స్వచ్ఛ సుందర చల్లపల్లి – 08/10/2019 (1792* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం  1792* విజయ దశమి నాటి అనుభవాలు.

నిన్నటి నిర్ణీత ప్రదేశం- విజయవాడ మార్గంలోని బాలాజి అపార్ట్ మెంట్ కు ఉత్తర దిశగా-పండుగ నాడు జరిగిన గ్రామ సేవల పండుగలో పాల్గొన్న శ్రమ దాతలు 34 మంది. ఇందులో లయన్స్, ధ్యాన మండలి వారి ప్రాతినిధ్యం కూడ ఉన్నది.

విజయవాడ దారికి కుడి- ఎడమల జరిగిన స్వచ్ఛ -శుభ్ర-సుందరీకరణలో- 1) తామే నాటి, సంరక్షించి, పెంచిన-వర్షాలకు బాగా పెరిగిపోతున్న పచ్చని వృక్షాలు, కరెంటు తీగలు తాకకుండా, దారి కడ్డం రాకుండా తగు మాత్రం కత్తిరించి, విద్యుత్ పని వాళ్ల కృషికి తోడ్పడటం-

2) త్వరలో తాము నాటబోతున్న కొత్త రకం పూల మొక్కల కోసం గడ్డిని,పిచ్చి మొక్కల్ని, పిచ్చి తీగల్ని తొలగించి, నేలను చదును చేయడం-

3) బాధ్యతా రాహిత్యంగా అక్కడి నివాసితులు డ్రైన్ల లో విసరిన వ్యర్ధాల సంచుల్ని, ప్లాస్టిక్ తుక్కును బైటకు లాగి, గుట్టలుగా పేర్చడం-

4) ఈ అన్ని రకాల దుర్గంధ వ్యర్ధాలను సమీకరించి, డిప్పలతో ఎత్తి, ట్రాక్టర్ లో నింపి, చెత్త కేంద్రానికి తరలించడం-

5) ముగ్గురు ఈ శ్రామికులకు లైట్లు చూపుతూ, చాక్లెట్స్, మంచినీళ్లు అందిస్తూ ఆ రద్దీ మార్గంలో వచ్చే-పోయే వాహనాలకు హెచ్చరికలు చేసి,నియంత్రించడం-

– ఈ గంటన్నర సమయంలో సందడి గా సాగిపోయే స్వచ్ఛ సైనికుల ఈ కాలుష్యం పై యుద్ధం- చేస్తున్న వాళ్లకు పరమ సంతృప్తి, చూస్తున్న- రాస్తున్న వాళ్లకు ఉద్వేగం, ఉల్లాసం.

6.00 గంటలకు సేవల విరామ చిహ్నమైన ఈల మ్రోగే సమయానికీ చూస్తే-80 ఏళ్లు దాటుతున్న ఇద్దరు డాక్టర్లు, రేపు పెళ్లి జరగనున్న వధువు, ఒక దివ్యాంగ ఉద్యోగి కనిపించారు. సామాజిక మాధ్యమ సృజనాత్మక ఛాయా చిత్రకుడైన యలమంచిలి భరత్ నందా అనే యువకుడు నేటి స్వచ్చోద్యమాన్ని చిత్రీకరిస్తూ కనిపించాడు.

కాఫీ సేవానంతర స్వచ్ఛ సమావేశంలో-‘ యోగా మాస్టర్’ అనే పౌరుష నామం కల నారంశెట్టి వేంకటేశ్వర రావు గారు తన ఈ ఐదారేళ్ల స్వచ్చోద్యమ భాగస్వామ్యాన్ని సమీక్షించి, సంతృప్తిని ప్రకటించి, ముమ్మారు ప్రకంటిచిన స్వచ్ఛ సుందర చల్లపల్లి సంకల్ప నినాదాలు అందరు కార్యకర్తల గళాలలో మారుమ్రోగి, 6.30 నిముషాలకు ఈ విజయ దశమి నాటి సేవలకు ముగింపు జరిగింది.

ఇంకా-రేపటి (నారాయణ రావు నగర్-మసీదు ఎదురుగా) హరిత విందుకు(12.00కు), రేపు రాత్రి 7.00 కు తెనాలి దగ్గర జరుగనున్న తన వివాహానికి వక్కలగడ్డ సుహాసిని సాటి కార్యకర్తలను ఆహ్వానించింది. మహిళా కార్యకర్త(లంకే సుభాషిణి) తన పెరటి కూరగాయలను పంచింది.

స్వచ్ఛ కార్యకర్త, లయన్స్ క్లబ్ అధ్యక్షులు శ్రీ.  T. సాంబశివరావు గారి ఈ నెల 500/-రూపాయల విరాళానికి స్వచ్చోద్యమ చల్లపల్లి ధన్యవాదాలు.

రేపటి స్వచ్చంద శ్రమదానం విజయవాడ మార్గంలోని చిల్లల వాగు దగ్గరి ‘కాటా’ దగ్గరి నుండి మొదలు పెడదాం.

ఒక తారక మంత్రంగా…

తరగని ఒక అభినివేశ తారక మంత్రం వాళ్లది

ఐకమత్య బలం ఉంది-ఆలోచనా శక్తి ఉంది

గ్రామ సహోదరుల పట్ల కారుణ్యం చాలా ఉంది

స్వచ్చోద్యమ చల్లపల్లి సాధించ లేని దేమున్నది?

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

మంగళవారం – 08/10/2019

చల్లపల్లి.

14.11 కు బాలాజీ అపార్ట్మెంట్స్ వద్ద2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 153919 21 2216171825 500/- రూపాయల విరాళం అందిస్తున్న సాంబశివ రావు మాష్టారు28తన వివాహానికి కార్యకర్తలందరినీ ఆహ్వానిస్తున్న వక్కలగడ్డ లక్ష్మీ సుహాసిని

34 36 374120

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *