స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1834* వ నాటి హరిత సుందరీకరణలు.

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1834* వ నాటి హరిత సుందరీకరణలు.

తొందరగా వచ్చిన చలికాలపు నేటి వేకువ 4.00 – 6.00 గంటల మధ్య నడకుదురు మార్గంలో జరిగిన స్వచ్చంద శ్రమదానంలో 28 మందికి ప్రమేయమున్నది.

సుమారు 40 రోజులుగా స్వచ్చ సైనికుల రాక కోసం ఎదురుచూస్తున్న నడకుదురు దారిలో 1 వ మైలురాయి దగ్గర నుండి సుమారు 300 గజాల దాక నిర్వహింపబడిన రహదారి స్వచ్చ – శుభ్ర – సుందరీకరణలో –

కొందరు దారిని, రెండు పార్శ్వాలను చీపుళ్లతో ఊడ్చే పనిని ఎంచుకున్నారు. అవసరాన్ని బట్టి పంజాలను కూడ ప్రయోగించి, కొద్దిపాటి తుక్కును, ఎండు – ముళ్ళ కొమ్మల్నీ పోగులు చేసి, ట్రాక్టర్ లో నింపి, డంపింగ్ యార్డుకు చేర్చారు.

మరికొందరు జడలు విరబోసుకుంటున్న చెట్ల కొమ్మలను కత్తిరించి, అదుపులో పెట్టారు. వీరిలో ముగ్గురు వంతెనకు దక్షిణంగా పొలంలో పేరుకుపోయిన రకరకాల తుక్కును పోగులు చేసి, డిప్పలకెత్తి, ట్రాక్టర్ లో కెత్తారు. పాత చెట్ల పాదుల్ని చక్కదిద్ది, కొత్త పాదులు త్రవ్వి, 125 గద్దగోరు/అడవి తంగేడు పూల మొక్కల్ని నాటడం మరొక విశేషం. ఇవి ఎక్కువగా రోడ్డు దక్షిణం ప్రక్కనే నాటినట్లున్నారు. మరికొన్ని రోజుల్లో ఇంకొన్ని వందల గద్దగోరు పూలమొక్కలు కూడ నాటాక, అవి పూర్తిగా పూశాక 2020 లో మన ఊరిని “అడవి తంగేడుపల్లి” అనే కొత్త పేరుతో పిలుచుకోవచ్చు.

దివిసీమ ఉప్పెనకు ఈరోజు 42 వ వార్షిక జ్ఞాపకం 19.11.1977 శనివారం నాడు కోడూరు – నాగాయలంక మండలాల గ్రామాలు పూర్తిగా, అవనిగడ్డ – మోపిదేవి – చల్లపల్లి పాక్షికంగా శ్మశాన సదృశంగా మారిన రోజు.

కాఫీ అనంతర దైనందిన స్వచ్చ సమీక్షా సమావేశంలో – ఆదివారం నాటి పెద్ద పండుగ విశేషాలు, జనంలోకి విజయవంతంగా వెళ్ళిన సందేశాలు ప్రస్తావించబడ్డాయి. మన సీనియర్ ఊండెడ్ సోల్డియర్, మంచినీటి సరఫరా దారుడు – అంజయ్య గారు తాపీగా ముమ్మారు నినదించిన స్వచ్చ – సుందర – సంకల్ప నినాదాలు అందరి గళాలలో పునర్మ్రోగి, 6.35 నిముషాలకు నేటి గ్రామ కర్తవ్య దీక్ష ముగిసింది.

రేపటి మన శ్రమదాన బాధ్యత నడకుదురు దారిలోనే…

స్వచ్చోద్యమ ఇంధనాలు
ఎవరు ప్రకటిస్తారొ రోజూ స్వచ్చ సుందర నినాదాలను
ఎవరి విజ్ఞత – సదాచరణలు ఇంధనం స్వచ్చోద్యమాలకు
ఏమహోన్నత త్యాగశీలురకింతగా స్వగ్రామ దీక్షలు –
ఆ విశిష్ట స్వచ్చ సుందర సైనికులకే నా నమస్సులు!

నల్లూరి రామారావు,
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,
సభ్యులు – మనకోసం మనం ట్రస్టు,
మంగళవారం – 19/11/2019,
చల్లపల్లి.

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *