పొరుగు జిల్లా జిజ్ఞాసువులు.....           23-Jan-2021

 స్వచ్ఛ –  శుభ్ర సుందర చల్లపల్లిలో పొరుగు జిల్లా  జిజ్ఞాసువులు.

 

ఈ శనివారం గుంటూరు జిల్లా వివిధ మండలాల వివిధ గ్రామాల నుండి వచ్చిన వివిధ నేపధ్యాల వర్గాల వయస్సుల వారు 30 మంది ఆరేడు గంటల పాటు గ్రామాన్ని సందర్శించి, పరిశీలించి, స్వచ్చోద్యమం తీరు తెన్నుల్ని పరిశోధించి, ఉద్యమ సారధులతో చర్చించి, సంతసించి వెళ్ళారు. కరోనా ఘరానా దెబ్బ తరువాత మన ఊరికి జరిగిన తొలి స్వచ్ఛ సుందరోద్యమ జ్ఞాన యాత్ర బహుశా ఇదే కావచ్చు.

 

అనుకూల  వాతావరణాన్ని వెదుక్కొంటూ ఎక్కడో సైబీరియా నుండి, ఆర్కిటిక్ నుండి మన కొల్లేరు, చిలకా సరస్సులకు పక్షులు వలస వస్తాయట! ఆంగ్లంలో

“Birds of same feather always come together”

అనే సామెత ఉంది ఒక జాతి పక్షులన్నీ తమ గూటిని వెదుక్కుంటాయన్నమాట! ఈ 30 మందికి పైగా స్వచ్చోద్యమ అభిలాషులు సైతం చాలాకాలంగా ప్రసార మాధ్యమంలోను, సామాజిక మాధ్యమాలలోను చల్లపల్లి స్వచ్ఛ సైన్యం ద్విగ్విజయ యాత్రల్ని ఆసక్తిగా, ఆశ్చర్యంగా, ఆరాధనగా గమనించి, మెచ్చి, ఇక ఆగలేక వచ్చి, ప్రత్యక్షంగా చూసి సంబరపడ్డారు!

 

సుమారు 2 గంటల పాటు చల్లపల్లి స్వచ్చోద్యమ వైద్యులిద్దరూ అతిధులతో బాటు గ్రామంలోని - అది శ్మశానమంటే నమ్మదగని సుందర దృశ్యాన్నీ, చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్నీ, తీర్చిదిద్దినట్లున్న రహదారి వనాలనీ, స్వచ్ఛ సుందర టాయిలెట్లనీ, స్వచ్ఛ సైనికుల కఠోర శ్రమ ఫలితంగా మెరుగుపడి, దర్శనీయంగా ఉన్న కొన్ని వీధుల్ని, భూగర్భ మురుగు వ్యవస్థలతో  పూలతోటలతో మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే రెండు మార్గాలనీ, రంగు రాళ్ళతో సువిశాల సుందరంగా ఉండే రహదారుల్నీ చూపిస్తూ సంధించే ప్రశ్నలకు సమాధానాలిస్తూ స్వాగతించారు.

 

12.45 నుండి 3 గంటల పాటు ఆస్పత్రి సమావేశ మందిరంలో 2111* దినాల సుదీర్ఘ స్వచ్చోద్యమ చరిత్ర క్రమాన్ని సచిత్రంగా ససాక్ష్యంగా చూసి, అభినందించి, అప్పుడప్పుడూ అనుమాన నివృత్తి చేసుకొని, సదరు ఉద్యమ సాధ్యతను జీర్ణించుకొని, స్వచ్చోద్యమ కారులతో ఫోటోలు దిగి, తమ తమ గ్రామాలలో అవసరమైన శ్రమదాన చర్యల్ని ఎంత మేరకు ఎలా నిర్వహించాలో చర్చించుకొని కొందరు నిర్ణయాలకు గూడ వచ్చి, ప్రకటించారు కూడ!

 

ఈ లోకంలో సమయాన్ని గడిపేందుకెన్నో మార్గాలు! సినిమాలు, టీ.వీ లు, హాయ్ ల్యాండ్ లు, రాజకీయాల మీద చర్చోపచర్చలు, వ్యాపారాలు! ఇవన్నీ కాదని 100 కిలోమీటర్ల దూరం నుండి వచ్చి, రోజంతా సామాజిక కర్తవ్యాన్ని చర్చించే ఈ 30 మంది మాత్రం భిన్నమైన ప్రయోజనకరమైన వ్యక్తులే  కదా!

 

నల్లూరి రామారావు,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

23.01.2021.