స్వచ్ఛ సుందర చల్లపల్లి – 29/08/2019 (1752* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1752* వ నాటి వివరణలు.

             ఈ శుభోదయం 4.00 – 6.10 నిముషాల మధ్య గంగులవారిపాలెం సర్వాంగ సుందర మార్గంలో జరిగిన శ్రమదానపు భాగస్వాములు 43 మంది.

   2013 దాక ఈ ఎగుడు దిగుడు గుంటల, జంతు కళేబరాల- బహిరంగ విసర్జిత పూతి గంధ హేయమైన అలనాటి ఈ దారి ఈనాడు విందు, వినోదాల, ఛాయా చిత్రాల, దర్శనీయ, ఆదర్శనీయ మార్గంగా మారిందంటే- అది స్వచ్ఛ కార్యకర్తల సమైక్య సంఘటిత నిరంతర కఠిన శ్రమ ఫలితమే!

 – నాలుగవ రోజు కూడా మా ఇంటి ముందు ఖాళీ స్తలం 10 మంది కార్యకర్తల స్వచ్ఛ – సుందరీకరణకు నోచుకొంది. ఖచ్చితమైన ప్రణాళికతో రకరకాల రంగు పూల మొక్కలకు గోతులు త్రవ్వి, నాటి, అలంకరించారు. వీరిలో ముగ్గురు కొంత భాగాన్ని అద్దంలా స్వచ్చీకరించారు. గంటకు పైగా- గ్రామం కోసం వీరి శ్రమ ఒక సుందరీకరణ యోగం! కవులు, కళాకారులు తక్షణం స్పందింపదగిన శ్రమ జీవన విలాసం ఇది కాదా?

– గంగులపాలెం మలుపు- వంతెనల మధ్య కత్తుల వారి శుభ్రతా చర్యలు కొనసాగాయి. దట్టంగా పెరిగిన నిరర్ధక మొక్కల్ని పీకి, రోడ్డు పైగా పెరుగుతున్న పెద్ద కొమ్మల్ని కత్తిరిస్తూ వాళ్లు పని చేస్తుంటే- గొర్రుల వారు వాటిని గుట్టలు చేసి, ట్రాక్టర్ కెత్తి, చెత్త కేంద్రానికి తరలించారు.

నిస్వార్ధంగా- సందడిగా బ్రహ్మ ముహూర్తంలో వీరి గ్రామ సేవలు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న సౌష్టవ భారతానికి (Fit India) ముందస్తుగా తొలి నమూనాలు సుమా!

కాఫీ సేవానంతర సమావేశంలో డాక్టర్ డి.ఆర్.కె. ప్రసాదు గారి సమీక్షతో బాటు E.O బొల్లినేని ప్రసాదు గారి “ఫిట్ ఇండియా” ప్లే కార్డుల ప్రదర్శన తో ఫోటో దిగారు. నాయుడు మోహన రావు గారి శక్తి వంచన లేని స్వచ్ఛ సుందర సంకల్ప నినాదాలను ముమ్మారు దీటుగా పునరుచ్ఛరించిన కార్యకర్తలు 6.25 నిముషాలకు నేటి తమ బాధ్యతలకు స్వస్తి పలికారు.

పెద కళ్లేపల్లి ప్రధాన దేవాలయము వెనుక తమ గృహంలో రేపు తమ తల్లి గారి సాంవత్సరీక మధ్యాహ్న భోజనానికి (12గంటలకు) కొడాలి నాగేశ్వర శర్మ గారు కార్యకర్తల నాహ్వానించారు.

 రేపటి మన శుభోదయ సేవలు గంగులవారిపాలెం దారి లోనే.

  మంచి దశ అని చెప్పగలనిక.

కార్యకర్తల కలయికే జయ జయ ధ్వానం చల్లపల్లికి

అనితర సాధ్యం వాళ్ల సేవలు మహాదర్శం అన్ని ఊళ్లకి

రచ్చ బండ కబుర్లు కావవి స్వచ్ఛ తర చర్చలే కావున

స్వచ్ఛ సుందర చల్లపల్లికి మంచి దశయని చెప్పగల్గితి!

 

– నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

వారం – 29/08/2019

చల్లపల్లి.

14.04 కు గంగులవారిపాలెమ్ రోడ్డు లో2 3 4 5 6 7 8 910 11 1315 16 17 18 19 20 21 22 2324 25

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *