శ్రీమతి నన్నపనేని లక్ష్మీ స్మారక పురస్కారం సందర్భంగా నేను చదివిన ప్రసంగ పాఠం

మిత్రులారా, 

   నిన్న విజయవాడ లో ఆంధ్ర నాటక కళా సమితి వారి ఆధ్వర్యంలో నాకు, డా. పద్మావతి గారికి జరిగిన అభినందన సభ గురించి కొన్ని వివరాలు…

 ఒక నెల రోజుల క్రితం ఆంధ్ర నాటక కళా సమితి వారు ప్రతి సంవత్సరం వచ్చి ఒక పురస్కారాన్ని స్వీకరించవలసింగా ప్రముఖ ప్రజా కళాకారులు శ్రీ కర్నాటి లక్ష్మీ నరసయ్య గారు(94 సంవత్సరాలు), డా.కామినేని పట్టాభిరామయ్య గారు, డా. భగత్ సింగ్ గారు కోరారు. శాలువాలు కప్పడం, దండలు వెయ్యడం వంటి సన్మాన కార్యక్రమాలు ఏమీ వద్దని వారిని అభ్యర్ధించడం జరిగింది. స్వచ్చ చల్లపల్లి ఉద్యమం జరుగుతున్న తీరును, సమిష్టి కృషి వలన వచ్చిన ఫలితాలను మేమిద్దరం వివరిస్తామని చెప్పాము. అయితే అక్కడ మమ్మల్నిద్దరినీ కూర్చోబెట్టి శాలువాలు కప్పడం, దండలు మార్పించడం బాగా ఇబ్బందిగా అనిపించింది.

ఆ తరువాత నా ప్రసంగం స్వచ్చ కార్యకర్తలు కృషి గురించి ఆహూతులకు వివరించడం జరిగింది. Power Point Presentation కు గానీ, Video Presentation కు గానీ అవకాశం లేదు కాబట్టి 1450 రోజుల మన కార్యక్రమాన్ని కలర్ ఫోటోలతో ఒక పుస్తకంగా వేసి కొంతమందికి పంచడం జరిగింది.

ప్రసంగ పాఠం వివరాలను మీకు పోస్ట్ చేస్తున్నాను.

ఇట్లు,
సహ కార్యకర్త
డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
గురువారం – 01/11/2018

శ్రీమతి నన్నపనేని లక్ష్మీ స్మారక పురస్కారం సందర్భంగా నేను చదివిన ప్రసంగ పాఠం

1. సభకు నమస్కారం.

2. ఆంధ్ర నాటక కళా సమితి వారు శ్రీ నన్నపనేని బాపనయ్య, సీతారావమ్మ, లక్ష్మీ మెమోరియల్ ట్రస్టు ద్వారా ఈ పురస్కారానికి ఎంపిక చేసినందుకు ‘స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం’ తరఫున ట్రస్టీలకు ధన్యవాదములు. శ్రీమతి నన్నపనేని లక్ష్మీ గారి గురించి చదువుతుంటే ఒక వ్యక్తి ఇన్ని పనులు చెయ్యగలరా అని ఆశ్చర్యమేస్తుంది. వారిని స్మరించుకుంటూ చల్లపల్లి లో జరుగుతున్న స్వచ్ఛ ఉద్యమం గురించి క్లుప్తంగా వివరిస్తాను.

3. గౌరవనీయులు శ్రీ కర్నాటి లక్ష్మీ నరసయ్య గారు, మండలి బుద్ధ ప్రసాదు గారు, డా. M.C దాస్ గారు, నన్నపనేని నాగేశ్వరరావు గారు, డా. కామినేని పట్టాభిరామయ్య గారు, అత్యంత గౌరవనీయులైన మీ అందరి ముందూ నిలబడి మాట్లాడటానికి నాకు, నా భార్య డా. పద్మావతి గారికి అవకాశం రావడానికి ముఖ్య కారణం-

నేటికి 1450 రోజుల నుండి ప్రతి రోజూ 100 గంటలు (50 మంది రోజుకు 2 గంటల చొప్పున) ఊరి అభివృద్ది కోసం ఇప్పటికి 1,45,000 గంటలను శ్రమదానం చేసిన మా ‘స్వచ్ఛ సుందర చల్లపల్లి’ కార్యకర్తలే. వారే మా ఊరి హీరోలు.

4. ఏ ఫలితమైనా శ్రమ నుంచే వస్తుంది. మా స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం ఇంతగా ప్రచారమవ్వడానికి మా ‘స్వచ్ఛ కార్యకర్తల శ్రమే’ ముఖ్య కారణం.

5. నాకు మూడు బాధలున్నాయి. గత 40 సంవత్సరాల నుండి మేం పనిచేసిన 3 సామాజిక ఉద్యమాల గురించి టూకీగా చెప్తాను.

  • మాతృ భాషలోనే పాఠశాల విద్య
  • పాము కాటుకి శాస్త్రీయ వైద్యం
  • పరిసరాల అపరిశుభ్రత

                ఎందుకు “స్వచ్ఛ సుందర చల్లపల్లి” ఉద్యమాన్ని మేం మొదలుపెట్టాం?

      The Great Sanitary Awakening … అభివృద్ధి చెందిన దేశాలలో జరిగిన పారిశుధ్య విప్లవాన్ని గూర్చి వివరించడం జరిగింది.

పరిసరాల పరిశుభ్రతలో మన దేశం ఇంత వెనుకబడి ఉండటానికి కారణం డబ్బు లేకపోవటం కాదు కదా! కేవలం మన ఆలోచనా ధోరణి, సామాజిక స్పృహ సరిగా లేకపోవటమే!

       20.12.2013 న మా ఆసుపత్రి రోడ్డులో బహిరంగ మలవిసర్జన లేకుండా చెయ్యడానికి ఉద్యమాన్ని మొదలుపెట్టాం. రాబోయే డిసెంబర్ 20 వ తారీఖుకు ప్రతి రోజూ 2 గంటలు గ్రామం కోసం పనిచేయడం మొదలుపెట్టి 5 సంవత్సరాలు.

 

స్వచ్చ భారత్ – స్వచ్చాంధ్రప్రదేశ్ – స్వచ్చ చల్లపల్లి

        బుద్ధ ప్రసాదు గారి చొరవతో 2014 నవంబర్ 12 న స్వచ్చ చల్లపల్లి ఉద్యమాన్ని మొదలుపెట్టాం. చల్లపల్లిలోని 20 వేల మంది ప్రజలు ఒక కాగితం ముక్క పారెయ్యాలన్నా చెత్త బుట్టను వెతుక్కోవడమే కాకుండా ఈ చెత్త డంపింగ్ యార్డు వరకు వెళ్తుందా లేదా డంపింగ్ యార్డు లో Solid Waste Management శాస్త్రీయంగా జరుగుతుందా లేదా అనే ఆలోచనను రేకెత్తించడమే మా లక్ష్యం.

Zero Waste Management జరగాలని మా ఆశ దీనికోసం ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చెయ్యడం మా కర్తవ్యంగా భావించి ఈ కార్యక్రమం మొదలయ్యింది.

 

ఏం చేస్తున్నాం?

  1. ఉదయం చేసే స్వచ్ఛ సేవ
  2. “మనకోసం మనం” ట్రస్టు ద్వారా చేస్తున్న పని

పరిశుభ్రత,

పచ్చదనం,

                           సుందరీకరణ మా ధ్యేయాలు.

        బహిరంగ మలవిసర్జనరహిత గ్రామంగా చెయ్యడానికి కావలసిన 519 వ్యక్తిగత టాయిలెట్లలో 268 టాయిలెట్లు (51%) కట్టించడానికి ‘మనకోసం మనం’ ట్రస్టు ద్వారా సహాయం చేశాము. కలనైనా ఊహించని విషయం మా చల్లపల్లి ODF గా ప్రకటించబడటం.

ఇది సంవత్సరంన్నర క్రితమే జరిగింది. ఆధునిక పబ్లిక్ టాయిలెట్లను గ్రామంలో రెండు చోట్ల కట్టించడమే కాకుండా నిర్వహిస్తున్నాము కూడా.

RTC వారితో బస్టాండ్ లో కూడ మంచి టాయిలెట్ ని కట్టించడం జరిగింది.

6. మూడు సంవత్సరాల పాటు “మనకోసం మనం” ట్రస్టు ద్వారా చల్లపల్లి లోని 60 శాతం గ్రామంలో చెత్త సేకరణ చేసి రోడ్ల ప్రక్కన చెత్త లేకుండా ఉంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో ప్రజలకు చూపించాం.

7. గ్రామంలో ఇక ఒక్క మొక్క పెట్టడానికి కూడా ఖాళీ స్థలం లేనంత దట్టంగా మొక్కలను నాటి సంరక్షిస్తున్నాము. రహదారి వనాలను ఏర్పాటుచేశాం. వీలైనన్ని చోట్ల రహదారి వనాలను తయారుచేశాము. చల్లపల్లిలోని చాలా

ప్రదేశాలు డంపింగ్ యార్డులవలె ఉండేవి. వాటన్నింటినీ పూలమొక్కలతో చిన్న చిన్న తోటలుగా మార్చాం. పర్యావరణ పరిరక్షణ కోసం Reduce – Reuse – Recycle లో భాగంగా మేము ఏం చెప్తున్నామో అవే చేస్తున్నాం. ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం.


            1. ప్లాస్టిక్ వస్తువులు – ప్లాస్టిక్ విస్తరాకులు, తగరం విస్తరాకులు, ధర్మోకోల్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు, క్యారీ బ్యాగులు, ప్లాస్టిక్ టీ కప్పులు, ఐస్క్రీమ్ కప్పులు, ప్లాస్టిక్ స్పూన్లు, ప్లాస్టిక్ పన్నుపుల్లలు, ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ఫ్లెక్సిలు మేం వాడం. చల్లపల్లిలో వీటి వాడకాన్ని నిరుత్సాహపరుస్తున్నాం.

                ఆచరణ మాత్రమే ప్రభావశీలంగా ఉంటుంది కదా!

           2. డబ్బు వృధా చెయ్యడం. ప్రార్ధన మందిరాల కోసం అనూహ్యంగా ఖర్చు పెట్టడం

8. ఈ ఉద్యమాన్ని ప్రారంభించింది మా MLA శాసనసభ ఉపసభాపతి అయిన శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు. ప్రజా

ప్రతినిధులందరు, ప్రభుత్వ అధికారులు, అన్ని రాజకీయ పార్టీల వారు, ప్రసార మాధ్యమాలు సహకరించబట్టే మేము

మంచి ఫలితాలను చూడగలుగుతున్నాం.

             “ఇంతమంది మీకు ఎలా కలిసివస్తున్నారు? ఎలా ఇంత నిస్వార్థంగా పని చెయ్యగలుగుతున్నారు?” అని మమ్మల్ని ఎంతోమంది అడుగుతూ ఉంటారు. దానికి మా సమాధానం ఇది –

A) మన ముందు తరాల వారు ఎంతోమంది సమాజం కోసం చేసిన త్యాగాల వల్లనే ఆ ఫలితాలను మనం అనుభవిస్తున్నాము. ఉదా: సర్ ఆర్ధర్ కాటన్.  మన వంతు కృషిగా సమాజానికి, భావి తరాలకు ఉపయోగపడే పనిచేయటం ‘సేవ’గా కాక ‘బాధ్యత’ గా భావించాలి. ప్రతిఫలాన్ని ఆశించకుండా పని చేయాలి. కేవలం ఒక మంచి పనిచేశామనే ‘సంతోషం’ మాత్రమే మనకు వచ్చే ప్రతిఫలం. ఇదే మా ఫిలాసఫీ.

B) ఇలా నిస్వార్థంగా ప్రతిరోజూ ప్రతివారూ ఒక గంట సమయాన్ని సమాజాభివృద్ధి కోసం కేటాయిస్తే అద్భుతాలు జరుగుతాయి. డబ్బుతో శారీరక సౌఖ్యాలు మాత్రమే పొందగలం.  మానసిక సంతృప్తి, సంతోషం కేవలం స్పష్టమైన philosophy తోనే వస్తుంది.

9. ‘ఈ ప్రజలు మారరు. ఈ సమాజాన్ని మార్చలేం’ అనుకునే వారికి ఈ philosophy తో పనిచేస్తూ మా ఊరిని ఒక నమూనాగా తీర్చిదిద్ది ఏ ఊరినైనా ‘ఇలా చెయ్యవచ్చు’ (Yes! it is doable) అని చూపించాలనేది మా ఆశ.

10. ఒకసారి చైతన్యవంతమైన ప్రజలు ఇంతటితోనే ఆగరు కదా! మరింత మెరుగైన సమాజం కోసం ప్రయత్నించకుండా ఉండరు కదా!

11.  ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులు వేటిని వాడవద్దనిప్రతి రోజూ ఒక గంట గాని, వారానికి ఒక రోజు గాని మన కుటుంబం కోసం కాకుండా సమాజనికి ఉపయోగపడే పనులకు సమయాన్ని వెచ్చించవలసిందిగా సభికులందరికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను.

మేం కలలు కన్న చల్లపల్లి రావడానికి ఇంకా మేం చాలా దూరం ప్రయాణించాల్సే ఉంది.

అయినా మా సుందర చల్లపల్లిని మీరందరూ దర్శించాలని మా కోరిక…

మరొక్కసారి మా స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం తరఫున అందరికీ ధన్యవాదములు. నమస్కారం.

 

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

31-10-2018

 

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *