1934* వ రోజు....           27-Feb-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!   

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం1934* వ నాటి శ్రమదాన సంకేతాలు.

నేటి వేకువ4.01-6.16 నిముషాల నడుమ చల్లపల్లి గ్రామానికి తమ నిస్వార్ధ శ్రమదానం చేసిన కార్యకర్తలు 25 మంది. శ్రమ సమర్పిత ప్రాంతాలు 3- గంగులవారిపాలెం దారి, బైపాస్ మార్గంలోని కమ్మ్యూనిస్టు పార్టీ కార్యాలయం, శివరామపురం బాటలోని దక్కన్ సిమెంటు దుకాణం పరిసరం.

ముందుగా పేర్కొనవలసింది గ్రామ రక్షక దళ (రెస్క్యూ టీం) చర్య.  ఊరిలోని రోడ్డు, డ్రైనులు వంటివి ఎక్కడ లోపభూయిష్టంగా ఉన్నా-(తమ పరిధిలో) వాటిని పరిష్కరించే దాకా వీళ్లకి నిద్ర పట్టదు. గంగులవారిపాలెం దారిలో బాట ప్రక్కన వ్యర్ధాలను ట్రాక్టర్ లో నింపుకొని, పెదకళ్లేపల్లి మార్గంలోని కార్యకర్తల శ్రమ స్రవంతిలో కలిసి పోయి, 6.00 దాటే దాక వీరు యథా శక్తి పాటుబడుతూనే ఉన్నారు.

సుందరీకరణ(రంగుల) ముఠాకు కమ్మ్యూనిస్టు బజారులోని CPI ఆఫీస్ భవన ప్రహరీ కాస్త సౌందర్య రహితంగా కన్పించడంతో (సదరు భవన నిర్వాహకుల అనుమతి ఆహ్వానం మేరకు) సౌందర్య మయం చేసేందుకు ఈ రోజే ప్రారంభించారు.

ఎక్కువ మంది కార్యకర్తలు శ్రమించింది మాత్రం పెద కదళీపురం దారిలోనే. వీరిలో ముగ్గురు దక్కన్ సిమెంట్ దుకాణం ప్రక్కన చిన్న పంట కాల్వను, తూములను సంస్కరించారు. పూడికలు తీసి, రాళ్లు, చెప్పులు ఏరి, గంటన్నరకు పైగా చేసిన వీరి శ్రమ ఫలించిందిగాని, ఆ వాసనకు, ఆదుమ్ముకు ఒక కార్యకర్త స్వల్ప అస్వస్తుడై- వాంతులు చేసుకొన్నాడు.  అతడు కొంచెం విశ్రాంతి తీసుకొంటున్న సమయంలో మిగిలిన కార్యకర్తలంతా డిగ్రీ కళాశాల ముందు వైపు డ్రైనులోని బహుళార్ధక అనర్ధక నానా వ్యర్ధాలను లాగి, ఏరి, పోగులు చేసి, అవసరమైనపుడు కత్తులతో నరికి, స్థలం చాలక ట్రాక్టర్ లో త్రొక్కి సర్ది డంపింగ్ కేంద్రానికి చేర్చారు.

 తాము చేసే మురుగు కాల్వల సంస్కరణలో, కంపు గొట్టే కంగాళీల సేకరణలో కాస్త అస్వస్తులు కావడం, వాంతులు చేసుకోవడం ఈ వాలంటీర్ల కు కొత్త కాదు. ఐనా-1934 రోజులుగా తమ పట్టుదలను వీడక పోవడమే వింత!

6.35 నిముషాలకు – 6 అడుగుల 5 అంగుళాల సమున్నత కార్యకర్త ముమ్మారు ప్రకటించిన గ్రామ స్వచ్చ-సుందర సంకల్ప నినాదాలతోను, వ్యక్తుల సత్ప్రవర్తన గురించి అతడు చెప్పిన సత్యాలతోను, మన నేటి గ్రామ బాధ్యతలకు తెర పడి,

రేపటి శ్రమదాన సంతృప్తి కోసం ఇదే ప్రదేశంలో- కళ్లేపల్లి దారిలోని కోళ్ల మేత కర్మాగారాల దగ్గర 4.00 కు కలుద్దాం!

        *చరిత్రలో నిలబడునది*

వాన-ఎండ-మంచులకూ భయపడనిది-ఆగనిది

సద్విమర్శలన్నిటినీ స్వాగతించి బలపడునది

తనదు లక్ష్య సాధనలో తాదాత్మ్యం చెందునది

స్వచ్చోద్యమ చల్లపల్లి చారిత్రాత్మకమైనది!

నల్లూరి రామారావు

స్వచ్చ చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

గురువారం – 27/02/2020

చల్లపల్లి.      

4.01 కు శివరాంపురమ్ రోడ్డులో
CPI office ప్రహరీ గోడకు రంగులు వేస్తున్న కార్యకర్తలు .