2781* వ రోజు....... ....           28-May-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుటేల?

42 మందికి సంతృప్తిపదమైన 2781* వ శ్రమదానం!

          ఆదివారం (28.5.23) కావడంతోనూ - ఇతర కారణాల వల్లనూ ఈ వేకువ గ్రామ సామాజిక సేవకుల సంఖ్య మళ్ళీ 42 కు చేరింది! అది కూడ 4.15 వేళకు 17 గానూ, కాలక్రమాన 40 కి పై గానూ! వాళ్ల కార్య రంగం 6 రోజు కూడ వడ్లమర వీధే!

          ఎన్ని పనులున్నా - కనీసం ఆదివారమైనా ఊరి బాధ్యతలు నెరవేర్చే నియమ నిష్టలు కొందరు కార్యకర్తలవి!

          ఇక - ఈ ఆదివారమైతే మనకోసం మనం ట్రస్టు’ సభ్యురాలూ – నిన్న మొన్నటి దాక దుబాయి నివాసినీ, రేపోమాపో అమెరికా ప్రవాసినీన దాసరి స్నేహ ప్రస్తుతానికి చివరి శ్రమదాన అవకాశంగా, పుత్త్రునితో సహా వీధి పారిశుద్ధ్య కృషికి దిగడం మరొక కారణం!

          ఇలాగే - మరి కొందరి హాజరీ కారణాలు! యార్లగడ్డ గ్రామ స్వచ్చోద్యమ ఆవిష్కర్త తూము వేంకటేశ్వరునిది తన ద్వితీయ కుమార్తె (తెనాలిలో) వివాహానికీ, 6 తేదీ – R.K. కన్వెన్షన్ హాలులో వధూవరుల పరిచయ వేదికకూ ఆహ్వానం!

          చల్లపల్లి స్వచ్ఛ సుందరోద్యమ కురు వృద్దుడొకాయన - ఎక్కడో కన్నడ - దావణగెరె నుండి వీడియో కాల్ తో నేటి కార్యక్రమంలో పాల్గొనడం!

          ఇంతా జేసి - 40 మంది చిన్నా పెద్దా కరుడు గట్టిన - ముదురు కార్యకర్తలు గంటన్నర పాటు భారత లక్ష్మి వడ్లమ వీధిలో ఏం ఒరగబెట్టారూ ఏం మాటాడుకొన్నారూ - చేస్తున్నవి మురుగు మొరటు - పనులైనా, ఉక్కపోతలోనైనా, ఎలా ఆనందించారూ అని ఆరా తీస్తే:

- నేను గమనించిన తొలి విశేషం ఆ కొద్దిపాటి వీధి మరీ ఇరుకై పోయింది - గుంపెడు కార్యకర్తల వల్ల!

          40 మంది కార్యకర్తలూ, డిప్పలూ, పలుగూ పారలూ, రైల్వే పారలూ, చెత్త ట్రాక్టరూ - చల్లపల్లికే ప్రత్యేకమైన పని సందడీ మైకు పాటలూ - ఎడనెడా కొందరి చతురోక్తులూ అసలిలాంటి ప్రజోపయుక్త శ్రమ సందడి కోసమే గదూ ఇందులో సగం మంది వేకువ 3.00 కే మేల్కొనేది?

- నా మాటలు అతిశయోక్తులనో, మరీ నాటకీయత (డ్రమటిక్ వర్ణన) లనో అనుకోకపోతే గ్రా మెరుగుదల కంకణబద్ధులైన కొందఱు కార్యకర్తలు పగలు కూడ శ్రమదాన కార్యక్రమాన్ని గుర్తుచేసుకొంటూనే ఉంటారు!

నేటి మహనీయ సామాజిక బాధ్యతా మూర్తుల్లో :

- ఎవరే పనిలో ఎంత నిబద్ధత చూపి, నిపుణత ప్రదర్శించి,

- నిన్నటి మినీ ఉద్యాన శేష భాగాన్ని శుభ్రపరిచారో,

- మట్టి గిన్నెలు మోసి, రోడ్డు అంచుల మన్నికకు హామీ నిచ్చారో,

- పూల మొక్కల్నే సుందరీకరించారో,

- ఒక పెద్ద ట్రక్కును వ్యర్ధాలతో నింపారో,

- ఒకరిద్దరు తమకు తెలీకుండానే కార్యకర్తల కష్టాన్ని కవితాత్మకంగా వెల్లడించారో.....

వడ్లమర గేటు ఎదుట నెలకొన్న సమీక్షా సభలో :

1) అమెరికా ప్రయాణమౌతున్న వల్లభనేని అర్నవ్ ముమ్మార్లు స్వచ్చోద్యమ నినాదాల్ని వల్లిస్తే -

2) నేను రోజూ వ్రాస్తున్న స్వచ్ఛ సుందరోద్యమ విశేషాల్నీ, సదుద్దేశాన్నీ - సూటిగా, తేటగా, సుత్తి లేకుండా దాసరి స్నేహ రెండే నిముషాల్లో వివరిస్తే

3) RMP శేషు కార్యకర్తల గంటన్నర శ్రమను మరపించే పాట పాడి,

4) తూము వారి నుండి మేనేజింగ్ ట్రస్టీ 5000/- విరాళం స్వీకరించగా,

5) బుధవారం నాటి మన శ్రమవేదిక 1 వార్డు - హాస్టల్ ప్రదేశమని నిర్దారించారు.

          హిమాలయము నెక్కు టేల?

హిమాలయము నెక్కు టేల? తల క్రిందుగ తపస్సేల?

సుద్దులెన్నొ చెప్పుటేల – పెద్ద పెద్ద పదవు లేల?

కనిపించిన గ్రామానికి గంట పాటు సేవ చేసి

స్వచ్ఛ – శుభ్ర – సౌందర్యం సాధించుట మిన్న కాద?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   28.05.2023.