స్వచ్ఛ సుందర చల్లపల్లి – 16/08/2019 (1739* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1739* వ నాటి వర్తమానం.

 ఈ శుభోదయం గ్రామ కర్తవ్య నిబద్ధులు24 మంది. మేకల డొంక వంతెన నుండి వైన్ షాపుల వైపు శివరాంపురం మార్గం నేటి వారి కార్య రంగం.

వీరిలో కొందరు దారి కిరువైపుల గత నాల్గు వారాల వర్షాలకు దట్టంగాపెరిగిన గడ్డిని, పిచ్చి మొక్కల్ని, పై నుండి రాలిన తాటాకుల్ని, ఇతర వ్యర్ధాలను పెరికి, తరిగి, ఏరి, ఊడ్చి, ట్రాక్టరు కెత్తి 4 కి.మీ. దూరంలోని చెత్త కేంద్రానికి తరలించారు.

మరికొందరు రోడ్డు వైపుకు పెరుగుతున్న కొమ్మల్ని, పాత మొక్కల క్రింది వైపు కొమ్మల్ని ట్రిమ్ చేసి, మొక్కల పాదుల్ని సరిజేసే సుందరీకరణ కృషి చేశారు. ఒంగిపోయిన చిన్న చెట్లను నిలబెట్టి, త్రాడుతో కట్టారు.

ఇద్దరు దమ్ము చేయవలసిన పొలం నీటిలో దిగి, రైతుల పనికడ్డం వచ్చే తాటి మట్టల్ని, ఒడ్డుకు చేర్చి, ట్రాక్టర్ లో కెత్తారు.

ఈ గంటన్నర పాటు జరిగిన రహదారి స్వచ్ఛ సుందరీకరణ కృషి తర్వాత అక్కడి నుండి 2 కి.మీ. మేర శివరామపురం మార్గం శుభ్ర హరిత శోభాయమానంగా ఉన్నది.

కాఫీ అనంతర సమావేశంలో నిన్నటి స్వాతంత్ర్య దిన వేడుకలో మన డాక్టర్ డి.ఆర్.కె. ప్రసాదు గారి తరపున చల్లపల్లి కార్యకర్తలు కలెక్టరు గారి నుండి స్వీకరించిన ప్రశంసా పత్రం ప్రముఖంగా ప్రస్తావనకొచ్చింది. మచిలీపట్నంలో తాము ‘ ఆ పత్రం సగౌరవంగా తీసుకోగల్గడం డాక్టర్ల పుణ్యమే’ అని ఒక కార్యకర్త అంటే ‘కాదు ఇది మన అందరి సమిష్టి నిర్విరామ సుదీర్ఘ నిస్వార్ధ శ్రమ ఫలితమే సుమా!’ అని డాక్టరు గారన్నారు.

మనం గతంలో పొందిన ఆవార్డులు, ప్రశంసా పత్రాలు మన బాధ్యతలను మరింతగా గుర్తు చేసేవే అని భావిద్దాం.

కొత్తపల్లి వేంకటేశ్వర రావు గారు ముమ్మారు చాటిన స్వచ్ఛ సుందర సంకల్ప నినాదాలతో 6.35 ని.కు. నేటి స్వచ్చంద శ్రమదానం పూర్తయింది.

రేపటి మన స్వచ్ఛ సుందర ప్రయత్నం కోసం మేకల డొంక వద్ద  కలుసుకుందాం.

సైన్యానికి వందనాలు

నవీన యుగ స్వప్నాలను- నచ్చిన ఆదర్శాలను

శాస్త్ర జ్ఞానం ఊతగ- స్వగ్రామం కార్యక్షేత్రంగా

వృత్తులను-ప్రవృత్తులను విజయవంతంగా నడిపించే

స్వచ్ఛ సుందర చల్లపల్లి సైన్యానికి వందనం! 

– నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

శుక్రవారం – 16/08/2019

చల్లపల్లి.

14.07 కు మేకలడొంక వద్ద2 3 4 5 6 7 8 9 10 11 121 2 3 4 5 7 8 9 10 11 1214 15 16

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *