వీధి గస్తీ గది – మజ్జిగ పంపిణీ కథ!....           02-Jun-2022

 వీధి గస్తీ గది – మజ్జిగ పంపిణీ కథ!

          ఈ ఊళ్ళో కాక, ఇంకెక్కడైనా వీధి గస్తీ గది” అనేది ఉంటుందా? చల్లపల్లిలో మాత్రం గంగులవారి పాలెం వీధి, దానికొక సర్వాంగ సుందరమైన “గస్తీ గది” ఉండడమే గాదు – దానికి భూత – వర్త మాన – భవిష్యత్కాలాలలో ఒక మంచి చరిత్ర కూడ ఉంది!

 

          ఆ వీథి గత మొక అవాంఛనీయం – పూతి గంధహేయం - పగవాళ్లకి కూడ తటస్థించరాని దుర్భర దౌర్భాగ్యమైతే, భావి చరిత్ర ఇప్పుడే అనూహ్యం అనుకొంటే, వర్తమానం మాత్రం ఒక సజీవ శిల్ప సుందరం – నిత్య కళ్యాణం – పచ్చ తోరణం – అశేష జనాకర్షణం - అన్ని గ్రామ వీధులకూ ఆవశ్యకం – ఆదర్శం!

          మరీ - ఈ కార్యకర్తలకైతే గంగులవారిపాలెం వీధి మీద అమేయాభిమానం! ట్రస్టు కార్మిక సోదరులతో బాటు స్వచ్చ కార్యకర్తల శ్రమదానం, పర్యవేక్షణం ఈ వీధి స్వచ్చ పరిశుభ్రతలకూ,  సౌకర్య సౌందర్యాలకూ శ్రీరామరక్షలే!

          గత పక్షం రోజులుగా ఇక్కడి గస్తీగది కేంద్రంగా ఇంకొక క్రొత్త సందడి జరుగుతున్నది. ప్రతిరోజూ 10 15 - 20 మంది స్వచ్చ కార్యకర్తలు-వారిలో కొందరు మజ్జిగ దాతలు హాజరౌతారు, ప్రతి రోజూ  ఏడు- ఎనిమిది-తొమ్మిది వందల మంది దప్పిక గొన్న  బాటసారులకు కమ్మని - చల్లని - మజ్జిగ కడుపార తాగిస్తారు! మొహమాట పడే పాదచారుల్ని కూడా పిలిచి మరీ  మజ్జిగ ప్రదానం చేస్తారు!

          ఈ గురువార(2-6-22)మైతే మరొక ప్రత్యేకత! కేవలం మహిళా కార్యకర్తలే ఈ పంపకాన్ని చేపట్టారు! చల్లపల్లి స్వచ్చోద్యమంలోనే అనుకొంటే - ఈ గస్తీ గది దగ్గరి సందడిలోనూ ఈ రోజు వాళ్ళదే సాధికారత! ఒక సుభాషిణి తాజా మూలగకాయలిక్కడికి తెచ్చి పంచుతుంది; ఇంకొకామె పేరు అన్నపూర్ణట! అందుకని ఆమె ఈ ఉదయం రుచికరమైన పులిహోర తెచ్చి; చాల మందికి తినిపించి, తన పేరును సార్ధకం చేసుకొన్నది!

          దీనర్థం - ఈ కార్యక్రమంలో అస్సలు పురుషులే మాత్రం లేరని కాదు - ఒక తాతినేని రమణ, BSNL నరసింహుడు, కస్తూరి మెండు శ్రీనయ్యలు, వీళ్లకు మూల స్తంభంలాగా ప్రాతూరి శాస్త్రీజీ’.. ఉంటారనుకొండి!

          అసలీ ఈ ఉదంతమంతా నేను వర్ణించడమెందుకు? “జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యం” వాట్సప్ మాధ్యమం చిత్రాలే బాగా వర్ణించగలవు. ఏమైనా –

          ఈ స్వచ్చ సుందర పల్లి మహిళామణులకు అభివందనం!

          అద్భుతమైన మజ్జిగ పంపిణీ సూత్రధారులకు ఆవిఘ్నమస్తు!

          ఈ సుదీర్ఘ కాల సుమసుందర – శ్రమబంధుర సేవా స్ఫూర్తికి అభ్యుదయ పరంపరాభివృద్ధిరస్తు!  

          ఓం తత్సత్!

         

- నల్లూరి రామారావు,

   విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త

  02.06.2022.