అరుదైన స్వచ్చ – సుందరీకరణ కోసం ఎనిమిదేళ్ల ప్రస్థానం!....           01-Nov-2022

 అరుదైన స్వచ్చ – సుందరీకరణ కోసం ఎనిమిదేళ్ల ప్రస్థానం!

          కల్పనల కంటే కొన్నిమార్లు యదార్థ సంఘటనలే వింతగా, నమ్మశక్యం కానివిగా, దిగ్భ్రాంతికరంగా ఉంటాయంటే చాల మంది ఒప్పుకోరు గాని, అలుపెరగని, పస తగ్గని చల్లపల్లి శ్రమదానాన్ని చూసి - పాల్గొనీ మేము మాత్రం నమ్మక తప్పలేదు.

          ఎనిమిదేళ్ల ప్రయాణం – రోజూ సగటున 30 మంది కార్యకర్తల శ్రమ దానం - లక్షల పని గంటల శ్రమార్పణంతో అనివార్యంగా మెరుగైన గ్రామం - ఇవన్నీ ఈ చెడుకాలంలో – ఒక చల్లపల్లిలోని అఘటన ఘటనా సంతోషాలు!

          కాలానికి ఎదురీదిన అలాంటి సంఘటనలకు తగ్గట్లు గాను, దీటు గాను విలక్షణం గాను జరిగినదే 29-10-22 మధ్యాహ్నం 3.30 - 7.30 నడుమ జరిగిన స్వచ్ఛ సుందరోద్యమం ఎనిమిదో వార్షికోత్సవం! ఈ విజయోత్సవ సభకొక అధ్యక్షుడూ లేడు – ఏ సాంప్రదాయక పడికట్టు పద్ధతులూ లేవు!

          ఒక దరిద్రాతి దరిద్రమైన - ఇప్పటి ఆదర్శప్రాయమైన గంగులవారిపాలెం వీధిలో అరగంట పాటు అరుదైన రెండు మూడు సన్నివేశాలు: ఒకటి – మనకోసం మనం ట్రస్టుకు మూలకారకుడూ, అధ్యక్షుడూ, రాజ పోషకుడూ ఐన వ్యక్తి గౌరవార్థం ఏర్పరచిన “గురవాభిరామం నామ ఫలకాన్ని అతడే ఆవిష్కరించి, ఆశ్చర్యచకితుడు కావడం, రెండు – డప్పుల నాట్యంతో 110 మందితో సభా స్థలిదాక జరిగిన నడక వేడుక, మూడు - అనితర సాధ్యమైన చిట్టూర్పు బృందం కళా విన్యాసాలు.

          5.15 – 7.35 మధ్యకాలం ఎలా గడిచిందో తెలియనంత ఉత్సాహంగా, కొన్ని మార్లు ఉద్వేగంగా, కాస్తంత నాటకీయంగా - మొత్తం 7 గురు ప్రసంగించిన - ఇంకో 100 మంది ఆస్వాదించిన – స్వచ్చోద్యమాభిలాషులు సంవత్సరాల తరబడి గుర్తుంచుకోదగిన పద్ధతిలో జరిగిన వారికోత్సవ సభ -

          ఇలాంటి విలక్షణ సమావేశ నిర్వహణలో గురి తప్పని డాక్టర్ DRK మెలకువలూ - వివరణలూ, లోక ప్రసిద్ధమైన గురవారెడ్డి చలోక్తులూ – జీవన తాత్త్విక పునాదులూ, శ్రోతల్ని ఉత్సాహపరిచిన దాసి సీతారాముని చెణుకులూ, దైవభక్తి మరవని మాజీ DSP గారి మాటలూ, అడపా గురవయ్య వక్కాణింపులూ, పంచాయితీ సర్పంచుల ధన్యవాదనలూ, శ్రవణానందంగా భార్గవి డాక్టరమ్మ గానమూ, ఒక ZPTC - మెడబలిమి గారి నిష్కల్మషాంతరంగ ఆవిష్కరణమూ....

          ఇలా చెప్పదలచుకొంటే ఎన్ని విశేషాలైనా అక్కడ జరిగాయి! అసలు ఆ సభ స్థాయే వేరు – దాని స్వభావమే వేరు - ఎదురుగా కూర్చొన్న స్వచ్ఛ కార్యకర్తల వైఖరే వేరు! చూసి - పాల్గొంటే తప్ప వేకువ 4.00 కి జరిగే శ్రమదనాన్ని ఎవ్వరూ నమ్మనట్లే - ఇలాంటి విలక్షణ సమావేశాల్ని మెచ్చని వాళ్లూ ఉండవచ్చు. కాని తరచుగా గాడి తప్పుతున్న సమాజ గమనాన్ని సరిజేసేందుకూ, ఆచరణ పూర్వక సందేశాన్ని చాటేందుకూ ఇలాంటి పొల్లూ, సొల్లూ లేని వార్షికోత్సవ సభలు జరగక తప్పదు!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   01.11.2022.