2783* వ రోజు....... ....           30-May-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా?

ఒక విస్పష్ట లక్ష్యం దిశగా 2783* వ అడుగు!

          ఈ మంగళవారం (30-5-23) వేకువ - ఊరికి దూరంగా - గంగులవారిపాలెం ప్రక్కన జాతీయ రహదారి చెంతనే మళ్లీ 4+1 మంది రెస్క్యూదళం వారి పని మొదలయింది - 4.30 కే!

          పనిభారం మోస్తున్నది వేళ్ల మీద లెక్కపెట్టేంత మందే కావచ్చు - పని కూడ బట్ట నలగని - అందరూ మెచ్చనిది కాదు; ఎవరిదో ఇల్లు తొలగించిన రాళ్లు - సిమెంటు ఇసుక - మట్టి ధూళి మిశ్రమ౦ గుట్టను ఊరి అవసరం కోసం 2 కిలోమీటర్లు తరలించి, సర్దే కఠిన శ్రమే!

          ఇలాంటి నిస్వార్థ - ప్రజాపయోగ కృషి దూరంగా ఉండి చూసే వాళ్లు మాట వరసకు మెచ్చుకొని వదిలేసేది కావచ్చు గాని - ఉక్కపోత మండు వేసవిలో - రద్దును వెతుక్కుంటూ వెళ్లి, గంటన్నర శ్రమించే వాళ్లకే తెలుస్తుంది కష్టమంటే ఏమిటో!

          వేల నాళ్లుగా వాళ్లతో ఉండి, వారి చెమట - దుమ్ము - బురద బట్టల్నీ, అననుకూల వాతావరణంలో వాళ్ల పట్టుదలనీ, తెగువనీ ప్రత్యక్షంగా చూస్తున్న - పాల్గొంటున్న నావంటి వాళ్లకు కొంత తెలుస్తుంది ఆ కఠిన శ్రమ విలువేమిటో!

          మరి ఈ కొద్దిమంది కార్యకర్తలే - డ్రైనులోకి జారిన రద్దును పైకి మోసి, ట్రక్కులో నింపుకొని, గ్రామ కేంద్రకంలోని సచివాలయం దగ్గరి పల్లాన్ని పూడ్చి, చిన్న కార్ల నిలుపుదల సౌకర్యం కలిపిస్తున్నది!

          6.20 కి రెస్క్యూ వీరుడైన మాలెంపాటి అంజయ్య గ్రామ స్వచ్ఛ - సుందరోద్యమ నినాదాలు విన్పించాయి!

          రేపటి కార్యకర్తల వీధి పారిశుద్ధ్య కృషిలో మార్పు లేదు 1 వ వార్డు - బాలికల వసతి గృహం దగ్గర నుండే!

          శ్రమదాన ప్రయోగశాల

చల్లపల్లి స్వచ్ఛంద శ్రమదాన ప్రయోగశాల

సదాచరణ పాఠశాల - శ్రమ వేడుక కళాశాల

సామాజిక బాధ్యతల విశాల విశ్వవిద్యాలయ

ఈ శతాబ్ది అవసరాలకీ ఊరొక చంద్రశాల!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   30.05.2023.