స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1809* వ నాటి స్వచ్ఛ వినోదం (25.10.2019))

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1809* వ నాటి స్వచ్ఛ వినోదం.

          ఈనాటి వేకువన కూడ 4.00 కే స్వచ్చ కార్యకర్తలు 19 మందితో బాటు ఠంచనుగా విచ్చేసిన వర్షంలోనే నాగాయలంక మార్గంలో జరిగిన స్వచ్చంద శ్రమదానం 6.00 దాక జరిగి తీరింది.

    కొద్దిమంది వాన దుస్తుల్లో తమ విధులు నిర్వహిస్తే, మరి కొందరు రోజుటివలె స్వచ్చ చల్లపల్లి ఏకరూప దుస్తులతోనే – తడుస్తూ తాము కోరుకున్న గ్రామ బాధ్యతలను నెరవేర్చారు. పాత మొక్కల పాదుల్ని సరిజేయడం, అక్కడి గడ్డిని, పిచ్చి మొక్కల్ని తొలగించడం కాక, నేటి ప్రధాన వ్యాపకం రోడ్డు కిరుప్రక్కల క్రొత్తగా సుమారు 100 పాదులు తీసి, వాటిలో అడవి తంగేడు నామాంతరంగల గద్ద గోరు – 3 రంగుల పూల మొక్కలు నాటడమే.

     ఇప్పటికే ఈ రహదారి గత 3 – 4 ఏళ్ల నుండి నాటి పెంచిన చెట్ల పచ్చదనంతో, ఉద్యానవనంతో, కిలో మీటరు మేర రంగు రంగుల పూల మొక్కలతో ఆహ్లాదకరంగా ఉన్నది. ప్రస్తుతం గత 15 – 20 రోజుల నుండి కొత్తగా నాటుతున్న వందల కొద్దీ అడవి తంగేడు మొక్కలు కూడ పెరిగి, పూస్తే వచ్చే సంక్రాంతి నాటికి చల్లపల్లిలోనికి ప్రవేశక మార్గాలన్నీ ఇంకెంతగా కనువిందు చేస్తాయో చూడాలి.

          ఈరోజు నాటిన మొక్కల్లో అధిక భాగం సుబ్బనాగన్న ఆశ్రమ – సత్రం నుండి 7 వ నంబరు పంట కాలువ (పెదప్రోలు పంచాయితీ పరిధి) వరకే. పది – పన్నెండు మాత్రం వడ్లమిల్లు సమీపంలో నాటారు.

ఈ నాటి స్వచ్చంద సేవానంతర సమావేశం సుబ్బనాగన్న ఆశ్రమ ఆవరణలో జరిగింది. మెండు శ్రీనివాస్ ఈ కార్యకర్తలు చెట్లు నాటి పెంచడాన్ని క్రీస్తు పూర్వం 3 వ శతాబ్ది నాటి అశోకుని చెట్ల పెంపకంతో పోల్చి, స్వచ్చ సుందర చల్లపల్లి ప్రగాఢ సంకల్ప నినాదాలను ముమ్మారు ప్రకటించగా – కార్యకర్తలందుకు దీటుగా స్పందించడంతో ఆశ్రమంలో విశ్రమించిన సాధు బాటసారులు మేల్కొన్నారు.

         ఈ 21 వ శతాబ్దపు 19 మంది (స్వచ్ఛ చల్లపల్లి) ఆశోక చక్రవర్తులు 6.30 నిముషాలకు తమ గ్రామ హిత కృషికి తాత్కాలిక విరామం ప్రకటించి, గృహోన్మఖులయ్యారు.

నాగాయలంక రోడ్డులో మిగిలిన మొక్కలు నాటడానికై రేపు ఉదయం 4 గంటలకు సుబ్బనాగన్న ఆశ్రమం దగ్గరే కలుసుకుందాం.

పై సమావేశంలోనే డాక్టరు D.R.K. ప్రసాదు గారు సహన గుణం విలువలను, తదాచరణ సౌలభ్యాన్ని వివరించారు.

      రేపటి మన రాజమహేంద్రవర ప్రయాణం కోసం పద్మావతి హాస్పిటల్ దగ్గర 9.30 కి కలుసుకోవడం తో సమయపాలన పాటిద్దాం!        

అరదశాబ్ది సాక్ష్యంగా.

ఆదర్శాలు వల్లెవేయు టత్యంతం సులభ సుఖం

చెప్పే ఆదర్శాలన్నీ చేసి చూపడమె కష్టం

అది చేతలలో చూపుటె స్వచ్చ సైన్య సంకల్పం

అర్ధ దశాబ్దం సేవలె అందుకు సాక్షీ భూతం! 

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

శుక్రవారం – 25/10/2019

చల్లపల్లి.

1 4 am కు సుబ్బనాగన్న సత్రం వద్ద2 3 4 5 7 10 11 12 13 14 15 16 18 19 20 21 24 27 28 30 34 37 38 39 44 45 46 47 48 49 51 52

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *