స్వచ్ఛ సుందర చల్లపల్లి – 02-04-2018

7f181b48-521e-4a99-9c18-78ef178ea783
ఊహకందని సేవ – ఊరి ప్రజల సేవ
 
ప్రతి సోమవారం చల్లపల్లి సెంటర్ ను శుభ్రం చేయాలనే నిర్ణయం ప్రకారం ఈరోజు ఉదయం కూడా సెంటర్ కి వెళ్ళటం జరిగింది. రాత్రి వచ్చిన గాలి దుమారంతో పాటు వచ్చిన వర్షానికి రోడ్లపక్కన బాగా నీళ్ళు చేరాయి. ముప్పనేని మెడికల్స్ ముందుభాగం చిన్న చెరువులా తయారయింది. నాగాయలంక రోడ్డులో ఉన్న డ్రెయిన్ ఎక్కడో అడ్డుపడి ఉంటుందని అలోచించి నువ్వుల గానుగ షాపు ముందు ఉన్న డ్రెయిన్ పైన ఉన్న పలకలను కార్యకర్తలు తీసి చూశారు. డ్రెయిన్ నిండా ఇసుకతో నిండిపోయి మురుగు కదిలే అవకాశం లేకుండా ఉంది. కార్యకర్తలు డ్రెయిన్ లో దిగి దాదాపు ¾ ట్రాక్టర్ ట్రక్కు ఇసుకను తీసి మురుగు పారేటట్లు చేశారు. డ్రెయిన్ పై ఉన్న కాంక్రీట్ పలకలను తీయటం, లోన ఇసుకను, మురుగును తియ్యటం, మళ్ళీ కాంక్రీట్ పలకలను యధావిధిగా సర్దటం….. ఇవన్నీ ఎంతో శ్రమతో కూడిన పనులే కాక ప్రమాదకరమైనవి కూడా.
 
మరికొంతమంది కార్యకర్తలు నాగాయలంక రోడ్డులో డ్రెయిన్ తరువాతి భాగాన్ని శుభ్రం చేసుకుంటూ వెళ్లి, రోడ్డు మీద అనేకచోట్ల నిలిచిపోయిన నీటిని డ్రెయిన్ లోకి పారేటట్లు చేశారు. ఈ డ్రెయిన్ చివరకి గుర్రాల చెరువులోకి చేరుతుంది. ఆ వెళ్ళే మార్గంలో కూడా దిగి మరీ మురుగు పారేటట్లు చేశారు.
 
తెల్లవారకముందే లేచి గ్రామంలో ఉన్న ప్రధాన ప్రాంతాల్లో పనిచేసి, మిగతా గ్రామస్తులు లేచి బజార్లోకి వచ్చే సమయానికి అంతా శుభ్రంగా ఉన్నట్లు కనిపించేటట్లు చేసిన ఇలాంటి సేవలను చూసి ‘గుడిసేవ విష్ణు ప్రసాద్’ గారు రాసిన పాట గుర్తుకొస్తోంది.
 
 
ఊహకందని త్రోవ ఊరిప్రజలా సేవ
చూచి పోవలె వచ్చి మా పల్లెనీ
అందాలు విరజిమ్ము మన తల్లినీ
 
స్వచ్ఛ సుందరపల్లి మా చల్లపల్లి
అందాలు విరబూయు మా కల్పవల్లి
 
వీధి వీధిన రంగురాళ్ళు అంటించారు
అందాల బరిణగా తీర్చిదిద్దారు
ఘనమైన కుండీల నేర్పాటు చేశారు
పూలమొక్కలు నాటి పోషించుచున్నారు ||స్వచ్ఛ||
 
సప్తవర్ణాలను చెట్లకు దిద్దారు
మరుభూమి చూడంగ మరులుగొల్పించారు
ప్రజలంతా ఐక్యంగ పరిశుభ్ర మార్గాన
పయనించి బ్రతుకులకు పరిమళాలద్దారు
 
స్వచ్ఛ సుందరపల్లి మా చల్లపల్లీ
అందాలు విరబూయు మా కల్పవల్లీ ||స్వచ్ఛ||
 
 
33 మంది కార్యకర్తలు ఉదయం 4-25 గంటల నుండి 6-30 గంటల వరకు ఈ కార్యక్రమంలో శ్రమించారు.
 
“రాయపాటి రాధాకృష్ణ గారు” చెప్పిన ‘జై స్వచ్ఛ సుందర చల్లపల్లి’, ‘స్వచ్ఛ సుందర చల్లపల్లిని సాధిద్దాం’ అనే నినాదాలతో ఈనాటి స్వచ్ఛ కార్యక్రమం ముగిసింది.
 
స్వచ్ఛ నారాయణరావు నగర్ కార్యక్రమాలు 197*వ రోజుకు చేరుకున్నాయి.
రేపటి కార్యక్రమం ST కాలనీలో. అందుకోసం ఉదయం 4-30 గంటలకు “స్మశానం రోడ్డులో ST కాలనీ ఎంట్రన్స్” వద్ద కలుసుకుందాం.
 
డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
మేనేజింగ్ ట్రస్టీ, మనకోసం మనం ట్రస్ట్
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
సోమవారం – 02-04-2018
 
తనదాకా
 
తనదాకా వచ్చినపుడె ధర్మమేదొ తెలిసేది
గ్రామసేవ చేసినపుడె ధన్యతను గ్రహించేది
స్వచ్ఛ రమ్య చల్లపల్లి సాధనలో మునిగినపుడె
ఆసాంతం కష్టసుఖాలన్నీ తెలిసి వచ్చేది!
 
-నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
9a26e8bf-af01-4e64-ac2f-2a6ac9745ae1
260e6ca3-8af5-4f5e-9f66-aac79ff1ee99
931a07af-92e4-4678-8108-20aaacc492cf
d5a76e76-8998-4384-93a8-57099802c142

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *