చెత్త భూతాన్ని తరిమికొట్టలేమా?

(గత కొన్ని రోజులుగా పత్రికల వార్తలను చూసిన చల్లపల్లి స్వచ్చ కార్యకర్తల చర్చల సారాంశం ఇది)

చెత్త భూతాన్ని తరిమికొట్టలేమా?

   “పెరిగిపోతున్న ప్లాస్టిక్ భూతం,” “మా ఊరి వద్ద డంపింగ్ యార్డు వద్దు,” “ఎక్కడెక్కడి వాళ్లూ మా ఊరి ప్రక్కన చెత్తను పడవెయ్యవద్దు”- అని ఆందోళన చెందుతున్న-చేస్తున్న ప్రజా సంఘాలు- “ఈ సమస్యలకు పరిష్కారాలేమిటి” అని తలలుకొట్టుకుంటున్న అధికారులు, పాలకులు.    

     – ఇలాంటి  వార్తలను దినపత్రికలలో ప్రతిరోజూ మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇవన్నీ పరిష్కారం దొరకనంతటి జటిలసమస్యలేనా?

 

పరిష్కారాలు:

 అన్ని ఇళ్లు, వ్యాపార సంస్థలు, ఆఫీసులు, విద్యా సంస్థల నుంచి ప్రభుత్వమే – అంటే పంచాయతి లేక మునిసిపాలిటీ ఆధ్వర్యంలో తడి-పొడి చెత్తల విడి విడి సేకరణ ఖచ్చితంగా జరగాలిసిందే.

– తడి చెత్త: ఇప్పటికే దాదాపు అన్ని గ్రామాలలో సిద్ధంగా ఉన్న “ చెత్త నుండి సంపద” తయారీ కేంద్రాలకు అంటే తడి చెత్తను వాన పాముల సాయంతో కంపోస్ట్ ఎరువుగా మార్చే కేంద్రాలకు చేర్చాల్సిందే.

– ఇక పొడిచెత్త:  రకరకాల ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని ప్రభుత్వం కనీస స్థాయికి తగ్గించాలి. ప్రజలూ సహకరించాలి.  అసలు ముందుగా వీలైనంత తక్కువగా వాడకం చేయడానికి జనాన్ని ప్రభుత్వమే ప్రోత్సహించాలి. అంటే అనవసరమైన ప్లాస్టిక్ వస్తువులను మనం వాడకూడదు. బహుమతులు, జ్ఞాపికలు(మెమొంటోలు)ఎక్కువభాగం ప్లాస్టిక్ వే. వీటి వాడకాన్ని నిరుత్సాహపరుస్తూ ప్రభుత్వం ప్రచారం చేయాలి.

           a. అన్ని రకాల ఫ్లెక్సీ లనూ ప్రభుత్వం నిషేధించాలి. ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తే ఈ పని ఖచ్చితంగా అవుతుంది. ఇప్పటికే ఈ నిషేధం కొన్ని రాష్ట్రాలలో అమలవుతున్నది కూడ.

           b. Single use plastic అంటే ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులనన్నింటినీ నిషేధించాలి. ప్లాస్టిక్ భూతంలో సగ భాగం Single use plastic వస్తువులదే. అంటే

 

  1. ప్లాస్టిక్ గ్లాసులు

 

  1. ప్లాస్టిక్ విస్తర్లు

 

  1. ప్లాస్టిక్ కాకున్నా భూమిలో కరగని ‘తగరం విస్తర్లు’

 

  1. క్యారీ బాగులు(100 మైక్రాన్ల లోపు)

 

  1. ప్లాస్టిక్ స్ట్రాలు ( ఇప్పుడు వచ్చే straws అన్నీ ప్లాస్టిక్ వే)

 

  1. ప్లాస్టిక్ స్పూన్లు, ఫోర్క్ లు

 

  1. ప్లాస్టిక్ పన్ను పుల్లలు

 

  1. ప్లాస్టిక్ ఐస్ క్రీం కప్పులు

 

ప్లాస్టిక్ సంచులకు పరిష్కారం  వచ్చాక నిషేధించడం కాదు- నిషేధంతో ప్రత్యామ్నాయాలు వాటంతటవే వస్తాయి. నెల రోజుల సమయం ఇచ్చి పైన చెప్పిన ప్లాస్టిక్ వస్తువుల్ని నిషేధిస్తే మార్పులు అవే వస్తాయి. కావలసింది చిత్త శుద్ధి మాత్రమే!

 

             15 ఏళ్ల నుండీ  మంగళగిరి చేనేత కార్మికులు తాము తయారు చేసిన బట్టల్ని అమ్మేటప్పుడు క్యారి బ్యాగుల్లో కాక పేపర్ లో చుట్టి ఇస్తున్నారు. అలాగే పరిష్కారాలు వస్తాయి. అందుకనే మనం అప్పటి వరకు ఆగవద్దు.

 

            ఇక పలుమారులు వాడదగిన  పొడి చెత్తలు అంటే  అల్యూమినియం, ప్లాస్టిక్, ఇనుము, బట్టలు, e-waste వంటివి తగిన పద్ధతిలో  రీసైకిల్ చెయ్యాలి.

 

            హరిత వేడుకలకు(Green Functions) ప్రభుత్వం గుర్తింపులు, ప్రోత్సాహకాలు ప్రకటించాలి.

 

            పై అంశాలను ప్రజలు, ప్రభుత్వం శ్రద్ధతో పాటిస్తే  డంపింగ్ యార్డుల- ప్లాస్టిక్ భూతాల- ప్రజాందోళన ల  సమస్యలే ఉండవు. వీటిని పరిష్కరించే మంత్ర దండం ప్రభుత్వం చేతిలో నే ఉన్నది. ఇందుకు పెద్దగా డబ్బు ఖర్చు కూడ ఉండదు.

 

 ఖచ్చితమైన – పాలనాపరమైన చిత్తశుద్ధితో కూడిన చర్యల వల్ల మాత్రమే ప్లాస్టిక్ భూతాల, డంపింగ్ కేంద్రాల సమస్యలు  తొలగిపోయి, ప్రజారోగ్యం మెరుగుపడుతుందనీ, ప్రభుత్వాలు తప్పక ఆ నిర్ణయాలనమలు చేయగలవనీ స్వచ్చ సుందర కార్యకర్తలు ఆశిస్తున్నారు.

 

– డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

చల్లపల్లి

(స్వచ్చ సుందర కార్యకర్తల తరపున)

10.06.2019

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *