మన స్టీలు గ్లాసును మనమే తీసుకెళ్దాం....           02-Feb-2020

 ఎంతోమందికి ఎన్నోసార్లు 'ఒక్కసారికి మాత్రమే వాడి పారవేసే ప్లాస్టిక్ వస్తువులు 'ఏవీ వాడవద్దని చెప్తున్నా అనేక మంది మానడం లేదు.

 

బాగా చదువుకున్న వారు, అర్ధం చేసుకోగలిగిన వారు కూడా వేడుకలన్నింటిలో ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ విస్తరాకులు, ఫ్లెక్సీలు,క్యారీబాగులు ,నీళ్ళ సీసాలు వాడడం ఇంకా మానడం లేదు.

 

ఇటీవలే రెండు వేడుకలకు నేను హాజరయ్యను. అవి సన్మాన సభలు. అందరూ శాలువా గానీ, దండ గానీ ప్లాస్టిక్ కవర్లో తీసుకువచ్చి కవర్ను అక్కడే పారవేసి శాలువా కప్పి, దండ వేసి వెళ్లిపోతున్నారు. ఫ్లెక్సీలు మామూలే ! అలాగే భోజనాలలో ప్లాస్టిక్ గ్లాసులు యథేచ్ఛగా వాడడం జరిగింది.

 

అందుకని నేను ఇకనుండీ ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను ఎక్కడికి వెళ్లినా నా గ్లాసు, నా స్టీలు పళ్లెం ,స్టీలు నీళ్ళ సీసా తీసుకెళ్లి అక్కడ ప్లాస్టిక్ గ్లాసులు వాడుతుంటే ఆ ప్లాస్టిక్ గ్లాసు కాకుండా నా స్టీలు గ్లాసులో నేను మంచినీళ్లు తాగడం, ఒకవేళ ప్లాస్టిక్ విస్తరాకు గానీ ,తగరం విస్తరాకు గానీ పెడితే నా స్టీలు పళ్ళెంలో భోజనం చేసి కడుక్కొని రావడం ,ప్లాస్టిక్ సీసాలలో మంచి నీరు ఇస్తే నా స్టీలు సీసా లో నీళ్ళనే తాగడం అనే పద్ధతి పెట్టుకుందామనుకున్నాను.

 

ఈరోజు మొట్టమొదటి సారిగా నేను తీసుకెళ్లిన స్టీలు గ్లాసును ఉపయోగించడం జరిగింది.

 

మిత్రులందరకూ - ముఖ్యంగా స్వచ్చోద్యమకారులకు, పర్యావరణ పరిరక్షణకు పాటుపడే వారందరికీ నా మనవి...

-ఇలా చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి.

మీ సలహాలు కూడా చెప్పండి

 

- దాసరి రామకృష్ణ ప్రసాదు

చల్లపల్లి - 02.02.2020.