సామాన్యుడే మాన్యుడైన ఒక అద్భుత స్ఫూర్తిదాయక సంఘటన....           13-Jul-2020

            మన సమాజం ఇప్పుడు ఈమాత్రం సుఖ సౌకర్యాల సంతోషం అనుభవిస్తూ, కాస్త సాఫీగా పురోగమిస్తున్నదంటే – దానివెనుక వేలాది సంవత్సరాలుగా ఎందరు తత్త్వవేత్తల – శాస్త్రవేత్తల – పరిశోధకుల – మార్గదర్శక మహనీయుల త్యాగం, కృషి, ఆవిష్కరణలు, స్ఫూర్తి ఉన్నవో గుర్తు చేసుకోవాలి. అలాంటి మహాపురుషుల నుండి మానవ సమాజం తీసుకొన్న ఈ అప్పునే ప్రాచీనులు “ఋషి ఋణం” అన్నారు. I.M.F., ప్రపంచ బ్యాంకు వంటి ఋణదాతలు మనలో ప్రతి పౌరుడి నుండి తలసరి అప్పును వడ్డీతో సహా ముక్కుపిండి వసూలు చేసుకొంటారు. కాని, పైన చెప్పిన “ఋషిఋణం” లేదా “సామాజిక బాధ్యతా ఋణం అనే దాన్ని తీర్చడం మాత్రం ప్రతి పౌరుడి వైయక్తిక నైతిక విధి!

 

            వాల్మీకి వ్యాసులు, బుద్ధుడు, చాణక్యుడు, సోక్రటీస్, కార్ల్ మార్క్స్, ధామస్ ఆల్వా ఎడిసన్, గాంధీ మహాత్ముడు వంటి వారి పట్ల ఈ సమాజానిది కంటికి కనిపించని శాశ్వత ఋణం! ఆ మేధావులు, మహా పురుషులే కాదు, అతి సాధారణ నిరక్షర నిరుపేద వ్యక్తులు సైతం తాము బ్రతుకుతున్న సమాజాన్ని ఋణగ్రస్తం చేసిన సంఘటనలు కూడ చాలా ఉన్నవి. “ఎక్కటి వీరులు, అసహాయ శూరులు, అతిరధులు, మహారధులు....” అంటే వీళ్ళేనేమో! అలాంటి ఒకరిద్దరు సాదాసీదామనుషులను గుర్తు చేసుకొందాం!

 

            అతని పేరు దశరధ్ మాంఝి. వెనుకబడిన బీహార్ లో – గయ సమీపంలోని గెహ్లోర్ గ్రామంలో, దళిత కుటుంబంలో పుట్టాడు. చిన్నప్పుడే ఇంటి నుండి పరారై, ధన్ బాద్ బొగ్గు గనుల్లో శ్రమ పాఠాలు నేర్చుకొని, కొంత జీవన పోరాటం చేసి, కొన్నాళ్ళకు మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాడు. ఫాల్గుణి అనే ఆమెతో పెళ్లై, వ్యవసాయ కూలీగా బ్రతుకుతుండేవాడు. ఈ గెహ్లోర్ అనే కుగ్రామాన్ని దక్షిణాన ఎత్తైన రాజగిరి కొండ గయ దగ్గరి అత్రి కి వెళ్ళే రోడ్డును సుమారు 40 కిలో మీటర్లు దూరం ఎక్కువ చేసేది.

 

            1959 లో తన 20 వ ఏట అతని భార్య – ఫాల్గుణి ఆకొండ అంచు మీద పని చేస్తూ ప్రమాద వశాత్తూ జారిపడి, గాయాలతో – వైద్య సహాయం సకాలంలో అందక చనిపోయింది. అప్పుడతని కర్ధమైంది – ఆ గిరి రాజ్ కొండ అడ్డంకితో తన గ్రామస్తులకెప్పటికైనా ప్రాణ ప్రమాదమేనని! ఇక అప్పుడతను కఠినంగా నిర్ణయించుకొన్నాడు – తన భార్యలాగా వైద్యం ఆలస్యమై తన ఊళ్ళో ఏ ఒక్కరూ మరణించకుండాలంటే – ఆ కొండను త్రవ్వి, చెక్కి తన ఊరును అత్రి రోడ్డుతో అనుసంధించక తప్పదని!

 

          కొండను తొలిచి, ఒంటి చేత్తో, బస్సు మార్గం నిర్మించడం ప్రారంభించిన ఆ 1960 వ సంవత్సరంలో అతడు ఆ ప్రాంతం జనం దృష్టిలోఒక వెర్రివాడు! ఎవరెంత సహకరించకున్నా – ఎన్ని అవహేళనలు నిత్యం ఎదురైనా అతడు లెక్క చేయలేదు. తన ప్రయత్నం మానలేదు. బ్రతుకు తెరువు కోసం ఉదయం కూలికెళ్ళడం – మధ్యాహ్మం నుండి గిరి రాజ్ కొండ మీద రోడ్డు వేసే యుద్ధం చేయడం – ఇలా ఎన్నాళ్ళు?

 

            22 సంవత్సరాలు - 8030 రోజులు!! 360 అడుగులు పొడవున, 25 అడుగుల లోతున – 30 అడుగుల వెడల్పున రాళ్ళను తొలిచి, కొండను త్రవ్వి బస్సులు తిరిగే రోడ్డును అతడొక్కడే నిర్మించాడు - గిరి రాజ్ కొండను జయించాడు! ఐతే తనను అవహేళన చేసిన వాళ్లే కాదు – తనకు సుత్తి, కత్తి వంటి పనిముట్లు కొని ఇచ్చి, కూలికి పోనపుడు, కూలి దొరకనపుడు తనకు తిండి పెట్టి ఆకలి తీర్చిన వాళ్ళు కూడా ఉన్నారని అతడు గుర్తు చేసుకొన్నాడు! 1982 లో అతని సుదీర్ఘ నిరంతర మహా ప్రయత్నం ఫలించి ఒంటి చేతి నిర్వాకంతో తయారైన ఆ కొండ రోడ్డు వల్ల గయకూ, అతని ఊరు గహ్లోర్ కూ దూరం 55 నుండి 15 కిలోమీటర్లకు తగ్గిపోయింది.

 

            2007 లో అతని మరణానంతర అంత్యక్రియలు ఆ రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం 2016 లో మాంఝి స్మారకార్ధం తపాలా బిళ్ళను విడుదల చేసింది.

 

            తరతరాల మానవ సమాజానికతని వీరోచిత త్యాగ చరిత్ర ఒక తరగని స్ఫూర్తి!

 

            ఇలాంటి ఎందరెందరు మహనీయుల ఉదాహరణలతోనో, ప్రేరణలతోనో 2014 నవంబర్ 12 వ తేదీ నుండి చల్లపల్లి లో ఒక అద్భుత - నిరంతర - సామూహిక - స్వచ్చంద శ్రమదానం 2070 రోజుల పాటు – కరోనా కల్లోలం ఊరిని కుదిపేసే దాకా కొనసాగింది!   

 

(నేటి ప్రజాశక్తి పత్రికలోని తీరానికి కంచె వేశాడు అనే కధనం ప్రేరణతో)

నల్లూరి రామారావు

13.07.2020.