ఎవరు చేస్తారండి ఈ నిస్వార్ధ కృషిని? ఈరోజుల్లో!

1

ఎవరు చేస్తారండి ఈ నిస్వార్ధ కృషిని?  ఈరోజుల్లో!

          చల్లపల్లి సమీపంలోని శివరాంపురం రోడ్డులో ఈ ఉదయం 4 గంటలకే 13 మంది వ్యక్తులు నిలబడి  ఫోటో దిగుతున్నారు. మంచులో అంత పొద్దున్నే ఎందుకు అక్కడకు రావడం? 4 గంటలకు అక్కడకు చేరుకోవాలంటే పొద్దున్నే 3 గంటలకే నిద్ర లేచి ఉండాలి గదా! అంటే రాత్రి ఎన్ని గంటలకు నిద్రకు ఉపక్రమించి ఉంటారు? ఇంత తెల్లవారుఝామున వీరందరూ అక్కడకు విచ్చేయాల్సిన అవసరం ఏమిటి?మరికొన్ని నిముషాలలోనే నెమ్మదిగా ఒకొక్కరు వచ్చి వారితో కలిసి, మొత్తం 30 మంది అయ్యారు.

వచ్చిన ప్రతి ఒక్కరూ చేతులకు  గ్లౌస్ వేసుకొని, తలకు లైటు బిగించుకుని, ట్రాక్టరులో ఉన్న కత్తినో, గొర్రునో, చీపురునో తీసుకుని, సుశిక్షితుల్లా రోడ్డు ప్రక్కకు వెళ్తున్నారు. కొందరైతే  రెండు చేతులతో రెండు కత్తులూ, రెండు రకాల చీపుర్లూ, ఇంకా రకరకాల పనిముట్లను తీసుకుని రోడ్డు ప్రక్క పిచ్చి మొక్కలను నరికి, ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయడం మొదలుపెట్టారు. కొందరు ఈ చెత్తను ట్రాక్టరు లోనికి ఎక్కిస్తున్నారు. మరికొందరు శుభ్రంగా ఆ ప్రాంతాన్ని పారతో అద్దంలా చెక్కుతున్నారు. నలుగురైదుగురైతే రోడ్డు ప్రక్కనున్న అనాకారి తాడి చెట్లను కత్తులతో చెక్కి సుందరీకరిస్తున్నారు. కొందరు స్త్రీలు తమ పెరడు కంటే అందంగా ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతున్నారు.

ఇది వీరి ఇల్లు కాదు, చావడి కాదు, పొలమూ కాదు.వీరు ఈ ప్రాతః సమయంలో చేస్తున్న ఆ కృషి  వీరి ఇంటికి గానీ, వీరి వీధికీ గానీ ఉపయోగపడదు. అది ఎవరి పొలమో తెలియదు. అయినా వీరు శుభ్రం చేసిన చోట ఎవరైనా సరే హాయిగా పండుకొనవచ్చును. ముచ్చట గొలిపే ఆ దారిలో వెళ్లే వారు నిదానించి అక్కడి పూల సౌరభాన్ని, పచ్చదనాన్ని ఆఘ్రాణించి, ఆస్వాదించి వెళ్ళక తప్పదు. ఇప్పుడాప్రాంతం అంత శుభ్రంగా ఉంటుంది మరి!

4 గంటలకు వచ్చిన వారు 6 గంటలకు ఆనాటి  పని ఆపుదలకు ఈల మ్రోగుతున్నా 6.20 వరకు పని ఆపలేదు. వీరి పనికి కూలీ లేదు. ఆ చలిలో-మంచులో వారు కార్చిన చెమటకు ఖరీదు కట్టే షరాబులున్నారో లేరో తెలియదు. ఇక ఆ తరువాత వారంతా ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ కాఫీలు తాగుతున్నారు. “అక్కా, అన్నా, వదినా, బాబాయ్ …..”అని వరుసలతో పిలుచుకుంటూ ఆనందిస్తున్న వారి ముఖాల్లో ఎంత తృప్తి !     

రెండు గంటల తమ శ్రమతో అందంగా తయారైన ఆ ప్రాంతాన్ని చూసుకుని మహా ముచ్చటపడిపోతున్నారు!

ఆరోజు పనిచేసిన ఆ 30 మంది చివరగా ఒక గ్రూప్ ఫోటో దిగి “జై స్వచ్చ సుందర చల్లపల్లి!- స్వచ్చ సుందర చల్లపల్లి ని సాధిస్తాం – సాధిస్తాం” అనే నినాదాలతో  సంకల్పం చెప్పుకొని మరునాటి కార్యక్రమం ఎక్కడో నిర్ధారించుకొని ఇళ్లకు బయలుదేరారు.

ప్రతి రోజూ ఇలా 2 గంటల పైగా సమయాన్ని తమ కోసమో, తమ కుటుంబం కోసమో కాక  గ్రామం కోసం, తమ సమాజం కోసం చెమటలు క్రక్కుతూ శ్రమిస్తున్న వీరిని చూడడం కోసం ఇప్పటివరకు దేశ విదేశాలలో- ఎక్కడెక్కడినుండి ఎంతమంది ప్రముఖులు  వచ్చారో!

   ముంబై నుండి మహాత్ముని మునిమనవడు డా. ఆనంద్ గోకనీ గారు, CBI లో పనిచేసి రిటైర్ అయిన J.D. లక్ష్మీనారాయణ గారు, డా. మిత్రా గారు (హైదరాబాదు), డా. గురవారెడ్డి గారు (హైదరాబాదు సన్ షైన్ హాస్పటల్),   న్యూరాలజిస్ట్  డా. గోపాళం శివన్నారాయణ గారు(విజయవాడ), డా. యార్లగడ్డ రమేష్ గారు(ఆయుష్ హాస్పటల్- విజయవాడ),  డా. కొడాలి జగన్ మోహన్ రావు గారు, డా.శ్రీ లక్ష్మి గారు(నాగార్జున హాస్పటల్- విజయవాడ), డా. గవరసాన సత్యన్నారాయణ- సుభద్రమ్మ దంపతులు(USA), డా. వాసిరెడ్డి రమేష్ గారు(కొత్తగూడెం), ప్రముఖ రచయిత వేమూరి సత్యన్నారాయణ గారు(హైదారాబాదు), డా.వేగేశ్న పృధ్వీ రాజు గారు(USA)…. ఎంత మంది పేర్లను చెప్పను! ఎందరో అనితరసాధ్యమైన ఈ మహత్కృషిని ప్రత్యక్షంగా చూసి అభినందించారు, స్వయంగా చీపుర్లు పట్టుకొని భాగస్వాములయ్యారు.

ఎవరు చేస్తారండి ఈ పనులు? ఈరోజుల్లో!  ఎక్కడ చూస్తామండి ఇంతటి సుదీర్ఘ నిర్విరామ నిస్వార్ధ సేవలను ఈ కాలంలో ?

నేటికి 1584 రోజుల నుండి స్వచ్చచల్లపల్లి కార్యకర్తలు చేస్తున్న ఈ శ్రమనుచూసి,నమ్మి,అభినందించి, స్వయంగా పాల్గొని  తరించవలసిందే కానీ, వర్ణించడానికి మాటలు చాలవు.   

 

– డా. దాసరి రామకృష్ణ ప్రసాదు,

(స్వచ్చ చల్లపల్లి కార్యకర్త)

14.03.2019

113 మంది వ్యక్తులు 1 (3) 1 (8) 1 (12) 1 (13) 1 (18) 1 (20) 1 (21) 1 (28)1 (4) 1 (5) 1 (9) Group14.03.2019 నాటి గ్రూపు ఫోటో

2019 Photos

2018 Photos

2017 Photos

2016 Photos

 

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *