ప్లాస్టిక్ వ్యతిరేక కార్యక్రమం ఎలా ఉండాలి?

3

నిన్న సాయంత్రం 4.30 నుండి 6.30 వరకు విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ఆఫీసులో కలెక్టర్ గారు, విజయవాడ మున్సిపల్ కమీషనర్, అసిస్టెంట్ కమీషనర్ గార్ల ఆధ్వర్యంలో ‘మన విజయవాడ’ పేరుతో ఒక సమావేశం జరిగింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మెటీరియల్స్ ని వాడకుండా విజయవాడలో చెయ్యాలి అనే కార్యక్రమంలో భాగంగా నిన్న, ఈరోజు, రేపు ఈ మూడు రోజులు ప్రజలతో రకరకాల వృత్తులు, వ్యాపారాలలో ఉన్న ప్రజలందరితో కూడా సమావేశాన్ని interactive session ను ఏర్పాటు చేశారు.

ఆ కార్యక్రమంలో మన ‘స్వచ్చ చల్లపల్లి’ నుంచి నేను కూడా వెళ్ళడం జరిగింది. అందులో మొట్టమొదటగా స్వచ్చ చల్లపల్లి లో మీ అనుభవాలు చెప్పండి ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్’ గురించి మీరేం చేస్తున్నారు అని నన్ను అడిగారు. నేను ముందుగా రాసుకెళ్లిన పేపర్ ను చదివి వారందరికీ వివరించడం జరిగింది. చాలా మంది మన కార్యక్రమాన్ని appreciate చేశారు. తరువాత కూడా చాలా మంది కలిశారు. ప్రత్యేకంగా కలెక్టర్ గారు చల్లపల్లి గురించి 2 నిమిషాలు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి మన M.V.సుబ్బారావు గారు కూడా వచ్చారు. జనవిజ్ఞానవేదిక నాయకులు శ్రీ కుమార్ గారు ఈ కార్యక్రమంలో ముఖ్య పాత్ర వహించారు.

అక్కడకు నేను రాసుకెళ్లిన పేపర్ ను మీకు పోస్ట్ చేస్తున్నాను.

ప్లాస్టిక్ వ్యతిరేక కార్యక్రమం ఎలా ఉండాలి?

1. అన్ని ప్లాస్టిక్ వస్తువులు నిషేధించగలమా?

            లేదు. ప్లాస్టిక్ తో చేయబడి మళ్ళీ మళ్ళీ వాడగలిగే సెల్ ఫోన్లు, లాప్ టాప్ లు, కుర్చీలు, కళ్ళజోళ్ళు, టేబుళ్లు, బెంచీలు, బక్కెట్లు, మగ్గులు, దువ్వెనలు వగైరా అనేక వస్తువులను నిషేధించడం ప్రస్తుతం సాధ్యం కాదు, వాంఛనీయమూ కాదు.

        మరేం చెయ్యాలి?

  ప్రపంచంలో తయారయ్యే ప్లాస్టిక్ వస్తువులన్నింటిలోనూ సగభాగం వస్తువులు ఒక్కసారికి మాత్రమే పనికివచ్చేవి(Single use plastic). వీటిని నిషేధిస్తే పర్యావరణానికి సగం పీడా విరగడయినట్లే. ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్’ ను నిషేధించాలని మన కలెక్టర్ గారు తీసుకున్న నిర్ణయానికి అనేక మంది సంతోషిస్తున్నారు.

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్రముఖ ప్లాస్టిక్ వస్తువులు ఇవి:-

  1. క్యారీ బ్యాగులు
  2. ప్లాస్టిక్ నీళ్ళ సీసాలు
  3. ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ టీ కప్పులు
  4. విస్తరాకులు, తగరం విస్తరాకులు
  5. స్ట్రాలు
  6. Ear Buds
  7. స్పూన్లు, ఫోర్కులు
  8. స్వీట్లను వడ్డించడానికి వేడుకలలో ఉపయోగించే కప్పులు
  9. పెరుగు కప్పులు
  10. ఐస్ క్రీమ్ కప్పులు
  11. పంటి పుల్లలు
  12. మెమెంటోలు
  13. బెలూన్లు
  14. కిళ్ళీ కవర్లు
  15. బొకేలు
  16. ఫ్లెక్సీలు

2. చల్లపల్లిలో ఇంతవరకూ మేమేం చేశాం?

a) మా కార్యకర్తలెవ్వరూ రోజువారీగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడడం లేదు. 

b) మాస్వచ్చ చల్లపల్లి వేడుకలన్నీ హరిత వేడుకలు(Green Functions)గానే చేసుకుంటున్నాం.

c) పెళ్లిళ్లు లాంటి వేడుకలన్నింటిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడవద్దని గ్రామస్తులను చైతన్యపరుస్తున్నాము. ఇప్పటికే మా చల్లపల్లిలో అనేక హరిత వేడుకలు జరిగాయి.

d) ప్రతి సోమవారం జరిగే గ్రామసంతలో క్యారీ బ్యాగులు వాడవద్దని ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమం రెండు సంవత్సరాలు చేశాం. ప్రత్యామ్నాయంగా మళ్ళీ మళ్ళీ వాడగలిగే వేలకొద్దీ సంచులను సబ్సిడీ ధరపై మేమే అమ్మాము.

e) చల్లపల్లి లో ఉన్న 5,000 ఇళ్లకు వెళ్ళి క్యారీ బ్యాగులు వాడద్దు మళ్ళీ మళ్ళీ వాడకోగలిగే గుడ్డ సంచుల్ని గాని, బుట్టలను గాని వాడండి అని ప్రచారం చేశాం. ప్రతి ఇంటికి ఒక సంచి చొప్పున మేము ఉచితంగా ఇచ్చాము.

f) ప్రభుత్వ కార్యక్రమాలన్నింటిలో ఫ్లెక్సీ లు వాడవద్దని చెబుతున్నాం – ఫలితం ఇంకా రాలేదు. అయినా మా ప్రయత్నం మానలేదు.

g) రాజకీయపార్టీల వారిని కూడా ఫ్లెక్సీ లు వాడవద్దని అభ్యర్ధిస్తున్నాం. ఇది మాత్రం కొంత ఫలితం ఇచ్చింది.

h) క్రోకరీ బ్యాంక్ – మా వద్ద 300 ల ప్లేట్లు, 200 ల స్టీలు గ్లాసులు, 100 స్టీలు గిన్నెలు, స్టీలు టీ గ్లాసులు, స్టీలు స్పూన్లు ఉన్నాయి. ఇవి మన స్వచ్చ చల్లపల్లి వేడుకల కోసం మేము ఏర్పరుచుకున్నము. ఇవి గ్రామంలో ఎవరు అడిగినా ఇస్తున్నాము. 

3. ఏం చేస్తే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కనుమరుగవుతుంది?

 a) ఈ వస్తువులకు ప్రత్యామ్నాయాలు చూపించగలిగితే మంచిదే గాని అలా చూపించేదాకా నిషేధాన్ని ఆపవలసిన అవసరం లేదు. నిషేధాన్ని గట్టిగా అమలుపరిస్తే ప్రత్యామ్నాయాలు అవే పుట్టుకొస్తాయి.

b) ఎంత సన్నటి క్యారీ బ్యాగు మీద అయినా 50 మైక్రాన్ల కంటే ఎక్కువే అని రాసి ఉంటుంది. విజయవాడ లో 100 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్ బ్యాగులను నిషేధించే అంశాన్ని తప్పక పరిశీలించగలరు.

c) స్కూళ్ళు, కాలేజీలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా సమర్ధవంతం(effective)గా నిరంతర ప్రచారం చెయ్యాలి. స్వచ్చ విజయవాడ కోసం హైస్కూల్, కాలేజీ విద్యార్ధులు సంవత్సరానికి కనీసం 50 గంటలు పనిచెయ్యాలనే నిబంధన విధించి వాటికి కొన్ని మార్కులు కలిపితే బాగుంటుంది. అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో ఈ సామాజిక బాధ్యత పాఠ్యప్రణాళిక(curriculum) లో భాగంగానే ఉంటుంది. అమెరికా నుండి సెలవులకు వచ్చిన కొందరు విద్యార్ధులు, ఉత్తర భారత దేశంలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్ధులు మా స్వచ్చ చల్లపల్లి కార్యక్రమంలో పాల్గొని ఆ పని గంటలకుగాను సర్టిఫికెట్ తీసుకెళ్తుంటారు.

d) ప్రజలందరిలోనూ ఈ ప్లాస్టిక్ వస్తువులు వాడటం మానక తప్పనిసరి పరిస్థితిని కల్పించాలి.

e) అన్ని హోటల్స్, ఫంక్షన్ హాల్స్ లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లిస్ట్ వారికి ఇచ్చి వాటిని వాడకూడదనే నిబంధనను విధించాలి. చల్లపల్లి లో ఒక ఫంక్షన్ హాల్ లో వీటిని 5 సంవత్సరాల క్రితమే నిషేధించారు. Swiggy, Zomato లాంటి పార్సిల్ సర్వీసు నిర్వహించే వారందరికి కూడా క్యారీ బ్యాగులతో సర్వీసు చేయవద్దని ఆంక్షలు విధించి అమలుపరచాలి.

f) మటన్ షాపులు, కూరగాయల షాపులు, పూల షాపులు, కొబ్బరి బొండాల షాపులు వారికి కూడా క్యారీ బ్యాగులతో, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ తో సర్వీసు చేయవద్దని చెప్పాలి.

g) ఇవి అమలుచేయని వారికి నిర్దాక్షిణ్యంగా జరిమానా వెయ్యాలి. దీనికి ప్రభుత్వ సిబ్బంది యావత్తు చిత్తశుద్ధితో సంసిద్ధం కావాలి. ఐతే దీనికి ముందు ప్రభుత్వ కార్యక్రమాలన్నింటిలో ప్లేక్సీలతో సహా ఎటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వాడకుంటేనే నిషేధం అమలుపరిచే నైతిక శక్తి వస్తుందని గ్రహించాలి.

ప్రభుత్వ కృషితో బాటు ప్రజల్ని చైతన్యపరిచేందుకు లయన్స్ – రోటరీ క్లబ్బుల, ఇతర స్వచ్చంద సంస్థల, ఔత్సాహిక కార్యకర్తల ప్రయత్నం కూడ తోడు కావాలి. నగరంలో ఈ ఉద్యమాలు జమిలిగా సాగితే సత్వర ఫలితాలు ఆశించవచ్చు. 

   విజయవాడలో ఇకముందు జరిగే వేడుకలన్నీ హరితవేడుకలుగానే జరగబోతాయని గట్టిగా నమ్మండి.

          నమ్మకమే ఏ విజయానికైనా పునాది.

            ఈ బృహత్తర ప్రజోపయోగకరమైన కార్యక్రమాన్ని మొదలుపెట్టిన మన కలెక్టర్ గారికి మరొక్కసారి మా స్వచ్చ చల్లపల్లి కార్యకర్తలందరి తరపున హార్దిక అభినందనలు, ధన్యవాదములు.

ఇట్లు

దాసరి రామకృష్ణ ప్రసాదు

(స్వచ్చ చల్లపల్లి కార్యకర్తల తరపున)

చల్లపల్లి

ది. 31.07.2019.

1 2

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *