‘స్వచ్ఛ చల్లపల్లి’ విజయానికి మచ్చు తునక

‘స్వచ్ఛ చల్లపల్లి’ విజయానికి మచ్చు తునక

 

ప్రజలకు శుభ్రమైన ప్రదేశంలో నివశించటం అలవాటైన తరువాత మళ్ళీ అశుభ్రాన్ని భరించలేరు. ఈ నమ్మకంతో చల్లపల్లిలో సంవత్సరంన్నర నుండి 1,2,3,4,5 వార్డులలో (చల్లపల్లి లో మొత్తం 18 వార్డులు ఉన్నాయి), 10 నెలల నుండి ప్రధాన రహదారిలోనూ ‘మనకోసం మనం’ ట్రస్టు ద్వారా చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించటం జరుగుతోంది. 2,3,4 వార్డులలో ఎక్కువగా మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్నారు. ప్రధాన రహదారి మొత్తం వ్యాపార కూడలి. 1, 5 వార్డులలో కూలి పని చేసుకొనే శ్రామిక ప్రజలు, చిన్న చిన్న ఉద్యోగాలు, చేతి వృత్తులు చేసుకొనే వారూ అధికం. 1 నుండి 5 వార్డులలో ఉన్న 1000 ఇళ్ళ వారు చెత్తను రోడ్ల ప్రక్కన, మురుగుకాల్వల లోనూ, ఖాళీ ప్రదేశాలలోను, పంట కాల్వల లోనూ  వెయ్యకుండా చెత్తబండిలో మాత్రమే వేసేలా ప్రజలను చైతన్యపరచి, ఈ పనిని సక్రమంగా పాటించేలా చూడటానికి ‘గ్రామదీపిక’ పేరుతో ఒక మహిళా కార్యకర్తను నియమించటం జరిగింది. ఈ ప్రాంతాల శుభ్రతలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. సక్రమంగా జరుగుతున్న ఈ కార్యక్రమం కొన్ని కారణాల వలన గత మూడు నెలలుగా 1, 5 వార్డులలో చెత్త సేకరించటం కుదరలేదు.

 

చెత్త సేకరణ ఆపిన మూడు నెలల తరువాత 1 వార్డులోని పెద్దలు, యువకులు కలసి వారి ఇబ్బందిని ఇలా చెప్పారు.

 

“గతంలో మా వార్డులోని రోడ్లు మా ఇళ్ళల్లోంచి వచ్చిన చెత్తతో అశుభ్రంగానే ఉండేవి. కానీ సంవత్సరం 3 నెలల నుంచి ‘మనకోసం మనం’ ట్రస్ట్ ద్వారా చెత్తను సేకరించటంతో మేమందరం రోడ్ల మీద వెయ్యకుండా చెత్తను బండిలోనే వేస్తున్నాము. దీని మూలంగా మా వార్డు చాలా శుభ్రంగా ఉండేది. గత మూడు నెలల నుంచి బండి రాకపోవటం మూలంగా మళ్ళీ మా బజార్లన్నీ చెత్తతో నిండిపోయినాయి. దయచేసి మళ్ళీ చెత్త సేకరణ కార్యక్రమాన్ని మొదలుపెట్ట వలసిందిగా అభ్యర్దిస్తున్నాము”.

 

ఈ మాటలు విన్న తరువాత చాలా సంతోషం వేసింది. ‘స్వచ్ఛ చల్లపల్లి’ ఉద్యమం ప్రజలలో ఏ మార్పు తీసుకురావాలని ఆశించిందో ఆ మార్పు ఇది. గతంలో పంచాయతీ ఆధ్వర్యంలో వారానికి ఒక్కసారి మాత్రమే చెత్త సేకరణ జరిగేది. వారం రోజుల పాటు చెత్తను ఎవ్వరూ ఇంటిలో ఉంచుకోలేరు కాబట్టి రోడ్ల ప్రక్కన, మురుగుకాల్వలలో, చెత్త కుండీలలోనూ, నిండిన తరువాత చెత్తకుండీ చుట్టూ పడవేసేవారు. చెత్తను కుండీలో వెయ్యడం కాకుండా దూరంగా ఉండి విసిరెయ్యడం అలవాటుగా ఉండేది. చెత్తకుండీ నిండి చుట్టూ చాలా అసహ్యంగా ఉండేది. రోడ్ల ప్రక్కన చూడటానికి అశుభ్రంగానూ, చెత్తకుండీలు భరించలేని వాసన తోనూ ఉండేవి. పంచాయతీ ట్రాక్టర్ వారానికి ఒకసారి వచ్చినా చెత్తకుండీ చుట్టూ ఉన్న చెత్తను తియ్యటానికే సరిపోయేది. కుండీలలోని చెత్తను తియ్యటానికి వీలయ్యేది కాదు. అందువలన ఆ ప్రదేశం కంపు కొడుతూ ఉండేది. మేము చేసిన మొట్టమొదటి పని సాంప్రదాయకంగా ఉండే వరల వంటి చెత్తకుండీలన్నిటినీ తొలగించి ఆ ప్రదేశంలో చెత్త వెయ్యటానికి వీలవ్వకుండా చేశాము. ప్రతిరోజూ చెత్తను సేకరిస్తున్నాము కనుక ప్రజలకు చెత్తను రోడ్ల ప్రక్కన పడవెయ్యవలసిన అవసరం రాలేదు. చల్లపల్లి పంచాయతీకి 18 వార్డులలోనూ రోజూ చెత్తను సేకరించటానికి సరిపోయే సిబ్బంది, వాహనాలు లేవు. మేము 1-5 వార్డులలోను, ప్రధాన వీదిలోను చెత్తను సేకరించటం వలన పంచాయతీ వారు కూడా మరికొన్ని వార్డులలో ప్రతి రోజూ చెత్తను సేకరించటానికి  వీలు అవుతోంది.

 

‘మనకోసం మనం’ ట్రస్ట్ కి ఈ పారిశుధ్య కార్యక్రమం కోసమే ప్రతి నెలా రెండున్నర లక్షలు ఖర్చవుతోంది. దీనిని సుదీర్ఘ కాలం చెయ్యడం  మన ఉద్దేశ్యమూ కాదు, సాధ్యమూ కాదు. ఎప్పటికైనా ఈ కార్యక్రమం స్థానిక సంస్థ ఆధ్వర్యం (పంచాయతీ) లోనే జరగాలి. దానికి పంచాయతీకి సరిపడా పారిశుధ్య కార్మికులను, వాహనాలను ఏర్పాటు చేసుకునే ఆర్ధిక స్థోమత ఉండాలి. ప్రజలు శుభ్రత కోసం గట్టిగా కోరుకోవటాన్ని, అధికారులు, పాలక వర్గం చిత్తశుద్ధితో తమ నిర్ణయాలను తీసుకోవటాన్ని ప్రోత్సహించటానికే ‘స్వచ్చ ఉద్యమం’ ప్రారంభించటం జరిగింది.

 

ఏ ఉద్యమ ఫలితమైనా వెంటనే రాదు. కొన్ని దశాబ్దాల జాతీయోద్యమం తరువాతనే మనకు స్వాతంత్ర్యం వచ్చింది.  ఇలాంటి ఉదాహరణలు ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఆవిధంగా చూస్తే గత రెండు సంవత్సరాల నుంచి వచ్చిన ఫలితాలు కొంత వేగవంతంగానే వచ్చాయని చెప్పుకోవచ్చు. దీనికి స్వచ్ఛ కార్యకర్తలు, ట్రస్ట్ కార్మికులు, ఉద్యోగులు అందరూ అభినందనీయులు.

 

ఇది స్వచ్చ చల్లపల్లి ఉద్యమంలో పారిశుధ్య నిర్వహణపై ఒక పరిశీలన.

 

-డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

తేది : 01-11-2016

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *