ఒకానొక స్వచ్చ – సుందర ‘గస్తీ గది’ వేడుక.....           10-Mar-2022

 ఒకానొక స్వచ్చ సుందర గస్తీ గదివేడుక.

          ఈ బుధవారం (9-3-22) నాటి ఆహ్లాదమయ సాయంత్రం 6.00 నుండి గంట పాటు గంగులవారిపాలెం వీధి మొదట్లో జరిగిన ఒక చిన్న గది ప్రారంభం నిజంగానే ప్రత్యేక వేడుక! దాని వ్యయం ఒక డాక్టరమ్మదే కావచ్చు గాని ఆ క్లిష్టమైన నిర్మాణ పర్యవేక్షణ ఆమె మరిదిదే కావచ్చు గాని, దాని పరిధి మాత్రం చల్లపల్లి గ్రామ మంతంటిదీ! ఆ ఉత్సాహం ముఖ్యంగా స్వచ్చ శుభ్ర సౌందర్య ప్రియులైన గ్రామస్తులందరిదీ! మరీ ప్రధానంగా స్వచ్చ సుందర కార్యకర్తల నూతనోత్సాహమైతే చెప్పే పనే లేదు.

          తొమ్మిదేళ్ళ నాటి గంగులవారిపాలెం బాట దుర్భర దుస్థితి వేఱు - కనువిందైన పూలతో రంగు దీపాలతో - మనసుల్ని సమ్మోహనపరిచే పచ్చదనాలతో - జల నాట్యాలతో - సందర్శకుల తాకిడితో ఇప్పుడున్న పెళ్లికళ వేఱు! ఈ రహదారి నిరంతర పర్యవేక్షణకు, పరిరక్షణకు నిర్మించిన అన్ని హంగులున్న కుటీరానికైన ఖర్చుముఖ్యం కానే కాదు -  సర్పంచి, ఉపసర్పంచి, కార్యనిర్వహణాధికారి కొనియాడింది. ఇంత చిన్న కాపలా ఉద్యోగులకు అంత పెద్ద సౌకర్యం కల్పించాలనేసత్సంకల్పాన్నే!

          వందలాది స్వచ్చ కార్యకర్తల వేలాది రోజుల శ్రమదాన స్ఫూర్తే లేకుంటే - డాక్టర్‌ గురవారెడ్డి వంటి దాతల సౌజన్యమే దక్కకుంటే స్వచ్చ చల్లపల్లి గాని, అందులో ఈ తరహా వేడుకలు గాని ఊహించగలిగే వాళ్లమా? చల్లపల్లి గ్రామస్తుడు కాకున్నా, ఇక్కడ బిల్లు కలెక్టరుగా పనిచేసిన కంఠంనేని రామ బ్రహ్మం తన 71 వ జన్మదిన సందర్భంగా చల్లపల్లి అభివృద్ధి కోసం మనకోసం మనం” ట్రస్టుకు ఇచ్చిన 50 వేల విరాళం వెనుక కూడ గ్రామ సామాజిక స్వచ్చ - సుందర కర్తవ్యమే - సౌజన్యమే –  కనిపిస్తున్నది!

          చల్లపల్లిలో స్వచ్చ సుందరంగా తీర్చిదిద్దిన ఒక వీధిలో  గస్తీ గదిప్రారంభవేడుకలో పాల్గొన్న 60 మంది ముఖాల్లోని ఆనందమే గ్రామంలోని అన్ని వీధుల్లోను ఇక ముందు కనిపించాలనీ, ఒక వీధిని మించి మరొక వీధి ఆరోగ్యకరంగా ఆహ్లాదమయంగా వర్ధిల్లాలనేదే స్వచ్చ కార్యక్రమ సారధి డాక్టర్ డి.ఆర్.కె. మొదలు నేటి ప్రముఖుల వక్తల స్వచ్చ కార్యకర్తల ఆశయం!

 

          మన వీధికి గస్తీ గది’.

ఈ గది ముస్తాబు కొరకు ఇంత పెద్ద వేడుకా?

ఇది స్వచ్చోద్యమ ఫలితమ? ఇది గురవాభిరామమా?’

ఏ సదాశయ స్ఫురణకు ఈ గస్తీ గదిసూచిక?

ప్రతి వీధికి ప్రేరణగా - ఇదొక మచ్చుతునకా?

 

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   10.03.2022.