వృద్ధో రక్షతి రక్షితః....           16-Mar-2020

 [స్వచ్చోద్యమ చల్లపల్లి లో సీనియర్ కార్యకర్తలకు అభినందనం]

 

          ఐదున్నరేళ్లుగా నిర్విఘ్నంగా – అద్భుతంగా కొనసాగుతున్న స్వచ్చ సుందర చల్లపల్లి సుప్రభాత శ్రమదాన కార్యక్రమంలో పాల్గొని, కార్యకర్తలలో, గ్రామ ప్రజలలో స్ఫూర్తి నింపుతున్న సీనియర్ కార్యకర్తలు వేమూరి అర్జునరావు మాస్టారు, డాక్టర్ దుగ్గిరాల శివ ప్రసాదరావు గారు, డాక్టర్ మాలెంపాటి గోపాలకృష్ణయ్య గారు, ప్రాతూరి ఉదయ శంకర శాస్త్రి గారు, నల్లూరి రామారావు మాస్టారు అభివందనీయులు.

 

          82 ఏళ్ల అర్జునరావు గారు స్వచ్చోద్యమం తొలినాళ్ళ నుండే చురుకుగా పాల్గొంటూ తన పద్యాలతో కుర్రాళ్ళకు హుషారెక్కిస్తూ వచ్చారు; ఉద్యమ ఖర్చులు కొంత భరించేవారు. ఇటీవల వయోభారంతో దావణగెరె లో తమ మేనకోడలి వద్ద అప్పుడప్పుడూ ఉంటున్నా, అక్కడ నుండే ఫోనులో ఉద్యమ నినాదాలెత్తుకుంటారు. 7 ఏళ్ల నాడు చల్లపల్లి జనవిజ్ఞానవేదిక ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక మండల వ్యాప్తంగా నిర్వహించిన ఓటర్ల అవగాహనా యాత్రలో పాల్గొని, ఓట్లు అమ్ముకోవద్దని ప్రచారం చేశారు. గోపాళం శివన్నారాయణ గారి వైద్య శిబిరాల్లోనూ సేవలందించారు.

 

          చల్లపల్లి లో సీనియర్ డాక్టర్ – సర్జన్ దుగ్గిరాల శివప్రసాదరావు గారు (82) సంవత్సరకాలం పైగా వేకువనే స్వచ్చ సుందర గ్రామం కోసం శ్రమదానం చేశారు. తన జీవన సహచరి జ్ఞాపకార్ధం ఆరు లక్షల వ్యయంతో శ్మశానంలో సౌకర్యవంతమైన దహనవాటిక నిర్మించారు. నాలుగేళ్ల నుండి క్రమం తప్పకుండా ప్రతి నెలా 500/- చొప్పున స్వచ్చోద్యమ విరాళమందిస్తున్నారు. వయసురీత్యా వేధిస్తున్న కీళ్ల నొప్పులు తగ్గినప్పుడు మాత్రం దైనందిన శ్రమదానంలో పాల్గొంటున్నారు. చల్లపల్లి వైద్య శిబిరంలోనూ ఉచిత సేవలందిస్తుంటారు.

 

          81 ఏళ్ల డాక్టర్ మాలెంపాటి గోపాలకృష్ణయ్య గారి ఉత్సాహమేవేరు. శాస్త్రి గారితో బాటు ఒకటి రెండేళ్ళు గ్రామ బాధ్యతలు మోసిన పూర్తి కాల స్వచ్చోద్యమ కార్యకర్త. గుండెకు, మోకాళ్లకు నాలుగు మార్లు శస్త్ర చికిత్సలు జరిగి సన్నిహితులు వద్దని వారిస్తున్నా ప్రతి దిన పాత్రః కాల శ్రమదానం మానరుగాక మానరు! ఈ స్వచ్చ సుందర గ్రామంలో కార్యకర్తలు నాటి, సాకుతున్నవేలాది మొక్కలకు దినదినం నీరందిస్తున్న ట్యాంకర్ల దాతలు వీరు, వీరి కుటుంబసభ్యులే! ప్రతి నెలా ఠంచనుగా ఈయన స్వచ్చోద్యమ చందా 2000/- మనకోసం మనం ట్రస్టుకు అందుతూనే ఉంటుంది. పెరిగే వయసుకు సమాంతరంగా ఈ డాక్టరు గారి తరగని బాల్యోత్సాహం మా స్వచ్చోద్యమానికి టానిక్ లాంటిది!

 

          జగమెరిగిన సామాజిక కార్యకర్త 73 ఏళ్ల ప్రాతూరి ఉదయశంకర శాస్త్రి గారు స్వచ్చోద్యమంలో నిర్వహిస్తున్న ప్రముఖ పాత్ర అందరికీ తెలుసు. నాలుగున్నరేళ్ళ క్రిందట అనుకోకుండా చల్లపల్లి వచ్చి, సూదంటురాయిలాగా ఆకర్షించిన స్వచ్చోద్యమానికి కట్టుబడిన నాటి నుండీ శాస్త్రి గారు తనది కాని ఈ స్వచ్చ సుందర చల్లపల్లి కి సర్వాత్మనా అంకితుడైపోయి, తన మనస్సును, తపస్సును, ఈ గ్రామ యశస్సు కోసం సమర్పిస్తున్న ధన్యజీవి! ప్రతి నెలారంభంలో పెన్షన్ అందడమే తరువాయి – ఈ స్వచోద్యమం కోసం విచ్చలవిడిగా ఖర్చు చేయడం ఇతని ప్రస్తుత ప్రవృత్తి! రకరకాల అనారోగ్యలొక వంక - సానుకూల దృక్పధం తో ఎదుర్కొని నిత్య సంతోషిగా బ్రతకడం మరొక వంక - గా ముందుకు పోవడం ఈయనకే చెల్లుతుంది! వీరు చల్లపల్లి స్వచ్చోద్యమ సామాజిక మాధ్యమ సంధాన కర్త కూడ!

 

          గత 31 ఏళ్లుగా జనవిజ్ఞాన వేదిక అనుబంధం ఉన్న – ఐదారేళ్ళ స్వచోద్యమ తాదాత్మ్యం ఉన్న – 72 ఏళ్ల వయసున్న -  నల్లూరి రామారావు మాస్టారు చిన్నప్పటి నుండే ప్రత్యక్షంగా, పరోక్షంగా సామాజిక ఉద్యమ పక్షపాతి. మరి తనకళ్ళెదుట జరుగుతున్న ఈ విశిష్ట స్వచ్చోద్యమ సంరంభానికి స్పందించక – క్రియాశీల పాత్ర వహింపక ఎలా ఉండగలరు? (ఈ మధ్య పనికోసం నడుం వంచలేకపోతున్నా) ప్రతిదిన స్వచ్చ శ్రమదాన సూక్ష్మాంశాలను పరిశీలించి, స్పందించి, పాటలుగా – పద్యాలుగా రాయడం అక్షరబద్ధం చేయడం - తొలి నుండీ వస్తుతః సాహిత్యకారుడైన ఈయన తన బాధ్యతగా స్వీకరించారు. గత 18 ఏళ్ల వైద్య శిబిరాలలో కూడ ఈయన హస్తం ఉండక తప్పదు. ఒక రకంగా వీరిది సకుటుంబ స్వచ్చంద శ్రమదానమనవచ్చు! (ఈయన శ్రీమతి శివకుమారి, కొడుకు సూర్యవర్ధన్  శక్తి మేరకు శ్రమదాతలుగా, స్వచ్చోద్యమ భూరి విరాళ దాతలుగా ఉన్నారు మరి!)

         

          ఈనాటి శ్రమదాన వేడుక లో పాల్గొన్న – పైన పేర్కొన్న ఐదారుగురూ కేవలం వయసురీత్యా మాత్రమే స్వచ్చ – వృద్ధ కార్యకర్తలు; సామాజిక బాధ్యతలలో మాత్రం కాదు. ఇక్కడ వీరితో బాటు మరొక ఐదారుగురిని కూడ ప్రస్తావించి తీరాలి. వయో సంబంధ రుగ్మతలతో – ఇతర కారణాలతో దైనందిన శ్రమానందంలో ప్రస్తుతం పాల్గొనలేకున్న ఆ సీనియర్లెవరంటే :

 

- 76 ఏళ్ల రావూరి సూర్యప్రకాశరావు గారు. శ్రమ విరాళంతో బాటు సమయ ధన విరాళాలిస్తూ ఏడెనిమిదేళ్లు వైద్య శిబిర సేవలందించారు.

 

- స్వచ్చోద్యమ ఆరంభదినాల నుండీ స్వచ్చోద్యమ బాధ్యతలు కొన్ని మోసి, ఇటీవల కొంత విశ్రమిస్తున్న తుమ్మల జనార్ధనరావు (75) గారు ఇటు స్వచ్చ చల్లపల్లి – అటు వైద్య శిబిర కార్యకర్త!

 

- రెండేళ్ల పాటు స్వచ్చ – సుందర చల్లపల్లికి తన ప్రాభాత సేవలతో బాటు ఉద్యమ ఖర్చులకు ధనసహాయం చేసిన – చేస్తున్న – 80 ఏళ్ల వయసులో ప్రస్తుతం విశ్రాంతిలో – శివరామపురం లో ఉన్న రావెళ్ల శివరామకృష్ణయ్య గారు.

 

- పంచాయితి బిల్లు కలెక్టరుగా ఉద్యోగించి, 10 ఏళ్ల నాడు విరమించి, తదాదిగా పాగోలుకూ – స్వచ్చ సుందర చల్లపల్లి కీ వారధిగా – ఉభయ గ్రామాల అభ్యుదయానికీ శ్రమరూపంలో – ధనరూపంలో సహకరించిన 69 ఏళ్ల కంఠంనేని రామబ్రహ్మ్మం గారు.

 

- వక్కలగడ్డ నివాసి, స్వచ్చోద్యమ చల్లపల్లి ప్రవేశి, జనహిత కార్యక్రమ వివేకి - 74 ఏళ్ల మణి ప్రభాకరరావు మాష్టారు.

 

- దివంగత వాసిరెడ్డి కోటేశ్వరరావు (72) గారి గురించి ఎంత చెప్పి నా తక్కువే! స్వచ్చంద సేవల అన్ని విభాగాల్లో రాజ్యమేలిన – రాటు తేలిన వన్ మాన్ ఆర్మీ (ఏక మనుష్య సైన్యం) అంటే అతడే! ఒక్కడే 20 మంది కార్యకర్తల పెట్టు. వైద్య శిబిర నిర్వహణలో – విజయా కాన్వెంట్ విజయంలో – స్వచ్చోద్యమం లో – వీరవిహారం చేసి, 100 మైళ్ళ వేగంతో నింగి దాక దూసుకుపోయి, హఠాత్తుగా కనుమరుగైన సౌజన్య ధృవతార!

 

          పైన ప్రస్తావించిన 10 మందినీ “వృద్ధులు” అని పేర్కొనడం సమంజసమేనా? పొరుగువారి సౌకర్యాన్ని, మేలునూ మర్చిపోయి, రకరకాల వ్యసన పరులౌతున్న – పుట్టుకతో వృద్ధులవుతున్న కుర్రవాళ్ళున్న మన సమాజంలో తమ శక్తికి మించి పరుల సేవలో శ్రమిస్తున్న – నిత్య కృషీ వలులైన పెద్దలందరికీ హృదయపూర్వక అభినందనలు – స్వచ్చోద్యమ అభివందన సుమచందనాలు!

 

(రామారావు మాస్టారి కొద్దిపాటి రచనా సహకార సౌజన్యంతో....)

డాక్టర్ దాసరి రామకృష్ణ ప్రసాదు,

స్వచ్చ - సుందర - చల్లపల్లి కార్యకర్త. 

 

16.03.2020.                

అర్జునరావు మాష్టారు, శివప్రసాదరావు గారు
రావూరి సూర్యప్రకాశరావు గారు
తుమ్మల జనార్ధనరావు గారు
రావెళ్ల శివరామకృష్ణయ్య గారు
కంఠంనేని రామబ్రహ్మ్మం గారు
మణి ప్రభాకరరావు మాష్టారు
వాసిరెడ్డి కోటేశ్వరరావు గారు