాలనీ బాట కూడలిలోనే నేటి పరిశుభ్ర – సుందరోద్యోగం మొదలై, మొత్తం పాతిక మంది సదవగాహనా కృషితో – అక్కడికి ఉత్తర – దక్షిణ దిశల రోడ్లు మరొక మారు మరింత శోభస్కరంగాను, కంటి కింపు గాను కనిపిస్తున్నవి.
మరి ఇది పాతిక మంది గ్రామ స్వస్త కంకణధారుల 40 కి పైగా పని గంటల కృషి! ప్రతి ఫలాపేక్షలేని ఉదాత్త – ఉదాహరణ యోగ్య చర్య! 2214* దినాలుగా – రెండు లక్షల పైగా పని గంటల – బహుశా ఇంకెక్కడా ప్రస్తుత కాలంలో కనని – వినని వినూతన పోకడ గదా! ఏ మూడున్నరకో బ్రహ్మముహూర్తానికి ముందే నిద్ర లేచి, 4.30 కు ముందే నిర్దేశిత స్థలం చేరుకొని, చేతులకు రక్షణగా చేతొడుగులతో – తలలకు తగిలించుకున్న దీపకాంతితో – కత్తులు, గొర్రులు, చీపుళ్ళతో గ్రామ వీధుల్ని ఊడ్చి, అందగించే అద్భుత కార్యక్రమం – దాని వైచిత్రి ఇలాగే ఉంటుంది మరి!
పని ముగింపు వేళ – 6.15 సమయంలో స్వచ్ఛ కార్యకర్తల్ని పరిశీలిస్తే – చెమట పట్టని వారు, బట్టలకు మురికి, బురద మరకలు లేని వారు – తాము నిత్యం చేస్తున్నవి దండగ మారి పనులను కొనేవాళ్ళు, ‘ఇన్నాళ్ళు – ఇన్నేళ్ళుగా పాటుబడ్డాం – ఇక చాల్లే’ అనుకొనే వాళ్ళు. ఏ కాస్తయినా అసంతృప్తి మనస్కులూ, ఇళ్ళ ఎదుటి రోడ్లు శుభ్రపరచని గృహస్తుల్ని నిందించే కార్యకర్తలూ కనిపించలేదు – బహుశా ఇదే స్వచ్చోద్యమ పరిపక్వత, సాఫల్యత కావచ్చు! ఈ నాటి వేకువ పని వివరాల కొస్తే:
- ధృఢకాయులైన ఇద్దరు కార్యకర్తలు గంటన్నర పాటు శ్రమించి, 17 ఏళ్ల నాటి పొగడ చెట్ల కొమ్మ – రెమ్మల్ని, కోనో కార్పస్ చెట్టునీ కత్తిరించి, అందంగా అంటుక్రాపు వేశారు.
- కొద్ది రోజులో, గంటలో క్రితం బాట ప్రక్కన పడి ఉన్న ఎండు కొమ్మల్ని, కొద్ది మొత్తం చెత్తా చెదారాన్ని, అక్కడక్కడ తలెత్తుకున్న గడ్డి దుబ్బుల్నీ, 10 – 12 మంది కత్తిముఠా దంతెలతో లాగి, ట్రాక్టర్ లోకి ఎగుమతి చేశారు.
- ఎత్తైన ట్రక్కులో – ఎత్తైన తుక్కు మీద నిలిచి, సర్దుతున్న ఇద్దరు ముఖ్యుల్ని వాట్సాప్ చిత్రంలో గమనించండి.
- ముగ్గురు చీపుళ్ళ వారికి నేటి పని వేళంతా రోడ్డు ఊడ్వడమే సరిపోయింది!
ఈ విధంగా – 100 నిముషాల పాటు – పాతిక వేల మంది గ్రామస్తుల కోసం కనీసం పాతిక మంది కార్యకర్తలు సాధించినదేమంటే – ఒక పెద్ద ట్రక్కు నిండా ఊరి వ్యర్ధాలు, ఏ రెండు – మూడు వందల గజాల మేరకో వీధి స్వచ్ఛ – శుభ్రతలు! లబ్దిపొందిన దేమనగా – ఈ రోజు మొత్తానికి సరిపడా సంతృప్తి, సంతోషం!
6.30 కు సమీక్షా సమావేశానికి ముందు గ్రామ శుభ్ర – స్వచ్ఛ – సౌందర్యాల ఆరాటాన్ని ముమ్మారు కాదు – ఆరుమార్లు నినాదాలుగా ప్రకటించిన యువ ఉద్యోగి మారుతీ ప్రసాదు.
రేపటి వేకువ కూడా మన ఊరి మెరుగుదల బాధ్యత కోసం ఈ గంగులవారిపాలెం దారిలోనే కలుసుకొందాం!
సంఘం శరణం గచ్ఛామి
“సంఘం – ధర్మం – జ్ఞానం శరణం గచ్ఛామి” అనుచు
ఏనాడో వాక్రుచ్చెను సిద్ధార్ధుడు గౌతముడు
ఏ కాలం – ఏ దేశం – ఏ సమాజముల కైనా
అది నిజమని ఋజువు చేసే స్వచ్చోద్యమ సైనికుడు!
ఒక ‘స్వచ్ఛ సుందర చల్లపల్లి’ కార్యకర్త
28.08.2021.