అడుగులు వేస్తున్న నడక సంఘం మిత్రులు

19

(తమ ఆరోగ్యం కోసమే కాక, 20 వేల మంది ప్రజల ఆరోగ్యం కోసం కూడా)

అడుగులు వేస్తున్న నడక సంఘం మిత్రులు

చల్లపల్లి లో ఉన్నా, లాస్ ఏంజల్స్ లో ఉన్నా నన్ను వెంటాడుతూ వస్తున్నది సుదీర్ఘకాలంగా విజయవంతమవుతున్న స్వచ్చ సుందర చల్లపల్లి ఉద్యమమే! ఒక సామాజిక పరిశీలకుడుగా ప్రతి దినమూ నాకిది సంభ్రమాశ్చర్యకరమే!!

మరీ ముఖ్యంగా అందులోని 3 ఘట్టాలు – 2060 రోజుల క్రిందటి గంగులవారిపాలెం రోడ్డు సంస్కరణ, 750 రోజుల క్రిందటి శ్మశాన స్వచ్చ సుందరీకరణ సన్నివేశం, 3 రోజుల క్రిందట ఆదివారం (4-8-19) మోపిదేవి దాక 80 మంది పాల్గొన్న “స్వచ్చతా నడక” సాహస ఘట్టం నాకెప్పుడూ గుర్తొచ్చే సంఘటనలు.

యాదృచ్ఛికమే కావచ్చు – పై మూడిటిలోను S.R.Y.S.P కళాశాల ‘నడక సంఘం’ మిత్రుల ప్రోద్భలం, స్పూర్తి, భాగస్వామ్యం అనివార్యంగా చోటు చేసుకున్నాయి.

– జనవిజ్ఞానవేదిక వాళ్ళు గంగులవారిపాలెం రోడ్డు మీద బహిరంగ మలవిసర్జనను అడ్డుకొంటూ కాపలాకాస్తుంటే – ఈ నడక సంఘం వారు నైతిక మద్దతు ఇచ్చారు.

– శ్మశాన సంస్కరణ కోసం అక్కడ కాలు పెట్టేందుకు కూడా కొందరు సంశయిస్తుంటే, (అంతకు ముందు 2వ, 4వ ఆదివారాలు మాత్రం గ్రామ సేవకు వచ్చే) పైన పేర్కొన్న మిత్రులే  నెలరోజుల పాటు ప్రతిదినం ధైర్యంగా రోజూ ఆ కఠోరమైన శ్మశానసేవకు నడుం కట్టి, 1000 వ రోజుకు దాని స్వచ్చ సుందరీకరణ పూర్తి చేయడంలో సహకరించారు.

– వారం రోజులనాడు ‘మోపిదేవి దాక స్వచ్చతా నడక’ అనే ప్రస్తావన వచ్చినప్పుడు –‘6 కి.మీ. నడవడం కుదరదేమో’ అని కొందరు సంశయిస్తుంటే, ఒకరిద్దరు ‘ఎందుకు నడవలేం? వాకర్స్ అసోసియేషన్ వాళ్ళను ముందు పెట్టుకుందాం’ అని ప్రతిపాదించారు. వాళ్ళు అన్నట్లే ఆదివారం నాడు అక్షరాలా అదే జరిగింది.

ఒక మంచి సామాజిక మార్పు కోసం నడుస్తున్న స్వచ్చోద్యమానికి ఇలా అడుగడుగునా ప్రోత్సాహమిస్తూ, భాగస్వాములౌతున్న ‘నడక సంఘం’ మిత్రులు అభినందనీయులు. గ్రామంలోని అన్ని వర్గాల, వృత్తి సంఘాల, ఆలోచనపరుల – సహకారం ఉంటేనే గదా, ఏ ఉద్యమమైనా జయప్రదమయ్యేది!

నల్లూరి రామారావు

చల్లపల్లి.

ది. 07.08.2019

15 22

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *