ఊరి ఉమ్మడి శాశ్వత సౌకర్యార్థం మరొక మంచి ప్రయత్నం!....           31-Jul-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను మానేద్దాం!

ఊరి ఉమ్మడి శాశ్వత సౌకర్యార్థం మరొక మంచి ప్రయత్నం!

            అది పద్మావతి ఆస్పత్రి ప్రాంగణంలోని ముచ్చట్ల కొలువులో నిన్న - 30.7.22 సాయంత్రం 4.30 - 6.00 నడుమ వచ్చిన ఒక శుభ సంకల్పం! ఎప్పటికప్పుడు తమ ఊరి మెరుగుదల కోసం సాధ్యమైనంత చేయూతకు సంసిద్ధంగా ఉండే వితరణశీలురూ, ఎన్ని వేల రోజులైనా ఊరి జనం బాగు కోసం కష్టించే స్వచ్ఛ కార్యకర్తలూ కలిసిన ఒక నిర్ణయాత్మక సమావేశం! ఇందుకు చొరవ గ్రామ సర్పంచి గారిది; నిర్వహణ పద్మావతీ - రామకృష్ణ వైద్యుల వారిది!

            దేశంలోని అత్యధిక గ్రామాలను వేధిస్తున్న సమస్యేమంటే - సగౌరవంగా బ్రతికిన తమ వారికి సలక్షణంగా అంతిమ వీడుకోలు సంస్కారం చేసుకొనేందుకు అవకాశమివ్వని దుస్థితిలో ఉన్న శ్మశానాలు! ఏదో మన చల్లపల్లిలో అంటే గ్రామ పెద్దలు కలలు కని, స్థానిక - స్థానికేతర దాతృత్వాలతోనూ, వర్ణింపనలవి గాని స్వచ్ఛ కార్యకర్తల శ్రమదానంతోనూ ఒక అద్భుత శ్మశానం వెలసింది. భవిష్యత్తులో ఈ ఊరి జనాభా ఏ 50 – 60 వేలకో పెరిగితే ఈ రుద్ర భూమి అప్పటి అవసరానికి చాలదే!

            అదృష్టవశాత్తూ 1 వ వార్డు ప్రక్కన 1 యకరం 26 సెంట్ల హిందు శ్మశానవాటిక ఉన్నది గాని - అది బొత్తిగా సౌకర్యాలు లేని, సరైన బాట కూడ లేని, గతించిన పెద్దల తుది గౌరవనీయ ప్రస్థానానికి తగనిది!

            నిజానికి ఇలాంటి మంచి పనిలో ఊరిలోని 5000 ఇళ్ల వారు ఏదోవిధంగా భాగస్వాములు కావాలి. చల్లపల్లిలో అలాంటి సహకారం లేదని కాదు గాని, అది చాలడం లేదని కొందరి బెంగ! ఆ బెంగను తీర్చే శుభ సూచనలు శనివారం నాటి పై సమావేశంలో కనిపించడం ముదావహం!

            ఒక దృఢ సత్సంకల్పం ఉంటే అసాధ్యమనేదే ఉండదని చిల్లలవాగు గట్టు మీద సర్వాంగ సుందరమైన రుద్రభూమి నిరూపించింది. అది మరొక మారు పునరావృతమయేందుకు తమ వంతుగా ఆర్థికబలాన్ని - అంగబలాన్ని ప్రకటించిన గ్రామ ప్రముఖులకూ, ఊరి మేలు కోసం నిరంతర శ్రమ రాక్షసులైన స్వచ్ఛ కార్యకర్తలకు అభివందనాలు!

            ఇప్పటికే ఈ మహత్కార్యానికి 10 లక్షలకు పైగా విలువైన తమ సహకారాన్ని ప్రకటించిన సజ్జా వేంకటేశ్వర - చలపతి సోదరులున్నారు! ఏ మంచి పనైనా సత్సంకల్పంతోనే మనిషి శ్రమతోనే సాధ్యమౌతుంది గదా!

 

- నల్లూరి రామారావు,

  విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

  31.07.2022.