సంత, సంత బజారు, రైతుబజారు....           02-Apr-2020

 సంత, సంత బజారు, రైతుబజారులలో గత ఏడెనిమిది నెలల నుండి

బాగా అక్కరకు వస్తున్న స్వచ్చ కార్యకర్తల శ్రమ

          2019, జులై నెలంతా స్వచ్చ కార్యకర్తలు రైతు బజారు, సంత మార్కెట్ ను శుభ్రపరచి, సుందరీకరించారు. అంతేకాకుండా, వీరి కష్టంతో బాటు సంత మార్కెట్, రైతు బజారు, పోలీస్ క్వార్టర్స్, C.I గారి ఆఫీస్ ల ముందు దాసరి రామమోహనరావు, దాసరి స్వర్ణలత, దాసరి స్నేహ, వల్లభనేని వేంకట నాగేంద్ర కుమార్ గార్ల భూరి విరాళాలతో మనకోసం మనం ట్రస్టు ఆధ్వర్యంలో పేవర్ టైల్స్ వేయించారు.

          30 - 40 మంది కార్యకర్తల శ్రమదానంతో సంత గోడలన్నిటి మీద రంగులు పూసి శుభ్ర – సౌందర్య స్ఫోరక నినాదాలు, అర్ధవంతమైన, సందేశాత్మకమైన ఎన్నో చిత్రాలు గీసి, కరెంటు స్తంభాల మీద కూడా కొన్ని సందేశాలను అందించి ఆరోజుల్లో మూడు పూటలా చేసిన అసాధారణమైన వీరి కృషి ఫలితం ఇప్పుడు చల్లపల్లి, పరిసర గ్రామాల వేలాది మంది ప్రజలు తమకు తెలియకుండానే అనుభవిస్తున్నారు.

          సంత లోపల, రైతు బజారు లోపల ఎగుడు దిగుడులన్నీ సరిచేసి నీడనిచ్చే మొక్కలను నాటి, పెంచి, ముందు చూపుతో కార్యకర్తల వేల పని గంటల సత్ఫలితం కదా మరి! ఇందుకే పెద్దలు కష్టే ఫలే అని సెలవిచ్చారు. ఇప్పుడు ఈ కార్యకర్తల ఆదర్శ గ్రామ ప్రయోజనాత్మక కృషితో పాత సామెతను శ్రమయేవ జయతే అని మార్చుకోవలసి వస్తున్నది.            

          ఈ స్వచ్చ సైనికుల సుదీర్ఘ - విస్తృత శ్రమానంతరం 2019, జులై 21 న చల్లపల్లి స్వచ్చోద్యమం 1713 వ రోజున మన అవనిగడ్డ MLA సింహాద్రి రమేశ్ గారి చేతుల మీదుగా సర్వాంగ సుందరీకృతమైన సంత పునః ప్రారంభించబడింది.  

          ఎగుడు దిగుడుగా ఉన్న ఈ సంత బజారు, రైతు బజారు, సంతల ముందు భాగమంతా సదరు పేవర్ టైల్స్ అమరికతో ఎంతో అందంగానూ, పార్కింగ్ కు అనుకూలంగానూ ఉండి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండి ఉపయోగపడుతోంది.

          కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ సందర్భంగా సంత లో కూడా దూరదూరంగా కూరగాయల షాపులను, షాపుల ఎదుట బ్లీచింగ్ పౌడర్ గీతలతో గదులను ఏర్పాటు చేశారు. అప్పుడు వేయించిన పేవర్ టైల్స్ భాగమంతా వినియోగదారులందరికీ పార్కింగ్ కి బాగా ఉపయోగకరంగా ఉండడం సంతోషానిస్తున్నది.

- నల్లూరి రామారావు

- దాసరి రామకృష్ణ ప్రసాదు

- తరిగోపుల పద్మావతి

మనకోసం మనం ట్రస్టు సభ్యులు.  

చల్లపల్లి - 02.04.2020.