స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1803* వ నాటి భీభత్సం.

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం  1803* వ నాటి భీభత్సం.

ఈ ముసురు వేకువ 4.00-6.20 నిముషాల నడుమ-గంగులవారిపాలెం దారిలోని “ పద్మాభిరామం” లోపల, బైట అర్థ మనస్కంగా జరిగిన స్వచ్చంద శ్రమదానం లో 19 మంది పాల్గొన్నారు.

రాత్రంతా ఆగుతూ-పడుతున్న వాన 4.00 కే వచ్చిన స్వచ్ఛ వైతాళికుల కన్న ముందే తన జోరు పెంచి, మూడు గంటలకు పైగా అదరగొట్టి ఈ ఒక్క రోజు స్వచ్చ సైనికుల మీద పై చేయి సాధించింది.

ఐనా-మొండి పట్టుదలతో కొందరు పద్మాభిరామ ప్రాంగణాన్ని ఊడ్చక మానలేదు. (జన్యువులలోకి చొచ్చుకుపోయి-ఇంకిపోతున్న ప్రేరణ మరి!)

ఇంత వానలో ఇక నేటి శారీరక శ్రమదానం కుదరదని వెనుతిరిగి ఇళ్లకు పోక- ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకొంటూ కార్యకర్తలు- 1) గత ఐదేళ్ళ స్వచ్ఛ సుందర మహా ప్రస్థానాన్ని నెమరువేసుకొని-అందలి లోటు పాట్లను చర్చకు తెచ్చినారు.

2) నిన్న తహసీలుదారు గారి కంద జేసిన గ్రామ సంక్షేమ దాయకములైన 8 అంశాల తో గూడిన వినతి పత్రం గురించి-

3) నేడు జరగనున్న గ్రామ సభకు హాజరై చల్లపల్లి స్వచ్ఛ -శుభ్ర సమస్యలను అధికారుల దృష్టికి తేవడం గురించి,

4) స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమ 5 వ వార్షికోత్సవాల నిర్వహణ గురించి సమాలోచించారు.

ఒకరిద్దరిలో హెచ్చిన వర్ష హర్షాతిరేకం తక్కిన వాళ్లకు గూడ అంటుకొని-ముసలెద్దులు కూడ రంకె వేసినట్లు- పెద్దలు కూడ “ వర్ష శనివారనృత్యాలు” చేశారు.

మైకుతో సంబంధం లేకుండ అంజయ్య గారు గర్జా సదృశంగా ముమ్మారు నినదించిన స్వచ్చోద్యమ సంకల్పాన్ని కార్యకర్తలు పునరుద్ఘోషించి 6.35 కు నేటి అసంతృప్త గ్రామ కర్తవ్యాన్ని ముగించారు.

రేపటి మన స్వచ్చంద శ్రమదానం కోసం ఈ గంగులవారిపాలెం దారిలోనే కలుసుకొందాం.

ఇందరిందరు కర్మ యోగులు.

సేవలో వైవిధ్యమున్నది-చిత్తములలో మెలకువున్నది

సేవ కాదది బాధ్యతనుకొను శ్రేష్ఠ మగు ఒక తలంపున్నది

కారు కారు విరాగు లిందరు- కర్మ యోగులు సుమా అందరు

స్వచ్ఛ సైన్య సుదీర్ఘ పయనం- సమస్తాంధ్రామోదయోగ్యం!

 

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

శనివారం – 19/10/2019

చల్లపల్లి.

 

14 am కు పద్మాభిరామంలో2 3 4 6 8 9 11 12 13 14 15 16 17 18 19 20 21 22

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *