చల్లపల్లిలో పారిశుద్ధ్య కార్యక్రమం …… సాకారం కావలసిన కల

             అంటురోగాల నివారణలో పరిసరాల పరిశుభ్రత అవసరాన్ని గుర్తించి పట్టణాలలో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని మొదలుపెట్టిన 176 సంవత్సరాల తరువాత మన దేశంలో ’పట్టణాల, గ్రామాల పారిశుద్ధ్య కార్యక్రమం ఎలా’ అని ఇంకా చర్చించుకోవడం చిత్రంగానే ఉంది (1942లో ఈ కార్యక్రమం లండన్ లో మొదలైంది). స్వచ్ఛ భారత్ కార్యక్రమం మొదలుపెట్టిన నాలుగు సంవత్సరాల తరువాత కూడా ఈ చర్చ కొనసాగుతూనే ఉంది. అక్కడొక ఊరు – ఇక్కడొక నగరంలో పారిశుద్ధ్యం బాగా చేస్తున్నారని చెప్పుకోవడమే కానీ దేశం మొత్తంలో ఉన్న పల్లెటూర్లు, నగరాలలో శాస్త్రీయంగా పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ఎప్పటికి చేయగలమో అర్థం కావడం లేదు. ఎక్కడో బూరుగుపూడి లోనో, పెదపారుపూడి లోనో, తెనాలి లోనో సక్రమంగా పారిశుద్ధ్య నిర్వహణ జరుగుతోందని ముచ్చట పడుతున్నాం. ఈ మాటలు నిరాశతో చెప్తున్నవి కావు. వీలైనంత తొందరగా స్థానిక సంస్థల ఆధ్వర్యంలో సంపూర్ణ పారిశుద్ధ్య నిర్వహణ జరగాలనే ఆశతో చెప్తున్నవి. చిత్తశుద్దితో పనిచేస్తే ఇదేమంత కష్టమైన విషయం కాదు.
 
సిద్ధాంతం అందరికీ తెలుసు. చెత్త సేకరణ దగ్గరే తడిచెత్త, పొడిచెత్త విడివిడిగా సేకరించాలని;
తడిచెత్తను కంపోస్ట్ చేసి ఎరువుగా మార్చాలని,
పొడిచెత్తను మళ్ళీ విడదీసి Recycling కి పంపించాలని…… ఇదే కదా సిద్ధాంతం!
 
ఆచరణలోకి తీసుకు రావడానికి అత్యంత పట్టుదలతో కూడిన ప్రణాళిక కావాలి. ప్రణాళికలు కూడా బాగానే రాసుకుంటున్నాం. కానీ ఆచరణలో సఫలం కావడానికి దూరంగానే ఉన్నాం.
 
ఒక కుటుంబం నుంచి రోజుకి తడిచెత్త ఒక అరకేజీ నుండి కేజీ లోపు తయారవుతుంది. కుటుంబ ఆర్ధిక స్థాయి పెరిగిన కొద్దీ పొడిచెత్త తయారీ పెరుగుతూ ఉంటుంది. ఇప్పటి పరిస్థితుల్లో రెండురోజులకి మించి తడిచెత్తని ఇంట్లో అట్టిపెట్టుకోవడం సాధ్యం కాదు. వాసన వస్తుంది. కనుక….
 

 రెండురోజులకి ఒకసారైనా చెత్తబండి ప్రతి వీధికీ కచ్చితంగా రావాలి.

 ఒకే సమయంలో రావాలి.
 
 ఆ మనుషులే వీలైనంత వరకు ప్రతిరోజూ రావాలి.
 
 ఒక వార్డు కానీ, ఒక ప్రాంతం గానీ బాధ్యతని ఒకరికో, ఇద్దరికో (పారిశుద్ధ్య కార్మికులకు కాని, వారిపై ఉన్న సూపర్ వైజర్ కు గాని) అప్పచెప్పాలి.
 
 చెత్త సేకరణ, రోడ్ల మీద చెత్త లేకుండా చూడటం, ఆ ప్రాంతంలో మురుగు పారుదల వ్యవస్థని సరిచెయ్యటం వీరి బాధ్యత. ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటూ వారికి జవాబుదారీగా ఉండాలి.
 
 పొడిచెత్తను Recycling కి పంపించటం ద్వారా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని కాని, పూర్తిగా కానీ పారిశుద్ధ్యం నిర్వహించేవారికి ప్రోత్సాహకంగా ఇవ్వవచ్చు.
 
గత మూడున్నర సంవత్సరాలుగా స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలు చేస్తున్న స్వచ్ఛంద సేవ, మనకోసం మనం ట్రస్ట్ ఆధ్వర్యంలో చెత్త సేకరణ వ్యవస్థను నిర్మించటం వలన ప్రజలందరూ శుభ్రమైన వాతావరణానికి అలవాటు పడ్డారు.
 
పైన చెప్పిన ప్రణాళిక ప్రకారం చల్లపల్లిలో ప్రతి ఇంటి నుండి, వ్యాపార సంస్థ నుండి, కార్యాలయం నుండి ప్రతిరోజూ గాని, రెండు రోజులకు ఒకసారి గాని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చెత్తను సేకరించటం సమర్ధవంతంగా జరిగి, ఘన వ్యర్థ పదార్ధాల నిర్వహణా కేంద్రం (Solid waste management shed) శాస్త్రీయంగా నిర్వహించాలనేది స్వచ్ఛ కార్యకర్తల, ప్రజల కోరిక.
 
ఉపసంహారం:
తెలంగాణా మంత్రి KTR గారు మాట్లాడిన వీడియో ఒకటి whatsapp లో మనలో చాలామంది చూశాం. హీరో మహేష్ బాబు, దర్శకులు కొరటాల శివ గారు కూడా వారి పక్కనే కూర్చుని ఉన్నారు. ఇటీవల వారు టోక్యోలో మూడు రోజులు పర్యటించారట. ఈ మూడురోజుల్లో ఎక్కడా కూడా చెత్త కనిపించలేదట. ‘మీరు ఇంత శుభ్రంగా నగరాన్ని ఎలా నిర్వహిస్తున్నారు?’ అని ఒక జర్నలిస్ట్ మిత్రుడిని ప్రశ్నించారట. ‘We don’t dirty in the first place’ అని వారు సమాధానం ఇచ్చారట!
 
మరికొద్దికాలం తరువాత ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ది శాఖామంత్రి చల్లపల్లి పర్యటిస్తారు. ఎక్కడా చెత్త కనపడదు. అప్పుడు వారు సర్పంచ్ గారిని అడుగుతారు ‘ఊరిని ఇంత శుభ్రంగా ఎలా నిర్వహిస్తున్నారు?’ అని.
 
‘Our people don’t dirty in the first place’ అని సర్పంచ్ గారు గర్వంగా సమాధానం చెప్తారు.
 
ఈకల సాకారం అవుతుందని నమ్ముతున్నాను. త్వరగా అవ్వాలని ఆశిస్తూ…..
 
-డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
09-05-2018
 

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *