కుంచించుకుపోతున్న చల్లపల్లి డంపింగ్ యార్డు....           05-Oct-2021

 

కుంచించుకుపోతున్న చల్లపల్లి డంపింగ్ యార్డు

          చిల్లలవాగు ఒడ్డున ఉన్న శ్మశానం, చెత్త నిల్వ కేంద్రంలు (డంపింగ్ యార్డు) అధికారుల, ప్రజాప్రతినిధుల సహకారంతో స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తల కృషితో ఏర్పాటు చేయబడింది.

          చల్లపల్లి గ్రామానికి ఈ డంపింగ్ యార్డు పెద్ద ఎస్సెట్.

          గ్రామాలలో చెత్త నిల్వ కేంద్రాల (డంపింగ్ యార్డు) సేకరణ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు పెద్ద సమస్య. మా దగ్గర వద్దంటే మా దగ్గర వద్దు అని ప్రజలు తమ నివాసాల వద్ద ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. చాలా గ్రామాలలో చెత్త నిల్వ కేంద్రం కోసం స్థల సేకరణ సాధ్యం కానేకాలేదు. గన్నవరం మండలం సావర గూడెం ప్రజలు తమ గ్రామంలో పెట్టిన డంపింగ్ యార్డుకి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు. వేరే ఊరి వాళ్ళ చెత్తను మా ఇళ్ల దగ్గర ఎందుకు వేస్తారు? అని వారి ప్రశ్న.

          ఈ నేపధ్యంలో చల్లపల్లికి వరం మన డంపింగ్ యార్డు.

 

          ఊరికి దూరంగా ఉండడంతో ఎంతో సౌకర్యంగా ఉంది.

సమస్య :

          కానీ ఇప్పుడు ఇళ్ల స్థలాలను డంపింగ్ యార్డు ప్రక్కనే కేటాయించడం వలన చల్లపల్లి కి కూడా ఇది పెద్ద సమస్య కాబోతోంది.        

 

          20 వేల మంది ప్రజలున్న ఈ గ్రామం నుండీ వచ్చే చెత్తకు ఇప్పుడున్న స్థలమే సరిపోవడం లేదు. ముందు ముందు వక్కలగడ్డ, చిట్టూర్పు, లక్ష్మీపురం, పాగోలు గ్రామాలలో కొన్నింటిని కలిపి చల్లపల్లిని  నగరపాలికగా చేయవచ్చు. అప్పుడైతే డంపింగ్ యార్డుకు మరల స్థల సేకరణ పెద్ద సమస్య అవుతుంది.

          ఇప్పుడున్న కాస్త స్థలంలో కూడా ప్రక్కనే ఇళ్ళు రాబోతున్నాయని కనుక అటువైపు చెత్త వేయవద్దని అధికారులు చెబుతున్నారని తెలిసింది.

          డంపింగ్ యార్డు స్థలాన్ని ఇంకా పెంచవలసిన సమయంలో ప్రక్కనే ఇళ్ల స్థలాలు కేటాయించడం ముందు ముందు ఎన్నో సమస్యలకు దారి తీస్తుంది. అధికారులకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ ఈ సమస్యను పరిష్కరించడం పెద్ద సవాలవుతుంది. ఆ ఇళ్ల వారికి ఈ చెత్త నుండి వచ్చే వాసన భయంకరంగా ఉండి అభ్యంతరకరంగా ఉంటుంది.

కనుక...

          డంపింగ్ యార్డుకు ఆనుకొని ఉన్న స్థలంలో ఇళ్ళు కేటాయించకుండా వేరే ప్రదేశంలో స్థలాన్ని  సేకరించి వారికి కేటాయిస్తే గానీ ఈ సమస్యకు పరిష్కారం లభించదు.

          అధికారులు,

 

          ప్రజాప్రతినిధులు ,

          అన్ని రాజకీయ పార్టీలు,

          గ్రామ పెద్దలు -

          గ్రామ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని సరైన రీతిలో స్పందించి డంపింగ్ యార్డుకు మరింత స్థలాన్ని కేటాయించండి.

          లేదా

          డంపింగ్  యార్డు ప్రక్కన ఇళ్ళకు కాకుండా వేరే కార్యాలయాలకు గానీ, కర్మాగారాలకు గానీ కేటాయించడానికి కృషి చేయగలరు. అప్పుడు ఇళ్లకు, చెత్త నిల్వ కేంద్రానికి మధ్య బఫర్ జోన్ ఉంటుంది. ప్రజలకు ఇబ్బందులు ఉండవు.    

 

 

ఇట్లు

 

స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలు.

05.10.2021       

 

P.S :

 

 

          కలెక్టర్ గారు DPO గారి ద్వారా సమాచారాన్ని తెలుసుకున్నారు.

 

 

 

          RDO గారు కూడా మన డంపింగ్ యార్డును పరిశీలించి మన సమస్యను అర్ధం చేసుకున్నారు.  

ఇది మన డంపింగ్ యార్డు మన అవనిగడ్డ MLA సింహాద్రి రమేష్ బాబు గారి సహకారంతో చెత్త ట్రాక్టర్లు తిరగడానికి డంపింగ్ యార్డుకు మధ్యలో వేయించిన రోడ్డు. ఈ రోడ్డు లేకుంటే వర్షా కాలంలో పంచాయితీ చెత్త ట్రాక్టర్లు చాలా ఇబ్బంది పడి ఉండేవి. ఈ రోడ్డుకు కుడి ప్రక్కన ఉన్న స్థలం కూడ డంపింగ్ యార్దుదే. కానీ ప్రక్కనే రాబోతున్న ఇళ్లను దృష్టిలో పెట్టుకుని ఈ స్థలాన్ని వాడడం లేదు.
ఈ ప్రక్కనే ఇళ్ళు రాబోతున్నాయి.