2785* వ రోజు....... ....           01-Jun-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుటేల?

స్వచ్చోద్యమ  పనిదినాల సంఖ్య నేటికి 2785*

          ఇది గురువారం - జూన్ మాసపు(01.06.2023) తొలివేకువపాల్గొన్న పనిమంతులు 24 మంది; 4.19 నుండి 6.06 సమయం 1 వ వార్డుకు చెందిన బాలికల వసతిగృహం, శ్మశానవాటిక దారులుఅన్నిరకాల చెత్తలు కలిపి పెద్ద ట్రక్కు నిండుగా! వసతి గృహ సిబ్బందో - సమీప గృహస్థులో- ప్రక్కన గొడ్ల చావిళ్ల వారో - అటుగా పయనించిన సుమారు వందమందో... ఏ ఒక్కరూ తమ ఊరి వార్డు బాగుదల శ్రమదానంలో వ్రేలుపెడితే ఒట్టు!

          సమీప వార్డు మెంబరులేమైరిభక్తులెందుకు పట్టించుకొనరు? ఈ రెండు డజన్ల మందే 20 వార్డుల్లోని వీధుల - డ్రైన్ల మంచి చెడులకూ, హరిత సౌందర్యాలకూ బాధ్యులా?

1) జమ్మి లంకమ్మ గుడి దాక - శ్మశాన వీధి పార్శ్వాలను- అందలి ముళ్ల మొక్కల్ని, పేడ- పెంటల్నీ, చౌక మద్యం సీసాల్నీఊడ్చీ- తొలగించి ఏరిన శ్రమ సౌందర్యజీవనులూ,

2) రెండు పెద్దగేట్ల ఎదుట అన్ని కశ్మలాలను ప్రోగులు చేసి గడ్డి పెరికి, పూల మొక్కల జోలికి పోక క్షుణ్ణంగా బాగు చేసిన ధన్యులూ,

3) 3-4 కిలోమీటర్ల దూరాన్ని దాటుకొని, వేకువనే వచ్చి ఈ చల్లపల్లి వీధి స్వచ్ఛతకు పాటుబడిన కార్యకర్తలూ,

4) వయో సమస్యల్ని గణింపక -చాతనైనంతగా పాటుబడుతున్నపెద్దలూ, మహిళలూ నేటి 24 మందిలో ఎవరు చిరస్మరణీయులు కారు?

 గలీజు విషయంలో ఒకప్పుడు మొదటిస్థానం కోసం గట్టిగా పోటీపడిన నరక ప్రాయంగా మిగిలిన  తుప్పలతో, పొదల్తో కాలి బాటగా మారిన ఈ ప్రాంతం ఇప్పుడింత కనువిందు చేస్తున్నదంటే స్వచ్చ కార్యకర్తల నిరంతర శ్రమ వల్లేగదూ?

"కింగ్ లీర్" అనే నాటకంలో షేక్స్పియర్ అంటాడు – “ కృతజ్ఞతా? విశ్వాసమా? అవెప్పుడో మనుషుల్ని వదలి జంతువుల్లోకి వెళ్లి పోయాయి...

          మరి చల్లపల్లిలోని కొందరు గ్రామస్తుల సంగతీ అంతేనాతొమ్మిదేళ్ల స్వచ్ఛ సుందరోద్యమానికి వాళ్లు సాక్షీభూతులు గా తప్ప భాగస్తులు కాజాలరా? ఒక సదుద్దేశ పూర్వక మైన-సమంజసమైన సత్కార్యాన్ని గురించి చర్చించరా? తర్కించరా

          6.06 కాలం దాక శ్రమించి - చెమటలు చిందించి, కొందరైతే మరీ అలసి, మొత్తానికి పని విరమణ సూచక ఈల మోత్రకు వెంటనే స్పందించారు.

          5 రోజులుగా బెంగాలును సందర్శించి, వస్తూనే కార్యకర్తలందరికి 'రసగుల్లా 'లను తెచ్చి పంచిన యద్దనపూడి మధు ఈనాటి గ్రామ స్వఛ్ఛ- సుందరోద్యమ నినాద ప్రవర్తకుడు!

          అందరి ఆమోదంగా రేపటి వేకువ మనం కలిసిశ్రమించవలసిన చోటు - ప్రభుత్వ బాలికల వసతిగృహం ద్వారం నుండే!

      బహుపరాక్ ఓ కార్యకర్తా!

చెత్తలేరే - వీధులూడ్చే శిష్టులిందరి ప్రయత్నానికి

మురుగు తోడే- వల్లకాడులు శుభ్రపరచే ఉద్యమానికి

ఖర్మకాదిది సమాజం యెడ బాధ్యతను కొను సుమనస్కులకూ

బ్రహ్మకాలపు యజ్ఞమునకూ బహుపరాక్ ఓ కార్యకర్తా !

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   01.06.2023.