స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తల నిమ్మకూరు, కొమరవోలు, పెదపారుపూడిల పర్యటన

 

‘స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం’ వలె ఆంధ్రప్రదేశ్ లో మిగిలిన గ్రామాలలో స్వచ్ఛ ఉద్యమాలు నిర్మించటానికి, వాటిలో ప్రజలను భాగస్వాములను చెయ్యాలనే సంకల్పంతో “స్వచ్ఛాంధ్ర మిషన్” వారు రూపొందించిన కార్యక్రమంలో భాగంగా ‘స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తలు’ 29 మంది ఈనెల 28వ తేదీన నిమ్మకూరు, కొమరవోలు, 29 వ తేదీన 23 మంది పెదపారుపూడి గ్రామాలను సందర్శించటం జరిగింది.

 

“స్వచ్ఛాంధ్ర మిషన్” ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డా. సి.ఎల్. వెంకట్రావు గారు, వారి P.S. ప్రాతూరి విద్యా సాగర్ గారు, MDO, తాహసీల్దార్ గారితో సహా ఆ మండలానికి సంబంధించిన అధికార బృందం, ZPTC, MPP, సర్పంచ్ లతో సహా ప్రజా ప్రతినిధులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

గ్రామ పర్యటన జరిపి అభివృద్ధి జరుగుతున్న తీరు, మెరుగుపర్చుకోవాల్సిన అంశాలు విపులంగా చర్చించటం జరిగింది. నిమ్మకూరులో నిర్మింపబడుతున్న భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను అందరూ ఆసక్తిగా పరిశీలించారు.

 

కొమరవోలులో గుట్కా, పాన్ పరాగ్, సిగరెట్లు, మద్యం అమ్మటం గాని, బహిరంగంగా సేవించటం గాని నిషేధించారని తెలిసి ఆశ్చర్యం, సంతోషం కలిగింది.

 

పెదపారుపూడిలో ‘డంపింగ్ యార్డ్’ ని వారు ‘డంపింగ్ పార్క్’ గా నామకరణం చేశారు. నిజంగానే అది పూలమొక్కలతో పార్క్ వలెనే ఉన్నది. అక్కడ ఘనవ్యర్ధ పదార్ధాలను నిర్వహించే విధానాన్ని సర్పంచ్ గారు వివరించారు. శాస్త్రీయంగా నిర్వహించబడుతున్న ఈ విధానాన్ని చూసి కార్యకర్తలందరం చాలా సంతోషపడ్డాం. రామోజీ ఫౌండేషన్ వారు వేయించిన సిమెంట్ రోడ్డు, కట్టించిన ZP స్కూల్ భవనం, రుద్రభూమి, వాటర్ ట్యాంక్, అంగన్ వాడీ భవనం ఆ ఊరికి వరం. అనంతరం ‘స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమం’ జరుగుతున్న తీరు గురించి power point presentation ఇవ్వడం జరిగింది.

 

అన్ని గ్రామాలలోనూ ‘స్వచ్ఛ చల్లపల్లి’ యొక్క ఫోటో ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది.

 

ఈ మూడు గ్రామాలను నారా లోకేష్ బాబు గారు, నారా భువనేశ్వరి గారు, చెరుకూరి రామోజీ రావు గారు దత్తత తీసుకున్నారు. ఈ గ్రామాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి బాగా జరుగుతోంది. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఈ అభివృద్ధి ఫలితాలను నిలబెట్టుకోగలం కనుక స్వచ్ఛ కార్యక్రమాలలో ప్రజలను మమేకం చేసేటట్లుగా మనం కార్యక్రమాలను రూపొందించుకోవాలి.

 

-డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

30-10-2017

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *