1866* వ రోజు విశాఖ యాత్ర ....           22-Dec-2019

  21.12.2019 నాటి అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా” వారి పురస్కార స్వీకారం కోసం స్వచ్చ చల్లపల్లి కార్యకర్తల

విశాఖ యాత్ర – కొన్ని చిరస్మరణీయ అంశాలు.

 

          తెలుగు జాతి గర్వించదగ్గ నట సామ్రాట్ అక్కినేనికి ఆత్మీయులనదగిన 9 మంది అమెరికా ప్రవాసాంధ్రులు నాగేశ్వరరావు గారి “స్వయం కృషి – క్రమ శిక్షణ – ఆత్మ స్థైర్యం – దూర దృష్టివంటి వ్యక్తిత్వ వికాస మూల స్తంభ లక్షణాలకు ఆకర్షితులై, తమతో బాటు తెలుగువారంతా ఆ నాలుగు లక్షణాలను అలవరచుకొని, అత్యున్నత స్థితికి చేరాలనే సత్సంకల్పంతో స్థాపించి, విజయవంతంగా నిర్వహిస్తున్నదే-“అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా” సంస్థ తమ ఆశయ సిద్ధి కోసం ఈ విక్రమార్కులు పదే పదే ఆంధ్ర రాష్ట్రాలను సందర్శిస్తూ-ప్రతి డిసెంబరు మాసంలో పై నాలుగు లక్షణాలతో తమ తమ రంగాలలో చిరస్మరణీయ కృషి చేస్తున్న 9 మందిని ఎన్నుకొని “ అక్కినేని అంతర్జాతీయ పురస్కారాల” ను ఇస్తున్నారు. ఈ ఏడాది డిసెంబరు 21 న విశాఖ నగరంలోని “ చిల్డ్రన్స్ ఎరీనా” లో జరిగిన 6 వ ఉత్సవంలో స్వచ్చ చల్లపల్లి సైన్యానికి ప్రతీక ఐన “ మనకోసం మనం” ట్రస్టుకు ప్రకటించిన సామాజిక “సేవా రత్న” పురస్కారం గ్రహించడం కోసం ఆ సంస్థ బాధ్యులైన నలుగురు సభ్యులతో సహా మొత్తం 40 మంది స్వచ్చ సైనికులు పాల్గొన్నారు.

 

          ఈ బృందం శుక్రవారం ఉషోదయానికే విశాఖ- సీతమ్మ ధార చేరుకొని, 8 గంటలకే తయారై, 4 గంటల బస్ ప్రయాణంతో బొర్రా గుహల వద్దకు పోయి సవివరంగా తిలకించింది. అక్కడి నుండి అరకు లోయను చేరుకొని, ఆ అతిలోక సుందర దృశ్యాలను చూసి, భోజనానంతరం గిరిజన స్త్రీల ధింసా నృత్య ప్రదర్శనను ఆనందించి, ఒక దశలో వారితో మమేకమయ్యారు.

 

          సువిశాలమైన పద్మాపురం (బొటానికల్) గార్డెన్స్ అంతా తిరిగి చూసి, ప్రకృతి వింతలకు పరవశించారు. గిరిజన మ్యూజియం అంతా తిరిగి చూసి, ఫోటోలు దిగి, ఆదిమ సంస్కృతి విశిష్టత ను అవగాహన చేసుకొన్నారు. బసకు చేరింది అర్థరాత్రి సమయానికైనా, శనివారం ఉదయమే బయలు దేరి శంకర శాస్త్రి గారి పర్యవేక్షణలో ఋషి కొండను, అక్కడి అద్భుత సాగర తీర దృశ్యాలను చూస్తూ, విశాఖ సముద్ర జలంలో తడుస్తూ, సందడి చేస్తూ గంటన్నర పాటు ఆనందించారు. మన సాహస నారి డాక్టర్ పద్మావతి గారు 15 నిముషాల పారాచూట్ సముద్ర గగన విహారం కూడ ఇక్కడే జరిగింది!

 

          ఆ పిదప రామకృష్ణ బీచ్ మీదుగా కైలాసగిరిని చేరుకొని, కాలి నడకతోనూ, రైలు బోగీ లోనూ విహరించి, కొందరు షాపింగ్ లు చేసి, మధ్యాహ్న భోజనానికి బసకు చేరుకొన్నారు.

 

సాహో స్వచ్చ చల్లపల్లి సైనికా!

 

          ఈ అన్ని పర్యటనలలోను చల్లపల్లి స్వచ్చ కార్యకర్తల ఆహార్యం, సమయపాలన, క్రమశిక్షణ- ముఖ్యంగా పురస్కార ప్రదాన సభలో వివిధ అంశాల పట్ల స్పందన.... ప్రశంసనీయంగా ఉండి అటు మిగిలిన ప్రేక్షకుల-ఇటు సభా కార్యక్రమ నిర్వహకుల దృష్టిని ఆకర్షించాయి. కార్యక్రమ సమయంలోను, అనంతరం భోజనాల దగ్గర చాలా మంది దేశ విదేశ ప్రముఖులు 1865* రోజుల స్వచ్చోద్యమ చల్లపల్లి ప్రస్థానం గురించీ, కుల- మత - ప్రాంత భేద రహితమైన ఈ కార్యకర్తల సుదీర్ఘ - నిస్వార్థ శ్రమదాన సార్థకత గురించీ పదే పదే ప్రస్తావించడం – ప్రశ్నించడం - ఆశ్చర్య పోవడం గమనించాను.

 

          ఐతే- సమాజానికి తాము పడిన అప్పును కొంతైనా తీర్చుకోగలుగుతున్నామని తృప్తి చెందుతున్న ఈ స్వచ్చోద్యమ కారులు తమకు దక్కిన ఈ పురస్కారంతో తమ సామాజిక బాధ్యత మరికొంత పెరిగిందని భావిస్తున్నారు! నేటి ఇతర పురస్కార గ్రహీతలు – ముఖ్యంగా మాగంటి మురళీ మోహన్, తానా పూర్వ అధ్యక్షులు తోట కూర ప్రసాద్, ప్రస్తుత అక్కినేని ఫౌండేషన్ అధ్యక్షురాలు శారద ఆకునూరి వంటి ప్రముఖులు త్వరలో నే చల్లపల్లిని స్వచ్చ కార్యకర్తల శ్రమదానాన్నీ ప్రత్యక్షంగా చూడాలని ఉత్సాహపడటం దేనికి సంకేతం? అది కేవలం ఈ స్వచ్చ సైనికుల నిరంతర- నిస్వార్ధ-బాధ్యతాయుత కృషి ఫలితం తప్ప మరొకటి కాదు. వాళ్ల 1866 రోజుల రెండు లక్షల పని గంటల శ్రమదానం మాత్రమే వేదిక మీది ఇందరు ప్రముఖుల, ప్రేక్షకుల దృష్టిని సునాయాసంగా ఆకర్షించి ఉండాలి! కార్యకర్తల శ్రమను ప్రతిబింబించే వీడియో ప్రదర్శనకు సభికులందరి కరతాళ ధ్వనులే దానికి నిదర్శనం! కొలకలూరి ఇనాక్ గారి, సినీ నటుడు మురళీ మోహన్ గారి, వ్యాఖ్యాత శ్రీ నాగేశ్వరరావు గారి పదే పదే చల్లపల్లి స్వచ్చోద్యమ ప్రస్తావనలు మరొక ఋజువు!

 

ఈ 4 గంటల నిడివి కార్యక్రమం మొత్తంలో మరికొన్ని ముఖ్య విశేషాలు:

 

* అక్కినేని ఫౌండేషన్ కు చెందిన 9 మంది కార్య నిర్వాహకుల్లో ఏడుగురు పాల్గొని ప్రణాళిక బద్ధంగా- అనుకొన్న సమయం ప్రకారం ప్రతి అంశాన్ని నిర్వహించడం.

* శారద ఆకునూరి, వినోద్ గార్ల అద్భుత సినీ గీతాలాపనలు.

* ప్రతి సూక్ష్మాంశాన్నీ ప్రేక్షకులు - ముఖ్యంగా చల్లపల్లి కార్యకర్తలు - నిశితంగా పరిశీలించి ఆస్వాదించడం.

* మాతృభాష పట్ల నిరాదరణ గురించి, దాని భవిష్య దుష్పరిణామాల గురించి చెన్నమనేని విద్యాసాగర్ రావు గారి ఆవేదన.

* చల్లపల్లి స్వచ్చ కార్యకర్తలు 40 మందిని వేదిక మీదికి రప్పించడం- ఛాయా చిత్ర సందడి.

* గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్ధి సంఘాధ్యక్షులు డా. ఆళ్ల శ్రీనివాస రెడ్డి తదితరుల అంకిత కృషి.

* 1865* నాళ్ల నిర్విరామ గ్రామాభ్యుదయ కృషి  తర్వాత చల్లపల్లి కార్యకర్తలు మరింతగా పునః శక్తి వంతులయేందుకు తగిన వినోదాత్మక పర్యటన!

* మన కార్యకర్తలు మరింతగా ఉత్తేజితులయ్యేలా డాక్టర్ గురవారెడ్డి గారి చాకచక్యం.

* డాక్టర్ పద్మావతి గారి - డాక్టర్ DRK గారి సమయోచిత - సానుకూల సత్వర నిర్ణయాలు-ప్రసంగాలు.

* స్వచ్చ చల్లపల్లి ని సొంతం చేసుకున్న ఉదయ శంకర శాస్త్రి గారు, వారి కుమారుడు రవి కార్యకర్తలకు అడుగడుగునా సహకరిస్తూ ఈ యాత్ర ను విజయవంతం చేయడం.

* ప్రకాశం జిల్లా కారంచేడు కు చెందిన ఇంజనీర్ శ్రీ సాంబశివరావు గారు తమ గ్రామ స్వచ్చ – శుభ్ర – అభ్యున్నతకై ఎంతో ప్రయత్నిస్తున్న స్వచ్చ చల్లపల్లి సైన్యం సుదీర్ఘ సేవా ప్రస్థానం తెలుసుకొని, ఆశ్చర్యపడి త్వరలో ఇక్కడికి తానూ, తన కార్యకర్తలు వచ్చి, ప్రత్యక్షంగా పరిశీలించి, తమ గ్రామంలో కూడ అమలు చేయాలనే నిర్ణయం.

* ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్ గారు తానిదివరకే మిత్రులైన మూల్పూరి వేంకటేశ్వరరావు గారి ద్వారా విన్న చల్లపల్లి స్వచ్చోద్యమానికి “సేవారత్న పురస్కారం సముచితమనిచెప్పి, చల్లపల్లిని తప్పక వచ్చి చూడాలని నిర్ణయించుకొనడం.

          ఇటు స్వచ్చ కార్యకర్తలకూ అటు సోదర గ్రామస్తులకు నావినతి ఏమంటే – వేలెత్తి చూపడానికి వీలుకాని, ఏ గ్రామ సర్వతోముఖాభివృద్ధికైనా రాచమార్గమైన మన స్వచ్చ – సుందర – ఆనంద చల్లపల్లి ఉద్యమాన్ని కలకాలం కొనసాగించాలని! మన గ్రామ పౌర సమాజ మెరుగుదలకై మరింతగా పునరంకితులం కావాలని నా ఆకాంక్ష!  

 

 

నల్లూరి రామారావు,

సభ్యులు, మనకోసం మనం ట్రస్టు

చల్లపల్లి – 22.12.2019.