స్వచ్చోద్యమ సహకారులైన – ఎందరో మహానుభావులు అందరికీ ధన్యవాదములు

Swachha Challapalli Selfi iPoint

స్వచ్చోద్యమ సహకారులైన – ఎందరో మహానుభావులు అందరికీ ధన్యవాదములు

 

         ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధ ప్రసాదు గారి చొరవతో ప్రారంభించబడిన ‘స్వచ్చ చల్లపల్లి’ ఉద్యమం 4 సంవత్సరాల 5 నెలలు దాటినది. తానొక రాజకీయ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు అయినప్పటికీ ఈ ఉద్యమాన్ని రాజకీయేతరంగానే నడపాలని భావించి కేవలం అభివృద్ధిపరమైన ఉద్యమంగానే కొనసాగడానికి ఎంతో సహకరించినందుకు ధన్యవాదములు.

 

          పార్లమెంట్ సభ్యులు శ్రీ కొనకళ్ల నారాయణరావు గారు కూడా ఈ ఉద్యమానికి తనవంతు సహకారం ఇచ్చారు.

 

         ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ఉద్యమాన్ని ఎక్కడా విమర్శించలేదు, వ్యతిరేకించలేదు అవసరమైనప్పుడు తగిన సహకారాన్ని అందించారు కూడా.

 

         చల్లపల్లి మండలాధ్యక్షులు శ్రీ యార్లగడ్డ సోమశేఖర ప్రసాదు (లంకబాబు) గారు ఈ స్వచ్చోద్యమంలో తానూ భాగస్వామిగా, అండగా నిలిచారు.

 

         ZPTC సభ్యులు శ్రీమతి పైడిపాముల కృష్ణకుమారి గారు తానే ఒక స్వచ్చ కార్యకర్తగామారి ఉద్యమానికి ఊపిరిఊదారు.

 

         MPTC మెంబర్లు, గ్రామ సర్పంచ్ శ్రీమతి కట్టా పద్మావతి గారు, ఉప సర్పంచ్ ముమ్మనేని రాజ్ కుమార్ (నాని) గారు, వార్డు మెంబర్లూ అవసరమైనప్పుడల్లా తాము చేయగలిగిన సహాయాన్ని చేశారు.

 

         గ్రామ పెద్దలు, గ్రామస్తులు, అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు(తహసీల్దారు గారు వారి సిబ్బంది, MDO గారు వారి సిబ్బంది, PR, RWS, Irrigation & Drainage, ఎలక్ట్రికల్ ఇంజనీర్లు, D.S.P గారు, C.I గారు, S.I గారు, పోలీసు సిబ్బంది, పంచాయితీ సెక్రటరీ బొల్లినేని ప్రసాదు గారు), శానిటరీ సిబ్బంది తమతమ సహకారాలానందించారు.

 

         నేడు ‘స్వచ్చ చల్లపల్లి’ ఉద్యమం దేశవ్యాప్తంగా తెలియడానికి ముఖ్య కారణం మన జర్నలిస్ట్ మిత్రుల కృషి (Print Media & Electronic Media). వారి సేవలను ప్రస్తుతించడానికి మాటలు సరిపోవు.

 

         డా. గురవారెడ్డి గారి లాంటి అనేకమంది మిత్రులు, పెద్దలు ఎంతోమంది స్వచ్చ చల్లపల్లి ఉద్యమానికి అయాచితంగా విరాళాలు ఇచ్చి ప్రోత్సహించారు. మరికొంతమంది పెద్దలు మాటసహకారం చేసి ప్రోత్సహిస్తున్నారు.

 

         గానగంధర్వులు శ్రీ S.P. బాలసుబ్రమణ్యం గారి వంటి ఎంతో మంది సుప్రసిద్ధులు మన గ్రామాన్ని సందర్శించి కార్యకర్తల శ్రమను అభినందించడమే కాకుండా  వారు వెళ్ళిన చోటల్లా స్వచ్చ చల్లపల్లి ని ఒక ఆదర్శ గ్రామంగా ప్రస్తావించి ప్రస్తుతిస్తున్నారు.

 

         డా. పద్మావతి గారు స్వచ్చ కార్యకర్తగా పనిచెయ్యడమే కాకుండా భూరి విరాళాలతో ‘స్వచ్చ చల్లపల్లి’ ఉద్యమాన్ని “స్వచ్చ సుందర చల్లపల్లి” ఉద్యమంగా మలిచారు.

 

         నేటికి 1616 రోజులుగా తమ కోసం, తమ కుటుంబం కోసం కాకుండా, తమ సమయాన్ని, శక్తిని, డబ్బుని గ్రామాభివృద్ధి కోసం కేటాయిస్తున్న స్వచ్చ కార్యకర్తల కృషిని ప్రత్యక్ష్యంగా చూసి, పాల్గొని, పలవరించాలే తప్ప దానికి వెలగట్టలేము.

 

         ప్రతి ఉదయం 2 గంటల పాటు జరిపే ఈ స్వచ్చ కార్యక్రమమే సామాజికవికాసానికి, గ్రామాభివృద్ధికి పునాది. ఏళ్ల తరబడీ వీరు చేస్తున్న “మొక్కలు నాటడం, శ్మశానాల, కార్యాలయాల, డంపింగ్ యార్డుల స్వచ్చ సుందరీకరణం, రహదారి వనాలనిర్మాణం వంటి వాటన్నింటి కొనసాగింపు “మనకోసం మనం” ట్రస్టు ద్వారా జరుగుతోంది.

 

         ఇలా ఎంతోమంది సమిష్టి కృషి వల్లనే మన ‘స్వచ్చ సుందర చల్లపల్లి’ ఉద్యమం నిరాటంకంగా కొనసాగుతున్నది.

 

         ఉదయం జరిగే స్వచ్చ కార్యక్రమంలో రాజకీయ పరమైన అంశాల ప్రస్తావన వద్దని, ఒత్తిడికి గురిచేసే మాటలు కుల – మత – ప్రాంతీయ చర్చలు తేవద్దని, తమపై వచ్చే ప్రతికూల వ్యాఖ్యలను (Negative comments) పట్టించుకోరాదని తీసుకున్న నిర్ణయాలను కార్యకర్తలు అమలుచేయడం అభినందనీయం.

 

         ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు (MLA, MP ఎలక్షన్లు) ముగిశాయి. అభ్యర్ధులందరూ మంచి వారే. వారంతా మన ఉద్యమాన్ని వెన్నుతట్టి మెచ్చుకుంటూ సహకరించారు. వారందరికీ వందనాలు. గెలిచిన అభ్యర్ధుల సహకారం రేపు మన గ్రామాభివృద్ధికి అవసరం. వీరు మన ఉద్యమానికి తప్పక సహకరిస్తారని ఆశిద్దాం.

 

         మన ప్రధాన లక్ష్యాలయిన పచ్చదనం, సుందరీకరణలలో మనం ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాలే వచ్చాయి.

 

         పరిశుభ్రత విషయంలో గ్రామస్తులను తట్టిలేపే (Sensitize చేసే) విషయంలో మన కార్యకర్తల కృషి దాదాపు ఫలించినట్లే(ఇంకా మారని వారు 10% లోపే వుంటారు). పంచాయితీ వాహనం (ట్రాక్టరు గాని, రిక్షా గాని) తమ వీధికి వస్తే చెత్తనివ్వడానికి గ్రామస్తులు ఎదురుచూస్తున్నారంటే – ఇది స్వచ్చ కార్యకర్తల, మనకోసం మనం ట్రస్టుల సంయుక్త కృషి ఫలితం.

 

         ఇక గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో ప్రతిరోజూ ప్రధాన రహదారికి ఉదయం, సాయంత్రం రెండుసార్లు, నివాస ప్రాంతాలలో ప్రతి వీధికి రెండు రోజులకు ఒకసారి చెత్తను సేకరించే విధానం పంచాయితీ ఆధ్వర్యంలో నెలకొల్పబడాలి. ఈ ఒక్కటి కనుక జరిగితే మన ఉద్యమం నూరుశాతం విజయం సాధించినట్లే.

 

         మళ్ళీ గ్రామ పంచాయితీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికలు కూడా మన ఉద్యమంపై ప్రతికూల ప్రభావం చూపకూడదు.

 

         పంచాయితీ నుండి జరిగే గ్రామాభివృద్ధి కార్యక్రమాలలో ముందుముందు మనం పాలుపంచుకొనే పద్ధతులను ఇప్పుడు మరింతగా అధ్యయనం చేద్దాం. బూరుగుపూడి, యాజలి వంటి ఆదర్శ గ్రామాలలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రజల పాత్రను గమనించి మనం కూడా చురుకుగా మన గ్రామం ఆభివృద్ధిలో పాలుపంచుకుందాం. రజనీకాంత్ ఆరోలీ చెప్పినట్లు – “ఎంత అద్భుతంగా రచించబడిన కార్యక్రమమైనా ప్రజల భాగస్వామ్యం లేకుండా విజయవంతం కాదు!”

 

         మన గ్రామాన్ని ఒక నమూనాగా దేశానికి చూపించాలంటే ఎంతో ఓపిక కావాలి. మన కార్యకర్తలకు అది పుష్కలంగా ఉంది.

 

         సుధీర్ఘమైన స్వచ్చ చల్లపల్లి ఉద్యమానికి సహకరించిన ఎందరో మహానుభావులు! అందరికీ వందనములు, ధన్యవాదములు!   

 

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
సోమవారం – 15/04/2019.

 

 

గుర్తుకొస్తున్నాయి ………..

 

ఆకుపచ్చ చల్లపల్లి ఐకమత్యమున్న పల్లి

అందమైన చల్లపల్లి అచ్చ తెలుగు నిత్యమల్లి

చేయి కలిపి ఒకరికొకరు సేవ చేయు పాలవెల్లి!

 

జైజై స్వచ్చ చల్లపల్లి

మాకు జన్మనిచ్చినట్టి పల్లె తల్లి

 

                                – జొన్నవిత్తుల

 

స్వచ్చ సుందరపల్లి మా చల్లపల్లి

అందాలు విరబూయు మా కల్పవల్లి “స్వచ్చ”

ఊహకందని త్రోవ ఊరి ప్రజలా సేవ

చూచి పోవలె వచ్చి మా పల్లెనీ

అందాలు విరజిమ్ము మన తల్లినీ

 

                    – గుడిసేవ విష్ణుప్రసాద్

 

జై చల్లపల్లి జై స్వచ్చ కల్పవల్లీ

నా గీతా – నా ఖురాన్ – నా బైబుల్ – నా గ్రంథ సాహెబ్

నా గీతా నా ఖురాన్ నా బైబుల్ నా గ్రంథ సాహెబ్ ఎంత పవిత్రమో

నా చల్లపల్లి చల్లగా పవిత్రతగా ఉండాలని

ప్రతిన పూనుతున్నా-నే ప్రతిజ్ఞ చేస్తున్నా …….

ప్రతిన పూనుతున్నాం….మేం ప్రతిజ్ఞలు చేస్తున్నాం.

 

                  – సుద్ధాల అశోక్ తేజ

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *