స్వచ్చ సుందర చల్లపల్లి – 07-06-2017

IMG_8594

రెట్టించిన ఉత్సాహం – పట్టుదలకు పరాకాష్ఠ: స్వచ్చ సైనికుల 939* రోజుల కృషి

స్వచ్చ సుందర చల్లపల్లి సాధనలో భాగంగా ఈరోజు ఉదయం 4-30 గంటల నుండి 6-00 వరకు 38 మంది స్వచ్చ కార్యకర్తలు నారాయణరావు నగర్ లోని 6వ నెంబర్ కాలవలో చెత్త, పాతబట్టలు, తుక్కు మొదలైన వ్యర్ధాలను తొలగించి చెత్తను డంపింగ్ యార్డుకు తరలించారు.

కాల్వ గట్టు మీద ఉన్న ముళ్ళచెట్లను నరికి శుభ్రం చేశారు.

ఆర్.టి.సి. ఉద్యోగి “కమలశ్రీ” గారు చెప్పిన ‘జై స్వచ్చ సుందర చల్లపల్లి’, ‘స్వచ్చ సుందర చల్లపల్లిని సాధిద్దాం’ అనే నినాదాలతో నేటి కార్యక్రమం ముగిసింది.

నిన్న విజయవాడలో జరిగిన ‘నవనిర్మాణ దీక్ష’ లో స్వచ్ఛాంధ్ర మిషన్ వైస్ ఛైర్మన్ డా. సి.ఎల్. వెంకట్రావు గారి ఆహ్వానం మేరకు నేను, డా. పద్మావతి గారు, ప్రాతూరి శాస్త్రి గారు, సజ్జా ప్రసాద్ గారు, మాలెంపాటి గోపాలకృష్ణయ్య గారు, రాయపాటి రాధాకృష్ణ గారు, బృందావన్, సుభానీలు పాల్గొనటం జరిగింది. అందులో ‘స్వచ్చ సుందర చల్లపల్లి’ లో సాధించిన విజయాలు, కార్యకర్తల శ్రమ, ఇంకా సాధించవలసిన అంశాలు గురించి power point presentation ఇవ్వటం జరిగింది. కొన్ని వేల మంది ఉద్యోగస్తులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్న ఈ సభలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన స్వచ్చ చల్లపల్లి కార్యక్రమాల గురించి తెలుసుకుని ఎంతో సంతోషించి, రాష్ట్రంలో అందరూ ‘చల్లపల్లి’ని ఆదర్శంగా తీసుకుంటే స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధించటం ఎంతో దూరంలో లేదు అని ప్రశంసించారు. సభికులందరితో మూడుసార్లు చప్పట్లు కొట్టించారు. ‘స్వచ్చ చల్లపల్లి’ 1000వ రోజు వేడుకకు తప్పక హాజరవుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం తరువాత అక్కడ ఉన్న అధికారులలో చాలామంది, టి.వి.లో ఈ కార్యక్రమం చూసిన మన మిత్రులు అనేకమంది తమ హర్షం వ్యక్తం చేశారు. కొంతమంది చల్లపల్లి చూడటానికి రావాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం తరువాత మన బాధ్యత మరింత పెరిగినట్లు అనిపిస్తోంది.

రేపటి కార్యక్రమం కోసం ఉదయం 4-30 గంటలకు నారాయణరావు నగర్ లో 6వ నెంబర్ కాల్వ వద్ద రఫీ గారి ఇంటి దగ్గర కలుసుకుందాం.

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
మేనేజింగ్ ట్రస్టీ
మనకోసం మనం ట్రస్ట్
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
చల్లపల్లి
బుధవారము – 07.06.2017

అప్పుడు – ఇప్పుడు

పనిపాటులు లేని వాళ్ళ ప్రలాపమని రొకప్పుడు
ఒకటి – రెండు నెలల కన్నా ఉండదనిరి కొందరు
సహస్ర దిన స్వచ్చ సేవాశ్రమ సంస్కృతె దేశానికి
జగతికె దిక్సూచియనుచు కీర్తిస్తారిప్పుడు!

-నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

 

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *