2790* వ రోజు....           06-Jun-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వద్దనే వద్దు!

ఇంకొక వేకువ రిస్కీ శ్రమదానం - @2790*

          “పుణ్యం కొద్దీ పురుషుడు - దానం కొద్దీ మంచి బిడ్డలు అనేది ప్రాదెనుగు సామెతైతే కార్యకర్తల కష్టం కొద్దీ చల్లపల్లి స్వచ్ఛ - శుభ్రతలూ, ప్రజల స్పృహ కొలదీ సౌకర్యాలూ, క్రొత్త సంస్కృతులూ” అనేది నేటి సామెత!

          63 ళ్ల నాటి మాయాబజార్ సినిమాలోని ఘటోత్కచుడు ప్రస్తావించిన దుష్ట చతుష్టయం కు భిన్నంగా నేటి, స్వచ్ఛ సుందర చల్లపల్లికి చెందిన బెస్టు చతుష్టయం అనదగ్గ కార్యకర్తలూ, వాళ్ల వెన్నంటి నడిచే మరొక సీనిర్ గ్రామోద్యమకారుడూ ఈ మంగళవారం వేకువ 4.28 కే ఊరికి దూరంగా జాతీయ ఉప రహదారి మీద సంసిద్ధులూ!

          మరి ఈ ఊరి నవీన సంస్కృతి కోసం వాళ్ల 9 ఏళ్ల కృషి ఏమిటో మనకు తెలియనిదా? అదేం పద్ధతో గాని - ఈ వాలంటీర్లకు - ఊరి రోడ్ల మీద గుంటలు పడినా, డ్రైన్లు పారక నిలిచినా, బస్టాపులు శుభ్రంగా లేకున్నా, తాము నాటిన పాతిక - ముప్పై వేల మొక్కలు ఎండలకు కళ తప్పినా, శ్మశానాల సౌకర్యాలు తగ్గినా.... నిద్ర పట్టదాయె!

          ఒక ట్రక్కూ - అవసరమైన కత్తీ - కటార్లూ, మంచి నీళ్లూ వేసుకొని - ఎక్కడవసర పడితే అక్కడ బ్రహ్మముహుర్తానికే తయారు!

          మాట కామాటే చెప్పుకోవాలి - ఈ ఊళ్లో కొందరి సహకారం లేకుంటే – అనగా అయినకాడికి ఇళ్ళ వ్యర్థాల్ని రోడ్ల ప్రక్క దిమ్మరించకుంటే స్వచ్ఛ కార్యకర్తలకు కొన్నేళ్లుగా ఇంత పని దొరికేదా?

          ఇవాళ్టి విషయమే చూడండి - ఏ ఇంటి రద్దో గాని - బందరు రాదారి ప్రక్కన - పిచ్చి మొక్కల్లో ఎవరో వదలి వెళితే - మన చతుష్టయానికి గంటన్నరకు పైగా చేతుల్నిండా పని - వళ్లంతా చెమటలు పడితే పట్టింది గాని

          సచివాలయం ప్రక్కన చిన్న కార్ల స్టాండుకు అదనపు సౌకర్యం కలిగింది గదా! దీన్నే పరోక్షంగా 6.20 కి బృందావనుడనే ఆల్రౌండరుడు నినాద రూపంలో చెప్పాడు గదా!

          రేపటి వేకువ మనందరికి బందరు వీధి - మునసబు రోడ్డు దగ్గర కలుసుకోవలసిన అగత్యం ఉన్నది గదా!

          ఎలా బాగుపడు గ్రామం?

ప్రతి ఒక్కడు హక్కులడిగి - ప్రతి వ్యక్తీ రూల్సు చదివి

చల్లగా కబుర్లు చెప్పి జారుకొంటే విదేశాలకు

ఊరి కొరకు పాటుబడే ఉత్తమోత్తములు ఎవ్వరు?

ఏంలాభం? శ్రమ చేయక ఎలా బాగుపడు గ్రామం?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   06.06.2023.