*అన్ని రోడ్ల కాదర్శం- మా రోడ్డే కీర్తి పథం.*....           10-May-2020

           *అన్ని రోడ్ల కాదర్శం- మా రోడ్డే కీర్తి పథం.*

          రోడ్డంటే మా రోడ్డే- గంగులపాలెం రోడ్డే

          బాహ్య విసర్జనలు లేక ప్రజలు పరవశించు రోడ్డు

          గతుకులసలె కనిపించక కాలి నడక సాగు రోడ్డు

          మురుగు పైకి కనిపించక భూగర్భంలో నె దాగి

          పైన పూల కుండీల తొ- పలు పచ్చని చెట్ల తోడ

          పూల సుగంధాలు ఒలికి పోవు అందమైన రోడ్డు

ఝణకు ఝణకు తారా-ఒక మారు వచ్చి చూడరా

గంగులపాలెం మార్గమిపుడు- బహు సుందరమైనదిరా ఝణకు ఝణకు

          పూర్వం ఈ దారంతా భూలోక పునరకమురా

          పట్ట పగలె రోడ్డంతా పూతి గంధ హేయమురా

          చచ్చి పడిన కళేబరాలు- జంతు మాంస వ్యర్ధాలూ

          డ్రైనేజి నిండ ప్లాస్టిక్కులు- చెప్పరాని పలు తుక్కులు

          నడచునపుడు ముక్కు మూసి- మహిళలైతే కళ్లు మూసి

          ఆస్పత్రికి చేరుకొనే అతి భీకర గండమురా

ఝణకు ఝణకు తారా – దాన్ని గుర్తు చేసుకోకురా

స్వచ్చోద్యమ ఫలితంగా- దాని రూపు మారెరా ఝణకు ఝణకు

          పలు దఫాలు కార్యకర్తలు పాటు బడిన రోడ్డురా

          నెలల కొలది తమ స్వేదం చిందించిన బాటరా

          తరతరాల కాలుష్యాన్ని తరిమి కొట్టి సుమసుందర

          సుమధుర దృశ్య కవిత్వాన్ని- చూపు మంచి దారిరా

          ఇతర గ్రామ వీధులకిక ఇది ఒక ఆదర్శమురా

          కడమ ఊళ్ల బాటలకొక కలల రాచ బాటరా

ఝణకు ఝణకు తారా – దీన్ని మళ్లీ మళ్లి చూడరా

సెల్ఫీలను  తీసుకొంటు – కరవు తీర నడవరా

ఝణకు ఝణకు తారా – ఒక్కడుగు ముందు కేయరా

మిగిలిన మన రోడ్లు దీన్ని – మించు నట్లు చూడరా

ఝణకు ఝణకు తారా – కనుల కరవు తీర చూడరా

అన్ని ఊళ్ల- అన్ని రోడ్ల కలల రాచ బాటరా

ఝణకు ఝణకు తారా – ఒక్కడుగు ముందు కేయరా

ఇకపై మన రోడ్లన్నిటి నిలా చూడ వలె నురా

         ఝణకు ఝణకు తారా – ఒక్కడుగు

 

- నల్లూరి రామారావు 

10.05.2020