స్వచ్చ చల్లపల్లి సైన్యం 1500 రోజుల జైత్రయాత్ర

స్వచ్చ చల్లపల్లి సైన్యం 1500 రోజుల జైత్రయాత్ర

సమాజంలో అప్పుడప్పుడూ కొన్ని అనుకోని అద్భుతాలు జరుగుతుంటాయి. ప్రజలను చైతన్యపరచి మంచి వైపుగా కొన్ని అడుగులు వేయిస్తాయి. 20 వేల జనాభా గల చల్లపల్లి లో ఇటీవల వచ్చిన అలాంటి ఒక పెనుమార్పే స్వచ్చ ఉద్యమ 1500 రోజుల ప్రస్థానం. ఇప్పటికే రాష్ట్ర – దేశ-విదేశాల్లో గుర్తింపు పొందిన ఈ ఉద్యమంలోని కొన్ని ముఖ్య ఘట్టాలు:

  1. సుమారు 5 ఏళ్ల క్రితం బహిరంగ మలవిసర్జనకు కేరాఫ్ గా ఉన్న గంగులవారిపాలెం రోడ్డు ఇప్పుడు భూగర్భ మురుగు పారుదల వ్యవస్థతో, కనువిందైన పూల తోటలతో గ్రామస్తులనూ, బైటవారినీ ఆకర్షించడం.
  1. సాగర్ టాకీస్ బైపాస్ రోడ్డు మొత్తంగానూ – 1 వ వార్డులోని బాలికల హాస్టల్ ప్రాంతం ప్రత్యేకంగానూ ఒకప్పుడు యమకూపంగా ఉంటే – ఇప్పుడు రహదారి వనాలతో – రంగవల్లులతో 20 వేల ప్రజల మనసుల్ని గెలుచుకోవడం.
  1. డంపింగ్ యార్డును తలపిస్తూ దుర్గంధమయంగా ఉండే విజయవాడ రోడ్డు ఇపుడు కనుల పండుగగా – సందర్శకులు, ప్రముఖులు ఫోటోలుదిగదగినంత సౌందర్యప్రపూరితంగా మారడం.
  1. స్వచ్చ సైన్యం సహకారంతో సుందరీకరణ పొందిన RTC బస్టాండు,రిజిస్ట్రార్ ఆఫీసు,SRYSP కళాశాల పరిసరాలన్నీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేంతగా – పచ్చదనంతో – పరిశుభ్రంగా కనిపించడం.
  1. పెదకళ్లేపల్లి రోడ్డు గతం కన్నా విశాలంగా – పచ్చదనాలతో – పూల వనాలతో ఆహ్లాదకరంగా రూపొందడం.
  1. నాగాయలంక రోడ్డు 2 కి.మీ వరకు ఇరుప్రక్కల రెండేసి వరుస చెట్లతో – పూలతో పరిశుభ్రంగా మారిపోవడం.
  1. చెత్త కేంద్రంగా – బాహ్య మలవిసర్జన నిలయంగా ఉండే పాగోలు రోడ్డు ఒక కి.మీ పొడవునా రహదారి వనంతో – హరిత సుందరంగా రూపొందడం.నడకుదురు రోడ్డు 1 కి.మీ. దాక కళంకంలేని స్వచ్చతతో రంగుల ట్రీ గార్డులతో పూలమొక్కలతో కళకళలాడటం.
  1. ఇంటింటి ప్రచారంతో ప్రతి ఒక్కరినీ చైతన్యపరిచి క్యారీ బాగులు,తాత్కాలిక ఫ్లెక్సీలకు బహిరంగ మలవిసర్జనలకు వ్యతిరేకంగా సంసిద్ధులను చేసి అవసరమైన పేదలకు 295 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో ప్రోత్సహించి, సహకరించి చల్లపల్లి ని D.F.(బహిరంగ మలవిసర్జనరహిత) గ్రామంగా ప్రకటించడం-O.D.F.+ గా రూపొందడానికి కూడా ముందడుగు వెయ్యడం.
  1. బందరు రోడ్డులోని ‘కర్మల భవనం’ పరిసరాలు అందమైన ఫెన్సింగుతో పూలమొక్కలతో, ఆకర్షణీయ నినాదాలతో జీవకళ ఉట్టిపడేలా పరిణమించడం.
  1. విజయవాడ రోడ్డులోని చిల్లలవాగు ఎడమగట్టును, వక్కలగడ్డ శ్మశానాన్ని శుభ్రపరిచి రకరకాల పండ్ల, పూల మొక్కలను నాటడం.
  1. ఇక కుడి వైపు చల్లపల్లి శ్మశానం, డంపింగ్ యార్డుల నవీకరణ – సుందరీకరణల గురించి ఎంత చెప్పినా తక్కువే! చెత్త నుండి ఎరువు తయారీకేంద్రం, శవదహన వేదిక (ఇంకా పూర్తి కాలేదు), లాన్ లు, మనసును దోచే రకరకాల మొక్కలతో, నవ వధూవరులు కూడ ముచ్చటపడి విహరించేంతగా –  ఆ పరిసరాలు నేడొక సందర్శనీయ ప్రదేశంగా మారడం.
  1. ఇంటింటి నుండి పొడి – తడిచెత్తల సేకరణ అనతి కాలంలోనే. గ్రామంలో ఉన్న చెత్త అంతా డంపింగ్ యార్డుకు తరలింపు మరొక విజయం. స్వచ్చ శుభ్రతల పట్ల జనంలో విస్తృత చర్చలు జరిగి, సానుకూల దృక్పథం పెరగడం శుభపరిణామం.
  1. ఆనంద ఆదివారాల ద్వారా గ్రామస్తుల్లో – ముఖ్యంగా విద్యార్ధుల్లో పర్యావరణ స్పృహ పెంపొందడం భవిష్యత్తుకు శుభసూచకం.
  1. ‘నా కోసం నేను’ అనే సంకుచితత్వం నుండి ‘మనకోసం మనం’ అనే విశాల దృక్పథం వైపుకు చల్లపల్లి సమాజం తొలి అడుగు లేయడమే 1500 రోజుల స్వచ్చోద్యమ విజయాలలో ముఖ్యమైనది.
  2. పరిమిత సంఖ్యలోనే కావచ్చు – గ్రామ మహిళలు వంటింటి రాణులుగా, తానాతందానలుగా మిగిలిపోక గ్రామం స్వస్తత దృష్ట్యా వేకువ 4.30 కే రోడ్ల మీదకు వచ్చి స్వచ్చ శుభ్రతా సేవలలో పాల్గొనడం కూడా చెప్పుకోదగిన విజయమే.

(స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్తల తరపున)

నల్లూరి రామారావు,

మనకోసం మనం ట్రస్టు సభ్యులు, చల్లపల్లి.

20/12/2018.

 

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *