Pressure Groups వలన ప్రయోజనం ఎంత?

మరింత మెరుగైన సమాజం కోసం ప్రయత్నించే కార్యకర్తలలో చర్చ కోసం….

Pressure Groups వలన ప్రయోజనం ఎంత?

* భ్రూణ హత్యలకు బాట వేస్తున్న లింగ నిర్ధారణ పరీక్షలకు వ్యతిరేకంగా చాలా కాలం క్రిందట హర్యానాలో గళం విప్పిన కొందరి ఒత్తిడితోనే సదరు అమానుష పరీక్షలను కాలక్రమాన ప్రభుత్వం నిషేధించింది. 

* రాజారామమోహనరాయ్, కొద్ది మంది అతని అనుచరులు 150 ఏళ్ల నాడు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వంపైన, సమాజం పైన తెచ్చిన ఒత్తిడితోనే అతిభయానకమైన సతీసహగమనం నిషేధించబడింది.

* 125 ఏళ్ల క్రితం కందుకూరి వీరేశలింగం అనే ఒక బక్క మనిషి తన విద్యార్ధుల సాయంతో చేసిన పోరాటాల ఒత్తిడితోనే విధవా పునర్వివాహాలు, స్త్రీ విద్యా వికాసాలు సమాజానికి, ప్రభుత్వానికి ఆమోదయోగ్యమైనవి.

* (గత దశాబ్ద కాలం నుండి) ప్రజారోగ్యానికి హామీ ఇచ్చే, స్వచ్చ – శుభ్రతల అవగాహన పెంపొందించే, తపనతో ఈ గ్రామంలోని లయన్స్- రోటరీ – ధ్యాన మండలి – ఆర్య వైశ్య సంఘం – నడక సంఘం వంటి అనేకుల సహకారంతో జనవిజ్ఞానవేదిక, మనకోసం మనం ట్రస్టు చేస్తున్న పోరాటంతో – తెస్తున్న ఒత్తిడితో స్వచ్చ సుందర చల్లపల్లి ఉద్యమం విజయవంతంగా నడుస్తున్నది.

ఒక చిన్న ఉద్యమం – అతి మంచి పాఠం:

               నివారణా వైద్యం (Preventive Medicine) లో భాగమైన గ్రామ పారిశుద్ధ్య మెరుగుదల కోసం అప్పటికి దశాబ్ద కాలంగా మధనపడుతున్న కొందరం 2010 లో చల్లపల్లిలోని ఇతర సేవా సంస్థలను కలుపుకుని వీక్షించిన ఉదయసింగ్ గౌతమ్ గారి “పవర్ పాయింట్ ప్రెసెంటేషన్” నేపధ్యంలో 2013 డిసెంబర్ 20 నాడు క్షేత్ర స్థాయిలో సరికొత్త ప్రయత్నం చేశాము.

            చల్లపల్లి – గంగులవారిపాలెం రోడ్డులోని నివాసులతో కలిసి బహిరంగ మలవిసర్జనా కేంద్రంగా – జంతు కళేబర దుర్గంధ భూయిష్టంగా ఉండే ఆ రహదారిని శుభ్రంగా ఉంచుకోవడం కోసం ఆ రోజు వేకువన రోడ్డు మీదకి కూర్చోవడానికి వస్తున్న చెంబుల వాళ్ళను ఆపి వద్దని నచ్చచెప్పే ప్రయత్నం చేశాం. కొందరు మహిళలతో సహ స్థానికుల సమైక్య కృషితో 100 రోజులైనా కాకముందే ఆ దారిలో బహిరంగ మలవిసర్జన ఆగిపోయింది. అయినా 11 నెలల పాటు ఆ ఉద్యమం కొనసాగింది. అలా ‘సంఘటిత ప్రయత్నం తో విజయం సాధించవచ్చు అనే పాఠాన్ని ఈ గంగులవారిపాలెం రోడ్డు సంస్కరణ ఉద్యమం మాకు నేర్పింది.

ఇంకొక పెద్ద ఉద్యమం:

            గంగులవారిపాలెం మార్గంలో చేసిన ప్రయత్నం వంటిదే మిగిలిన గ్రామం మొత్తంలో కూడా ఎందుకు చేయకూడదు అని 10 నెలల పాటు మేము ఆలోచిస్తున్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వం ‘స్వచ్చ భారత్” కార్యక్రమాన్ని తలపెట్టింది. పరిస్థితులు అనుకూలిస్తూన్నాయనే సంతోషంతో 2014 నవంబర్ 12 నుండి “స్వచ్చ సుందర చల్లపల్లి” ఉద్యమాన్ని ప్రారభించాం. కాలక్రమేణ 30 నుండి 50 మంది కార్యకర్తలు ప్రతిరోజూ గంట నుండి 2 గంటలు ఊరికోసం శ్రమిద్దాం అని నిర్ణయించుకుని నాటి నుండి నేటి వరకు 1752 రోజులుగా 40-50 మంది కార్యకర్తలు ‘గ్రామ పరిశుభ్రత, పచ్చదనం, సుందరీకరణలే’ లక్ష్యాలుగా పనిచేస్తున్నారు. ఈ సుదీర్ఘ స్వచ్చ చల్లపల్లి ఉద్యమ ఫలితం అవనిగడ్డ నియోజక వర్గంతో పాటు  రాష్ట్రం మొత్తంలో 25 కు పైగా గ్రామాలకు స్పూర్తినిచ్చింది.

క్యారీ బ్యాగులు వద్దు – గుడ్డ సంచులే ముద్దు:

            ఈ ఉద్యమంలో భాగంగానే ‘క్యారీ బ్యాగులు వద్దు – గుడ్డ సంచులే వాడుదాం’ అని నిర్ణయించుకుని చల్లపల్లి లోని 5000 ఇళ్లకు వెళ్ళి స్వచ్చ కార్యకర్తలు ప్రచారం చేశారు. ప్రధాన రహదారులలోని వ్యాపార సంస్థలకు, సోమవారం జరిగే సంతలోనూ, మెడికల్ క్యాంపులలోనూ గత నాలుగేళ్లుగా ఈ ప్రచారం చేస్తూ ప్రత్యామ్నాయంగా మళ్ళీ మళ్ళీ వాడదగిన సంచులను సబ్సిడీ ధరకే అమ్ముతూ వచ్చారు.

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల నిషేధం – సరికొత్త పర్యావరణమిత్రం :    

        ఇక ఆ తరువాత ‘ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు’ వాడవద్దనే ప్రచారం ప్రారంభించాం. సంధర్భం వచ్చినప్పుడల్లా అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి కూడా మా వాదన వినిపించాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులేవీ వాడకుండా జరుపుకునే వేడుకలను ‘హరిత వేడుకలు’(Green Functions) గా పేర్కొని మా స్వచ్చ చల్లపల్లి ఉద్యమ వేడుకలలోనూ, స్వచ్చ కార్యకర్తల ఇళ్ళలో జరిగే వేడుకలలోనూ ఆచరించి చూపిస్తున్నాం.

ఫ్లెక్సీ షేమ్ ఉద్యమం:

ముందుగా ఫ్లెక్సీలను మేము వాడడం మానేసి గుడ్డ బ్యానర్లనే వాడుతూ ఈ ఫ్లెక్సీ షేమ్ ఉద్యమాన్ని మొదలుపెట్టాం. పర్యావరణానికి ప్రమాదకరమైన ఈ ఫ్లెక్సీ లను ఉపయోగించడానికి ఎవరైనా సిగ్గు పడాలని మా ఉద్దేశం. ప్రభుత్వాధికారులను, ప్రజాప్రతినిధులను కలిసినప్పుడల్లా ప్రభుత్వ కార్యక్రమాలన్నిటిలో పర్యావరణ ప్రమాదకరమైన ఈ ఫ్లెక్సీ బ్యానర్లను నిషేధించమని పదేపదే విజ్ఞప్తి చేస్తూ వచ్చాము. ఎట్టకేలకు కృష్ణాజిల్లా కలెక్టర్ శ్రీ ఇంతియాజ్ గారు సానుకూలంగా స్పందించి కృష్ణాజిల్లా కలక్టరేట్ లో అవి వాడవద్దని ఆదేశాలు జారీ చేశారు. అంతే కాక విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ హోదాలో విజయవాడ లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను నిషేధించి అమలుచేయడం ప్రారంభించారు.  

            ఈ ఆగష్టు 15 న మన ప్రధానమంత్రి మోడీ గారు ఒక్కసారి వాడే ప్లాసిక్ వస్తువులను నిషేధించడం తమ ప్రభుత్వ విధానంగా ప్రకటించారు. ఈ అక్టోబర్ 2 నుండి కార్యాచరణ ప్రారంభం కాబోతుందని నేటి వార్త. పర్యావరణ మిత్రులకు ఇంతకు మించిన సంతోషం ఏముంటుంది.

            స్వచ్చత కోసం ప్రయత్నాలు చేయడం దేశంలో అనేక ప్రాంతాల్లో వ్యక్తులపరంగానూ, ఉద్యమంగానూ ఎప్పటినుండో జరుగుతున్నదే. గాడ్గే బాబా, మహాత్మా గాంధీ, గుంటూర్ గాంధీ వంటి ఎందరో పరిసరాల పరిశుభ్రత కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఒక్కసారి వాడే ప్లాస్టిక్ వస్తువులను వ్యతిరేకించే వ్యక్తులు, గ్రూపులు అనేకం ఉన్నాయి.

            ఈ ఫ్లెక్సీల వ్యతిరేక ఉద్యమానికి ‘ఫ్లెక్సీ షేమ్’ అనే పేరు పెట్టింది మేమైనా, అనేక వ్యక్తులు, సంస్థలు ఈ మంచి పనికోసం పాటుపడుతున్నారు. ఇలా ఎన్ని Pressure groups (ఒత్తిడి సమూహాలు) ఎంతగానో కృషి చేస్తేనే ఇప్పటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ప్రభుత్వ విధానంకాక తప్పలేదు.

                        క్యారీ బ్యాగుల వ్యతిరేక ప్రచారాన్ని మేము ముమ్మరం చేసినప్పుడు ‘ప్రభుత్వాన్నే వాటి ఉత్పత్తి ఆపమని అడగొచ్చు గదా? మమ్మల్ని వాడవద్దని ఎందుకడుగుతారు?’ అని మా కార్యకర్తల్ని చాలా మంది అడిగేవారు. ప్రజలు ఉద్యమించకుంటే ప్రభుత్వాలకు ఇవి ప్రాధాన్యతా సమస్యలుగా పట్టవు కనుక మనమే వాటి వాడకం మానివేసి నిషేధించమని ఒత్తిడి చేస్తేనే ప్రభుత్వాలు దిగివస్తాయి అని మేము చెప్తుండేవాళ్ళం.

            కనుక, మరింత మెరుగైన సమాజం కోసం పాటుపడేవాళ్లంతా సమస్యలకు స్పందించి ఉద్యమించాలి. కేవలం మాట్లాడుకుంటేనే చాలదు. తోటివాళ్లతో చర్చించాలి. కొంతమంది కలిస్తే ఒక గ్రూపు అవుతుంది. ఇటువంటి అనేక గ్రూపులు ఏకోన్ముఖంగా ఒక అంశం పై పనిచేస్తుంటే అది ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతుంది. ప్రయోజనకరమైన మంచి ఒత్తిడి మనుషులకు, సమాజానికి మేలే చేస్తుంది.

– నల్లూరి రామారావు,

– దాసరి రామకృష్ణ ప్రసాదు,

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్తలు,

‘మనకోసం మనం’ ట్రస్టు సభ్యులు,

చల్లపల్లి – 29.08.2019.

Andhra Jyothi

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *