మూడేళ్ళ నాటి మధుర స్మృతి....           14-Mar-2023

 మూడేళ్ళ నాటి మధుర స్మృతి

            నిన్న – 13.03.2023 రోజున ప్రపంచ స్థాయి సినిమా అవార్డు మన తెలుగు భాషకు దక్కిందనీ, లాస్ ఏంజలస్ నగరం వేదికగా “కనుకుంట్ల సుభాష్ చంద్రబోస్” అనే సుప్రసిద్ధ సినీ గేయ రచయిత ఆ గౌరవానికి ముఖ్య కారకుడనీ, తెలిసి యావద్దేశమూ – ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు – మరీ ముఖ్యంగా చల్లపల్లి స్వచ్చ కార్యకర్తలతో పాటు గ్రామ ప్రజానీకమూ సంతోషంతో ఉప్పొంగిపోయారు.

            అందుక్కారణం  ఆ సంచలన రచయిత 17.11.2019 న చల్లపల్లి వచ్చి రెండు గంటలు అశేష జనవాహిని సమక్షంలో అరుదైన – సుదీర్ఘ స్వచ్చ సుందరోద్యమాన్ని తన వాక్చాతుర్యంతో, సంగీత సాహిత్యాలతో సమాదరించడం! సహజంగానే మూడున్నరేళ్ళ నాటి ఆ ప్రజ్ఞాశాలి సాన్నిహిత్యాన్ని అందరమూ గుర్తు చేసుకున్నాం.

            ఇలాంటి కొన్ని గౌరవాలు కొంత పరిమితస్థాయిలో తెలుగు సినీ సాహిత్యానికి దక్కక పోలేదు. అందులో తొలి గౌరవం మహాకవి శ్రీశ్రీ “తెలుగు వీర లేవరా! దీక్షపూని సాగరా” అనే పాటకు దక్కితే మలి పురస్కారం వేటూరి సుందరరామమూర్తి “వాలిపోయే ప్రొద్దా నీకు వర్ణాలెందుకే?” అనే గేయానిది. మూడవ మారు సుద్దాల అశోక్ తేజ రాసిన నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను” అనే పాటకుసైతం జాతీయ బహుమతి వచ్చింది.

            ప్రపంచ సినీ సాహిత్యంలో తన నాటు తెలుగు భాషను ప్రయోగించి “నాటు – నాటు వీర నాటు” పాటతో  అంతర్జీతీయ సినీ సాహిత్యంలో తెలుగు వాడి సాహిత్య పతాకాన్ని ఎగురవేసిన కనుకుంట్ల సుభాష్ చంద్రబోస్ కవికి మనసారా మన అభినందనలు.

- స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్తలందరి తరపున

   డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

   14.03.2023.