కాశీభట్ల రఘునాధ శాయిబాబు గారు....           06-Feb-2022

ఆదివారం నాటి శ్రమదాన వేళ ఒక ఆసక్తికర సంఘటన.

 

అది వేకువ 4.45 సమయం! గ్రామ ప్రధాన కూడలిలో జరిగిన ఒక స్వచ్చోద్యమ వేళా విశేషం! (కొద్దిగా ధర్మ సంకటం కూడ!) అనివార్యంగా జరిగిన ఆ విశేషమేమంటే : 

 

          ఆయనది 71 ఏళ్ల వయసు! వృత్తి - చిరకాలంగా చల్లపల్లిలోని చాల వ్యాపార సంస్థల అకౌంట్ల నిర్వహణ! అతని ప్రవృత్తి సంగీత సాహిత్య శ్రవణానందం! విశేషించి గాన గంధర్వుడు ఘంటశాల గానామృతపానం! ఆపైన సమాజం పట్ల, ముఖ్యంగా తన గ్రామ సమాజ హితం పట్ల కొంత అభినివేశం! అందుకు పూనుకొనే ఎవరినైనా అభినందించే - ప్రోత్సహించే మంచి లక్షణం! ఆయనే కాశీభట్ల రఘునాధ శాయిబాబు. 

         

          30 ఏళ్లుగా చల్లపల్లిలో జనవిజ్ఞాన వేదిక కార్యక్రమాలన్నా, వైద్యశిబిరాలన్నా, ఎనిమిదేళ్లుగా ఎడతెగని ప్రజోపయుక్త స్వచ్చోద్యమమన్నా ఆయనకెంతో మన్నన! గ్రామ సౌకర్య కల్పన కోసం శ్రమిస్తున్న స్వచ్ఛ కార్యకర్తల పట్ల కాశీభట్ల వారికి ఎనలేని ఆరాధన! కాని, తనదేమో కార్యకర్తల్తో భుజం కలిపి శ్రమపడే వయసు కాదు! అందుకని తనకున్నంతలో ఉద్యమ ఖర్చుల కోసం తరచుగా ఆర్థిక సహాయం చేస్తుంటారు!

 

          సముద్రాల వారు వ్రాసి, ఘంటశాల అద్భుతంగా పాడిన (తెనాలి రామకృష్ణ చిత్రంలోని)

         

          చేసేది ఏమిటో చేసేయి సూటిగా - వేసేయి పాగా ఈ కోటలో.....

          నాటేది ఒక్క మొక్క - వేసేది రెమ్మ రెమ్మ 

          కొమ్మకొమ్మ విరగబూసి వేలాదిగా - ఇక కాయాలీ బంగారుకాయలూ  

          భోంచేయాలీ మీ పిల్లకాయలూ... 

          రహదారి వెంట మొక్క నాటి పెంచరా!

          కలవాడు - లేనివాడు నిన్ను తలచురా!.... 

అనే పాటంటే శాయిబాబు గారికి మరీమరీ ఇష్టం. స్వచ్ఛ కార్యకర్తలు గ్రామ వీధుల్ని, రహదారుల్ని వేల కొద్దీ పూల మొక్కల్తో, చెట్ల పచ్చదనంతో నింపే సన్నివేశాన్ని ఈ అకౌంటెంట్‌ గారు ఘంటశాల పాటతోనూ, 2,400 సంవత్సరాల నాటి అశోకుని ధార్మిక చర్యలతోనూ పోల్చి పులకించిపోతుంటారు. ఈ వేకువ సన్మానాలెంత వద్దని వారిస్తున్నా శాయిబాబు గారు వినక, పూలదండలతో కార్యకర్తల ప్రతినిధిగా డాక్షరు డి.ఆర్.కె. ప్రసాదు గారిని సన్మానించారు!

 

          చల్లపల్లిలో గాని, బైట దేశ విదేశాల్లోగాని, ఇలాంటి ఎందరో సహృదయులు, వదాన్యులు, అభిమానించి, ప్రోత్సహిస్తేనే గదా ఈ అరుదైన అద్భుతమైన చల్లపల్లి స్వచ్చోద్యమం ఇంతగా వికసిస్తున్నది!

         

          అందరూ మహానుభావులే! ఎందరికని మా వందనమ్ములు!

 

- ఒక సీనియర్‌ స్వచ్ఛ కార్యకర్త (నల్లూరి రామారావు)

 

   06.02.2022