డా. వాసిరెడ్డి రమేష్ గారి లేఖ

8de1fa02-35f8-4cb7-a92a-701bccf9f070

 

జనవరి 2 వ తేదీన చల్లపల్లిని చూసిన తరువాత కొత్తగూడెం వాస్తవ్యులు డా. వాసిరెడ్డి రమేష్ గారు వారి భావాలను వ్యక్తీకరిస్తూ రాసిన లేఖ.

 

కొత్తగా ఒక ఊరు వెళ్తాము.అక్కడ ఆత్మీయ ఆతిధ్యం దొరుకుతుంది.ఆ మనుష్యులు ఆ ఊరు మళ్లీ మళ్ళీ తలచుకుంటూ తిరిగి వెళ్తాము.కొన్ని రోజులు మనసులో మెదుల్తూ ఉంటారు.కాలం గడిచిన కొద్దీ స్మృతులు మసకబారుతూ ఉంటాయి.

      అలా కాకుండా ఆ మనుషులు ఆ ఊరు మన మనసులో స్థిర నివాసం ఏర్పరుచుకుంటే.వారి లాగా నీవెందుకు జీవించలేక  పోతున్నావు అని  నీ అంతరాత్మ నిరంతరం ప్రశ్నిస్తూ ఉంటే.

     Dr DRK Prasad Dr Padmavathi కృష్ణా జిల్లా చల్లపల్లి వాస్తవ్యులు.ఇద్దరు గైనకాళజిస్టులే.ఆ ఊర్లో చాలా కాలం నుంచి ప్రాక్టీసు చేస్తున్నారు. కొద్దీ సంవత్సరాల క్రితం మా బాలోత్సవం చూడటానికి కొత్తగూడెం వచ్చారు.బాగా నచ్చింది.అప్పటినుంచి అప్పుడప్పుడు అభిప్రాయాలు పంచుకుంటూ ఉంటాము.

        మా ఊరిలో స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమం నిరంతరాయంగా నిర్వహిస్తూ ఉన్నాము ఒక సారి వచ్చి చూడండి అని ప్రసాద్ గారు చెప్పారు.అనుకుంటూనే చాలా రోజులు గడిచి పోయాయి.

        కొత్త సంవత్సరం మంచి వినాలి మంచి చూడాలి అనిపించింది.అప్పుడు గుర్తుకు వచ్చింది చల్లపల్లి.ప్రసాద్ గారితో మాట్లాడితే జనవరి 1న వద్దు 2న రమ్మన్నారు. Satyam Vemuri గారు తోడు వస్తానన్నారు.

         రాత్రి 8గంటలకు ఆఊరు లోకి అడుగుపెట్టాము.వారి ఆసుపత్రికి వెళ్లే రోడ్ తిరగగానే ఆశ్చర్యం. నమ్మశక్యం గా లేదు.కారు ఆపి కిందకు దిగి చుట్టూ చూస్తే బృందావనం లో ఉన్నామనిపించింది.తళ తళ లాడుతున్న రోడ్డు రెండువైపులా అందమైన ఫెన్సింగ్ లోపల 20 అడుగుకో నీడ నిచ్చే చెట్లు మధ్యలో విరగపూసిన పూల బరువుకు ముందుకు వంగి వీచే చల్ల గాలికి తలలూపుతూ మాకు స్వాగతం పలుకుతున్న మొక్కలు .పగలంతా విజయవాడ బాలోత్సవం లో తిరిగి అలసిన శరీరం సేద తీరింది.కొత్త ఉత్సాహం తో వారి హాస్పిటల్ ఆవరణలో అడుగుపెట్టాము.

        ఎదురు వచ్చి పైన నివాసంలోకి తీసుకొని వెళ్లారు.అతిధి మర్యాదలు అయిన తరువాత క్లుప్తంగా స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమానికి నాంది పలికిన వైనం తెలిపారు.  

                                             ####$$$$$$$$$$#####

 

             హాస్పిటల్ కట్టుకుందామని ఆలోచన వచ్చి విశాలమైన ఆవరణలో పచ్చని మొక్కల మధ్య కడితే బాగుంటుంది అనిపించింది ఇద్దరికి.ఉరి బయట రాజు గారి స్థలం పెద్దది కొన్నారు కానీ దారి మొత్తం బహిరంగ మల విసర్జనకు ఉపయోగించుకుంటున్నారు.అనాదిగా ఉన్న అలవాటు.బతిమాలారు.వినలా.బహిరంగ విసర్జన వలన ఆరోగ్యం పై పడే ప్రభావాలు తెలియ చేశారు . వినలా.

          గాంధీ గిరి మొదలెట్టారు.ఇద్దరు ఉదయం 4గంటలకల్లా లేచి రెండుచేతులు జోడించి మూడు నాలుగు గంటల పాటు అక్కడే నిల్చునేవారట.రోజులు గడిచిన కొద్దీ వచ్చేవారి సంఖ్య తగ్గి పోయింది.నెల రోజులలో పూర్తిగా మానేశారు.

       వెంటనే ముందుగా రోడ్ వేసుకుని రెండు పక్కలా సుందరీకరణ మొదలెట్టారు.

                                                             ####$$$$$%####

 

        2014.ఇన్నాళ్లు మన కోసం మనం బతికాం.సమాజం కోసం ఏదైనా చేద్దామన్న ఆలోచన మొదలైంది ఇద్దరిలో.

       ఆలోచనలు చాలా మంది చేస్తారు.చేస్తూనే ఉంటారు.

       ఆచరణలో చూపించే అతి కొద్ది మందిలో ఈ దంపతులు ఇద్దరూ.

        అన్ని ఊర్లు లాంటిదే ఆ ఊరు కూడా.ఎక్కడ చూసినా అశుభ్రత మురుగు బహిరంగ మల విసర్జన ఒక కాంక్రీటు జంగల్.స్మశానం లోకి అడుగు పెడితే ముక్కు ముసుకోవాలి.అక్కడికి అడుగు పెట్టలేక రోడ్డు పక్కనే శవాలను కాల్చేవారు.డంపింగ్ యార్డ్ ఇంకా భయంకరంగా ఉండేది.

       ఇద్దరి ఆలోచనలను మరో ఇద్దరితో పంచు కున్నారు.నలుగురు మరో నలుగురు.చిన్న సైన్యం తయారైంది.

                                                           ###$$$####

 

              నవంబరు12 ఉదయం 4 గంటల సమయం.

       చల్లపల్లి లో పది మంది నిద్ర లేచారు.తట్టబుట్ట చేపట్టారు.చేతికి తొడుగులు మోకాలి దాకా బూట్లు.తలకు తగిలుంచుకునే లైటు.

         ఇద్దరు వైద్యులతో సహా పది మంది మురుగు కాల్వలోకి దిగి శుభ్రం చేయటం చూసి ఆశ్చర్యపోయారు చాలా మంది.

         నమ్మలేక పోయారు.కొద్దీ రోజుల సంబరమేలే అని చెవులు కొరుక్కున్నారు.రోజులు గడుస్తూనే ఉన్నాయి.కాలువలు శుభ్రం అయ్యాయి.రోడ్ల వెంట ఉన్న పిచ్చిమొక్కలన్ని మాయమై పోసాగాయి.వాళ్ళను చూసి ఇంకొంత మంది ఆకర్షితులైనారు.

         మేము సైతం అన్నారు.

        ఉరికోసం ఓ సైన్యం.నీ కోసం నీవు ఎలాగూ బతుకుతావు. ఒక్క సారి పక్కవాడి గురించి ఆలోచించు. నీ ఉరి గురించి ఆలోచించు.ఊరు బాగు పడితే అందరూ బాగుంటారు అందరూ బాగుంటే నీవు బాగుంటావు

    ఎంత అందమైన ఆలోచన.ఎంత లోతైన భావం.

 

                                             #######$$$$$$$#######

 

          రోజులు వారాలైనాయి వారాలు నెలలు నెలలు సంవత్సరాలు.ఆకులు రాలాయి కొత్త చిగుర్లు.

         అదే ఊరు.అవే పరిసరాలు.కానీ కొత్తగా కొంగొత్తగా. అరోగ్యాలు బాగైనాయి.ప్రతి ఇంటికి ఓ మరుగు దొడ్డి.చెత్త బుట్ట.రోడ్డు మీదకు ఊడ్చే వాళ్ళు లేరు.అక్కడక్కడా పబ్లిక్ టాయిలెట్లు వాటి దగ్గర సరిపడా జీతం పొందుతూ బాగోగులు చూసే వారు రోడ్ల కిరు వైపులా చెట్లు అనేక చోట్ల పక్కన ఫెన్సింగ్

        లాన్లు .బస్ స్టాండు పరిశుభ్రంగా తాగునీటి సౌకర్యం లొనంతా పచ్చదనం.

       స్మశానం ఓ ఉద్యానవనం.ముచ్చటైన ల్యాండ్ స్కెపింగ్ తో.

     నేలంతా పరుచుకున్న కార్పెట్ లాన్  అందమైన అరుదైన మొక్కలు రంగు రంగుల పూలు సీతాకోక చిలుకలు.

                                                    ######$$$$$#####

 

         ఉదయం నాలుగు గంటలకు దంపతులు ఇద్దరు వెళ్లి పోయారు.5గంటలకల్లా మేము అక్కడకు వెళ్ళాము.మంచు కమ్మేసింది.కళ్ళు చిట్లించినా ఏమీ కనపడటం లేదు.కారు ఆగింది.

         శ్రావ్యమైన సంగీతం.హెడ్ లైటు కాంతిలో రోడ్డు పక్కన చెట్ల చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలను తవ్వేస్తూ మనుష్యులు.

       పారాలతో గంపలలోకి ఎత్తి పక్కనే ఉన్న ట్రాలీ లోకి ఎత్తేస్తున్న మరి కొందరు.అంతా శుభ్రంగా వూడుస్తున్న మరింతమంది.

         బాబాయ్ అబ్బాయి లు కొందరు మామా అల్లుళ్ళ కొందరు తాతా మనుమలు మరికొందరు ఉమ్మడి కుడుంబపు ఘుమ ఘుమలు.

         శ్రమైక సొందర్యం.ఒకరు టీచర్ మరొకరు పెద్ద వ్యాపారవేత్త ఇంకొకరు బ్యాంకులో అధికారి.ఎవరు ఏ కులమో ఎవరు ఏ మతమో .అదొక ఉమ్మడి కుటుంబం.

         రెండు గంటలు పని చేసి అందరూ కలిసి కాఫీ తాగుతూ కబుర్లు.

        నాలుగు సంవత్సరాలుగా ఏనాడు ఆగలేదట.వర్షం వచ్చినా పిడుగులు పడినా వస్తారు. అది జీవనం లో ఒక భాగం.

      వారి శ్వాస నిశ్వాస సుందర చల్లపల్లి.డాక్టర్లు ఇద్దరూ వాళ్లకు మార్గ దర్శకులు.వాళ్ళందరూ ఆ ఇద్దరికీ అత్యంత ఆత్మీయలు.

    పదవీ విరమణ తరువాత  విశ్రాంత జీవనం లో జీవనానందాన్ని పొందలేక వేరే ఊరిలో కొట్టుకులాడుతూ ఇక్కడకు వచ్చి చూసి వీరితోనే ఉంటూ వీరిలో ఒకడైన ఒక పెద్దాయనను చూస్తే ముచ్చటేసింది.

 

                                                ######&&&&&&######$

 

        చల్లపల్లి లో జరుగుతున్న అద్భుతమైన ప్రక్రియ గురించి మీరు  వినే ఉంటారు కానీ చూసి ఉండరు కదా.

         వెళ్ళండి.చూడండి.చెప్పండి.

        నేను చెప్పింది ఒక శాతం మాత్రమే.ఇంకా చెప్పే శక్తి లేదు నాకు.

     అరుదైన మనుష్యులు. జీవన సౌందర్యాన్ని దర్శించి అనుభవిస్తూ ఆనందిస్తూ  సమైక్య జీవన ఫలాలను దర్శనీయం చేస్తున్నారు.

      Dr D R K Prasad

      Dr Padmavathi

గర్వంగా ఉంది మిమ్ములను కలిసినందుకు

మీతో కొద్దీ గంటలు గడపకలిగినందుకు

4e576632-1453-4ab9-ba57-75951f67c3b1 8de1fa02-35f8-4cb7-a92a-701bccf9f070 a9990766-9a63-4183-b4a6-a1a06aab3921 bab2be42-04b8-40a9-986a-879c6e57e790 baff2c6d-50bc-4e8f-a8d3-f58188397d29

వారితో పాటు వచ్చిన వేమూరి సత్యం గారి తో ముఖాముఖీ సోమవారం(13.01.2019) ఆంధ్రజ్యోతి సాహిత్య పేజీలో వచ్చింది.f9d35757-6f23-476a-b744-a08178fe9b1a

గౌరవనీయులైన డా. రమేష్ గారికి,

మీరు ఎంతో ప్రేమతో రాసిన లేఖకు ధన్యవాదాలు.

మీరు మాకు inspiration.

మీరు చల్లపల్లి వచ్చి మా కార్యక్రమాన్ని చూసినందుకు మాకు ఎంతో సంతోషం గా ఉంది. వేమూరి సత్యం గారిని కూడా తీసుకువచ్చినందుకు మరింత సంతోషం. మీలాంటి పెద్దలు  కార్యకర్తల శ్రమను అభినందించడం  మా కార్యకర్తలకు మరింత ఉత్సాహాన్నిస్తుంది.

మీ ఉత్తరాన్ని మా కార్యకర్తలందరి కోసం మా whatsapp గ్రూప్ లో పోస్ట్ చేశాను. manakosam manam.in website లో కూడా  పోస్ట్ చేశాను.

ధన్యవాదములతో ….

ఇట్లు

మీ  డి.ఆర్.కె. ప్రసాదు.

 

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *