2788* వ రోజు...........           04-Jun-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వద్దనే వద్దు?

2788* వ వేకువ స్వచ్చ కార్యకర్తల చొరవ!

        అది చొరవో తెగువోగాని కార్యకర్తలు మొత్తం 35 మంది. ఆదివారం (4.6.23) కావడమూ – శుభ కార్య క్రమాలు లేక పోవడమూ కారణాలేమో తెలీదుగాని ఇందరు కష్ట జీవులు హడావుడి పడక తాపీగా, స్థిమితంగా కళాశాల ముఖ ద్వారం నుండి  సన్ ఫ్లవర్ / మునసబు వీధి దాకా - బందరు దారి కిరు ప్రక్కలా నచ్చిన విధంగా శుభ్ర పరుచుకు పోయారు.

          అంటే - దానర్థం ఊడుస్తుంటే నాలుగ్గజాలెత్తునదుమ్ము లేవ లేదని కాదు, మురుక్కాలువల్నుండి వందలకొద్దీ   మద్యంఖాళీ సీసాలూ,ఎంగిలి విస్తర్లూ, త్రాగి పడేసి-నానిన కొబ్బరిబొండాలూ, ప్లాస్టిక్ సంచులూ బైటకు లాగ లేదనీ కాదు,  రకరకాల వ్యాపార-తోపుడు బళ్ళచాటుమాటున గలీజులు డిప్పల కొద్దీ లాగలేదనీ కాదు!

 

          ఆ గంటన్నర కాలపు నిస్వార్థ శ్రమ జీవులదీర్ఘకాల - సుదీర్ఘ లక్ష్యం దిశగా పడుతున్న 70 అడుగుల్నీ, వీధి పారిశు ద్ధ్యంలో క్రమశిక్షణనీ, చెమటలు క్రక్కుతూ-మంచినీళ్లు త్రాగుతూ - నేటి స్వయం నిర్దేశిత గమ్యం చేరుకొంటున్న కాయకష్టంలోని విశిష్టతనీ నేను శ్రద్ధగా పరిశీలిస్తూనే ఉన్నాను!

 

ఈ రహదారి భాగమే వెడల్పాటిది- పేవర్ టైల్స్ పరిచి మరింత సువిశాల మయింది - ఇంత పెద్ద బాట నిండా సహజంగా దుమ్మూ ధూళి పడొచ్చు.  కాని దారి రెండు అంచులు నాలుగైదడుగుల మేర ఇసుక పరుచుకోవడ మెందుకో? ఆ ఇసుకను బలంగా ఊడ్చి - అందుకు ఇద్దరు రెండేసి చీపుళ్లనొకే మారు వాడుతున్న వైనమూ –

          విజయలక్ష్మి మెడికల్స్ ఎదుటా, SBI  ఎదుట, ట్రాన్స్ఫార్మర్ దగ్గరా, అంతకన్నా మించి శ్రావ్య ఆస్పత్రి బైటా రాళ్ళూ రప్పల నడుమ 15మంది శ్రమ ఏ పాటిదో – ఫలితంగా ఆ చోటు లిప్పుడెట్లున్నాయో – Better late than never (షేక్స్పియర్ ) అన్నట్లు పరిశీలించండి!

 

          ఏపాతికవేలో జనాభా కల ఈ ఊరికి - ఈ20 కి పైబడిన వార్డుల శుభ్ర సౌందర్య నిర్వహణకు - ఈ 50-100 మంది శ్రమదానమే ఈ మాత్రం పనికొస్తుంటే - ఇంటికొక్కరు చొప్పున-వంతులవారీగా ఏ 2-3 వందల మంది కార్యకర్తలో పాటుబడగలిగితే - అప్పుడిక చల్లపల్లి స్వచ్చ -శుభ్ర- హరిత- సౌందర్యాల పరిస్థితేమిటో కాస్త ఊహించండి!

గంటన్నరపాటు  ప్రయత్నించగలిగినంత ప్రయత్నించాక- తగిన సంతృప్తి లభించాక - 6.05కు పని విరమించిన 35 మంది (ట్రస్టులో కొందరితో సహా) కార్యకర్తలూ శ్రావ్య ఆస్పత్రి ఆవరణలో అర్థవలయంగా ఏర్పడి, ధ్యాన మండలికి చెందిన (ITC ఉద్యోగి కూడ) నాయుడు మోహన్ ప్రకటిత స్వఛ్ఛ-సుందర సంపాదక నినాదాలకు ప్రతిస్పందించి - 6.30 కు ఇళ్లకేగిరి.

          బుధవారం వేకువ నాటి కృషిని మునసబు వీధి మొదట్లో కలుసుకొని కొనసాగించవలెననుకొనిరి !

       సమాజ ప్రతిబింబమనబడు!

జనపదాలకు మార్గసూచిక ! దైహికంగా బలం చేరిక!

స్వాదుతత్త్వపు - సోదరత్వపు సమాశ్వాసన ముఖ్యవేదిక !

వీధులందే విజ్ఞులిందరి - పెద్దలందరి శ్రమల కూడిక!

సమాజ ప్రతిబింబమనబడు చల్లపల్లి స్వచ్ఛ వేడుక!

 

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   04.06.2023.