పెదకళ్ళేపల్లి రోడ్డులో స్వచ్చ సేవ – కర్మవీరులకు సలాం

                పెదకళ్ళేపల్లి రోడ్డులో

               స్వచ్చ సేవ – కర్మవీరులకు సలాం

2016 ఫిబ్రవరి లో కాసానగరం వద్ద స్వచ్చ కార్యక్రమం చేస్తున్నపుడు శివరాంపురంలో కొందరు పెద్దలు “పెదకళ్ళేపల్లి రోడ్డును కూడా అందరం కలిసి బాగుచేసుకుందాం” అని అభ్యర్ధించారని మన స్వచ్చ కార్యకర్త విన్నకోట వీరబాబు గారు చెప్పారు. BDR ప్రసాదు గారితో చర్చించిన తరువాత ఆరోడ్డును శివరాంపురం గ్రామస్తులతో కలిసి శుభ్రం చెయ్యడం మొదలుపెట్టాము. రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలు కమ్మేసి ఉండేవి. నరికేసిన తాటిబొండ్లు అడ్డదిడ్డంగా ఉండేవి. వీటిని ట్రాక్టరుతో రోడ్డు ప్రక్క అవసరమైన చోట్లకు తరలించి అందంగా అమర్చారు. శివరాంపురం నుండి అనేక మంది పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు. కార్యకర్తలందరూ ఎంతో కష్టపడి బస్టాండ్ నుండి శివరాంపురం చివరి వరకు గల 3 కిలో మీటర్ల రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలను నరికి ట్రాక్టర్ లో లోడ్ చేసి డంపింగ్ యార్డుకు తరలించారు.

రోజులు గడుస్తున్నకొద్దీ రోడ్డు చాలా విశాలంగా, అందంగా కనిపించసాగింది. శివరాత్రికి పెదకళ్ళేపల్లి వెళ్ళే భక్తుల ప్రయాణానికి చాలా ఉపయోగంగానూ, ఆహ్లాదకరంగానూ మారింది. శివరాంపురం కార్యకర్తలు కొంతమంది అప్పటి నుండి స్వచ్చ చల్లపల్లి కార్యక్రమంలో పాల్గొంటూనే ఉన్నారు. పనిలో పనిగా శివరాంపురం చెరువు చుట్టూ చక్కటి పూలవనం కూడా తయారయింది. స్వచ్చ శివరాంపురం 100 వ రోజు వేడుకను అక్కడే ఘనంగా జరుపుకున్నాం.

2017 జనవరి 31 నుండి ఫిబ్రవరి 12 వ తేదీ వరకు, సెప్టెంబర్ లో 10 రోజులు, అక్టోబర్ లో 12 రోజులు, డిసెంబర్ లో 23 రోజులు ఆ రోడ్డులోనే పనిచేసి ఆ 3 కిలోమీటర్లు మొక్కలు నాటి, పాదులు చేసి కంపను కట్టాము. మేకలడొంక వద్ద సువర్ణ గన్నేరు, కాగితం పూల మొక్కలతో పాటు బిళ్ళగన్నేరు మొక్కలను మన కార్యకర్తలు పెట్టారు. ఆ మేకలడొంక ప్రాంతం బహిరంగ మలవిసర్జన కేంద్రంగా ఉండేది. కొంతమంది చెత్తను కూడా అక్కడే వేసేవారు. కొద్ది రోజులపాటు ఒక మనిషిని కాపలాగా కూడా పెట్టాం. శివరాంపురం వంతెన వద్ద ఉన్న ఖాళీ స్థలంలో ఒక పూల తోటను ఏర్పాటుచేశాము. “మనకోసం మనం” ట్రస్టు టాంకరుతో ఈ మొక్కలన్నింటికి నీళ్ళు పోయిస్తున్నాము.

ఆ సంవత్సరం దాసరి ఆళ్వార్ స్వామి గారు, గుంటూరు నుండి వచ్చిన దాసరి హనుమంతరావు గారు, నన్నపనేని అయ్యన్ రావు గారలు కూడా మొక్కలు నాటడం జరిగింది. క్రిష్ణజిల్లా కలెక్టర్ లక్ష్మీ కాంతం గారు ఒక దేవకాంచనం మొక్కను నాటారు.

2018 లో కూడా శివరాత్రి సమయంలో స్వచ్చ కార్యక్రమాన్ని ఈ రోడ్డులోనే చేశాము. కొన్ని మొక్కలకు మరొకసారి కర్రలు పాతడం, కంప కట్టడం చేశాము. సువర్ణ గన్నేరు మొక్కలు విరగాపూసి, పెదకళ్ళేపల్లి రోడ్డు అందం ద్విగుణీకృతం అయింది.

ఈ సంవత్సరం జనవరి 3 వ తేదీ నుండి ఇప్పటి వరకు కొద్ది రోజులు మినహా ఆ రోడ్డులోనే పనిచేస్తున్నాము. మరొక్కసారి కలుపు మొక్కలన్నీ తీసివేయడం, మొక్కలకు కట్టిన పాత కంపను తీసివేసి, పాదులు చేసి, కర్రలతో మొక్కలను నిటారుగా నిలబెట్టడం చేస్తున్నాం. “మనకోసం మనం” ట్రస్టు కార్మికులు ఈ మొక్కలకు కొత్త కంపను కడుతున్నారు.

రోడ్డుకు కుడి వైపున ఉన్న డ్రైనును, డ్రైను గట్టునూ కూడా ఈ సారి శుభ్రం చేయడంతో రోడ్డు ఎంతో విశాలంగానూ, పరిశుభ్రంగానూ, పూల అందాలతో జీవకళ ఉట్టిపడుతోంది. కార్యకర్తల సుదీర్ఘ నిర్విరామ శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది.

2016 నుండి ప్రతి శివరాత్రికి ఆ రోడ్డులోనే స్వచ్చ సేవలందిస్తున్నాం. రేపు శివరాత్రి. రేపు కూడా మన కార్యక్రమం ఆ రోడ్డులోనే…

మనం ఉదయం చేసే స్వచ్ఛ సేవలను తిలకించి, అభినందించడానికి అనేక మంది ప్రముఖులు విచ్చేశారు.గౌరవనీయులు J.D. లక్ష్మీ నారాయణ గారు, డా. గురవారెడ్డి గారు, డా. గోపాళం శివన్నారాయణ గారు, అమెరికాలో నివశిస్తున్న డా. గవరసాన సత్యన్నారాయణ గారు, శ్రీమతి సుభద్రమ్మ గారు కూడా ఈ రోడ్డులోనే మన స్వచ్చ సేవలను తిలకించారు, కొందరు పాల్గొన్నారు.

నేటి కాలంలో అరుదైన ఈ స్వచ్ఛ సేవా వివరాలను తెలిపే 4 బోర్డులు రాయించి ఈ రోడ్డు ప్రక్కన పాతించాం. అరచేతులు కాయలు కాస్తున్నా- గూళ్ళు నెప్పులు పెడుతున్నా, తెల్లవారుజామునే నిద్రలేచి రెక్కలు ముక్కలు చేసుకుంటూ ప్రతిరోజూ 2 గంటలకు పైగా స్వచ్చ సేవలను అందిస్తున్న మన కార్యకర్తలను “కర్మవీరులు” అని పేర్కొని, రామారావు మాష్టారు ఈ బోర్డులపై రాయించారు.

తమకూ, తమ కుటుంబానికీ ఏ ప్రయోజనమూ లేకపోయినా విలువైన తమ ప్రాతః సమయాన్ని, శక్తిని, ధనాన్ని, చెమటను వెచ్చిస్తున్న ఈ నిస్వార్ధ కర్మ వీరులకు

సలాం… సలాం….. సలాం….

– డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
03.03.2019.

 

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *